గురుపౌర్ణమి
“గురువు” అంటే “బరువైన వాడు” అని అర్థం
“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం .. “లఘువు”
“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం
“అధికమైన జ్ఞానం” ఉంటే గురువు .. “స్వల్పమైన జ్ఞానం” ఉంటే లఘువు
లఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరి
క్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం చేసుకుంటూ గురుత్వాన్ని సాధించుకోవాలి
“అకుంఠిత సాధన” ఉన్నప్పుడు గురుత్వం .. “కుంఠిత సాధన” వున్నప్పుడు లఘుత్వం
“అకుంఠిత సాధన” అంటే “దిన దిన రోజువారీ సరియైన సాధన”
***
గురువులు ఎప్పుడూ లఘువులకు స్ఫూర్తిదాయకులుగా ఉంటారు
“ఒకానొక వ్యక్తి సాధించింది ఏదైనా .. మరొక వ్యక్తి కూడా సాధించగలడు” ..
అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవాడే .. గురువు
“ప్రతి ఒక్కరిలోనూ సర్వక్షమతలు ఉన్నాయి” అని నొక్కిచెప్పేవాడే .. గురువు
“సాధనకు ఎప్పుడూ తహతహలాడుతూనే ఉండాలి” అని నొక్కి చెప్పేవాడే .. గురువు
“నాలాగే తయారు కా” అని చెప్పేవాడే .. గురువు
సకల విద్యలలో, సకల కళలలో, సకల ఆటలలో, సకల పాటలలో
గురువులు ఎప్పుడూ తాదత్మ్యత చెంది వుంటారు
గురువులుగా కాదలచుకున్న “లఘువు”లతో అనునిత్య సాధన చేయించేవాడే .. గురువు
***
గురువు యొక్క సాన్నిధ్యమే “గురు కటాక్షం” .. గురువు యొక్క చిరునవ్వే “గురు కృప”
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే గురువు దగ్గర కూడా “గురుత్వాకర్షణ శక్తి” ఉంటుంది
భూ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి
భూమి యొక్క ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ..
సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి
భూ గ్రహం, మరి ఇతర గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు ..
గురువులుగా కావాలని నిశ్చయించుకున్న లఘువులు
గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తిక్షేత్రం చుట్టూ సదా పరిభ్రమణం చేస్తూ ఉంటారు
గురువులు కావడానికి సంకల్పించిన వారికే గురువులు కనబడతారు, అంతేకానీ ..
ఆ విధంగా సంకల్పించని వారికి గురువులు ససేమిరా కనబడరు
నిన్నటి అకుంఠిత ధ్యానసాధనాపరుడయిన లఘువే .. నేటి గురువు
నేటి అకుంఠిత ధ్యాన సాధనాపరుడయిన లఘువే .. రేపటి గురువు
***
“గురుపౌర్ణమి” సందర్భంగా
సృష్టిలోని గురువులందరికీ శతకోటి ప్రణామాలు!
“వ్యాసపౌర్ణమి” సందర్భంగా
ఆదిగురువులైన శ్రీ వేదవ్యాసుల వారికి సాష్టాంగ ప్రణామాలు!!