“గురుదేవుళ్ళందరికీ ప్రణామాలు”
“గురు పౌర్ణిమ” నే
“వ్యాస పౌర్ణిమ” అని కూడా అంటారు
శ్రీ వేదవ్యాసులు వారు ఆది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించనవారు
కనుకనే గురుపౌర్ణమి “వ్యాస పౌర్ణిమ”గా అభివర్ణించబడింది
“వ్యాసం” అంటే “వ్యాప్తం కావడం”
ఏది వ్యాప్తం కావాలి?
మన వివేకం అన్నది వ్యాప్తి కావాలి ..
మన కరుణా హృదయం అన్నది వ్యాప్తి చెందాలి ..
మన ఆత్మవిజ్ఞానం అన్నది వ్యాప్తి చెందాలి ..
“వివేకం” అంటే ఏది మంచి, ఏది చెడు శాస్త్రీయంగా చెప్పేది
“వివేకం” అంటే ఏవి యుక్తం, ఏవి అయుక్తం అన్న వాటిని స్పష్టపరచేది
“వివేకం” అంటే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్నది తెలియజేసేది
“వివేకం” అంటే ఏది ప్రస్తుతం, ఏది అప్రస్తుతం వివరించి చెప్పేది
“వివేకం” అంటే
ఏది సమంజసం, ఏది అసమంజసం .. ఏది సందర్భం, ఏది అసందర్భం
అన్నీ అవగాహనకు తెచ్చేది
వివేకానికి మరో పేరు “జ్ఞానం”
వివేకోదయమే“జ్ఞానోదయం”
“గురుపౌర్ణిమ” అన్నది సకల గురువులకూ అంకితమైనది
కష్టపడి మనకు ఎన్నెన్నో నేర్పించిన ప్రత్యక్ష గురువులనూ ..
మరి సకల పరోక్ష గురువులనూ .. అందరినీ .. ఆత్మీయ స్మరణకు తెచ్చుకునే సమయం
“యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ సః ఆచార్యః”
“ఎవరైతే వివేకాన్నీ, జ్ఞానాన్నీ యాచిస్తారో .. స్వయంగా ఆచరణలో పెట్టుకుంటారో ..
మరి ఇతరులతో కూడా ఆచరింపచేస్తారో వారిని ‘ఆచార్యులు’ అంటారు”
***
ఆచార్యులు అందరూ కూడా నిరంతరం తమ తమ స్థాయిలలో
వివేకాన్నీ, జ్ఞానాన్నీ .. ఎప్పటికప్పుడు మరింతగా ఆశిస్తూనే, మరింతగా అర్జిస్తూనే వుంటారు ..
తమ తమ స్థాయిలలో ఆచరణలో పెట్టేందుకు మరింతగా అభ్యాసం చేస్తూనే వుంటారు ..
తమ తమ స్థాయిలలో ఇతరులచేత ఆచరింప చేయడానికి సదా కృషిచేస్తూనే వుంటారు ..
***
“మాతృదేవోభవ” .. “పితృ దేవో భవ”.. “ఆచార్య దేవో భవ”
తల్లి ప్రప్రథమ గురువు, తండ్రి ద్వితీయ గురువు
ఆచార్యులు తృతీయ గురువులు
పుట్టించిన వాళ్ళు, పెంచినవాళ్ళు అందరూ తల్లులే .. మరి తండ్రులే!
విద్యాబుద్ధులు నేర్పించే వారందరూ .. ఆత్మబోధ చేసేవాళ్ళందరూ .. మరి ఆచార్యులే!
తల్లితండ్రులందరికీ, ఆచార్య గురుదేవుళ్ళందరికీ
“గురుపౌర్ణమి” సందర్భంగా అనంతకోటి ప్రణామాలు!