ఎంత నేర్చుకుంటే అంత ఆనందం
ప్రస్తుతం ఈ భూమ్మీద జన్మతీసుకుని ఉన్న మనం అంతా కూడా వివిధ నక్షత్రలోకాలకు చెందిన వాళ్ళం. మన సూర్యుడు ఒకానొక నక్షత్రం! ఇలాంటి సౌరమండలాలు ఈ విశ్వంలో అనేకానేకం ఉన్నాయి. మన సౌరమండలంలో భూమికంటే కొన్ని వందల రెట్లు పెద్దదయిన సూర్యుని చుట్టూ భూగ్రహం, మరి భూగ్రహం చుట్టూ చంద్రుడు అనే ఉపగ్రహం తిరుగుతూ ఉంటాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి ఒక నెల పడితే సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి ఒక్క సంవత్సరం అంటే 365 రోజులు పడుతుంది.
అంటే మన కంటికి కనిపించే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు .. భూగ్రహం చుట్టూ చంద్రుడు అనే ఉపగ్రహం తిరగడానికి ఒక నెల .. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ తిరిగే చంద్రునితో సహా సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఇదంతా మన సాధారణ కంటికి కనిపించే ఖగోళవిజ్ఞానం!
ఇది కాకుండా మన సాధారణ “కంటికి కనిపించని ఖగోళవిజ్ఞానం” మరెంతో ఉంది. అందులో భాగంగానే మన సాధారణ కంటికి కనిపించని అనేకానేక సూర్యకుటుంబాలు వాటి వాటి సూర్యుళ్ళుతో సహా అనంత విశ్వంలో తిరుగుతూ ఉంటాయి.
మన సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు పెద్దదయిన “అల్సియోన్” అనే మరొక పెద్ద కంటికి కనపడని సూర్యుడి చుట్టూ “అల్సియోన్” మన సౌరకుటుంబం తిరుగుతూ వుంటుంది. అలా తిరగడానికి మన సౌరమండలానికి 26,000 సంవత్సరాల కాలం పడుతుంది.
ఈ “అల్సియోన్” అనబడే పెద్ద సూర్యుడు కూడా తన గ్రాండ్ సౌరకుటుంబాలతో కలిసి “గెలాక్టిక్ సెంటర్” చుట్టూ తిరుగుతూ ఉంటాడు! అలా తిరిగడానికి నాలుగు మిలియన్ సంవత్సరాలు పడుతుంది! ఇందులో కంటికి కనిపించే దానినంతా మనం మన సాధారణ చర్మచక్షువులతో మరి హైటెక్నాలజీ టెలిస్కోప్‌లతో చూడగలిగితే .. “కంటికి కనిపించని తతంగం” అంతా కూడా ధ్యానంలో దివ్యచక్షువు ద్వారా సూక్ష్మ శరీరయానాలు చేసి స్పష్టంగా చూడగలుగుతాం.
మెలకువగా ఉన్నప్పుడు భౌతిక శరీరంతో మనం సాధారణ “కంటికి కనిపించే ఖగోళం”తో కలిసి ఉంటాం .. మరి రాత్రి, నిద్రపోయినప్పుడు సూక్ష్మశరీరంతో కలిసి సూక్ష్మశరీరయానాలు చేసి .. సాధారణంగా “కంటికి కనపడని ఖగోళం” విహరిస్తూ దివ్యచక్షువుతో అక్కడి విశేషాలన్నీ చూస్తాం. ఉదయం లేవగానే “రాత్రి భలే కల వచ్చింది” అనుకుంటూ వుంటాం!
ఇలా సృష్టి విచిత్రాలు అన్నీ మరి .. “ఇంత అంత”అని చెప్పలేము! వాటి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే కనుక ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, మరి ఎప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి. జీవితంలో మనకు రెండు దశలు ఉంటాయి. ఒకటి “నేర్చుకునే దశ”; రెండవది “ఆనందించే దశ”. ఎంత ఎక్కువ నేర్చుకుంటామో అంత ఆనందంలో వుంటాం!
నేను “సరిగమలు” నేర్చుకోవాలంటే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ గారి దగ్గరికే పోనక్కర లేదు .. మా వీధిలో నా కంటే ఎక్కువ ఎవరు నేర్చుకున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరకు పోయి నేర్చుకుంటే చాలు. ఆ తరువాత అంతకంటే పై స్థాయి సంగీతం ఆ పై స్థాయివాళ్ళ దగ్గరికి వెళ్ళి సహజంగానే నేర్చుకుంటాం.
అలాగే సంస్కృతం నేర్చుకోవాలంటే మహాకవి కాళిదాసు దగ్గరికి మాత్రమే పోనక్కర లేదు. సంస్కృతంలో నా చుట్టూ ఎవరికి నాకంటే ఎక్కువ జ్ఞానం ఉందో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకుంటూంటే .. ఇంకా ఇంకా ఆపై స్థాయి వాళ్ళు సహజంగానే భవిష్యత్తులో మనకు దొరుకుతూనే ఉంటారు.
“నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవాడికి” చుట్టూ వున్న పరిస్థితులు, ప్రకృతి మరి సమాజం ప్రతిక్షణం నేర్పిస్తూనే ఉంటాయి. ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి. చదువుతూ, చదువుతూ అన్నీ నేర్చుకోవాలి; ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి, చూస్తూ చూస్తూ అన్నీ నేర్చుకోవాలి!
ముఖ్యంగా చక్కటి విజ్ఞానాన్ని పంచే ఆధ్యాత్మిక చిత్రాల కోసం “Spiritual movies.com” అనే ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉంది. “జోనాథన్ లివింగ్‌స్టన్ సీగల్” .. “పీస్‌ఫుల్ వారియర్” .. “యూ కెన్ హీల్ యువర్ లైఫ్” .. “ఇన్‌కార్‌నేషన్” .. “సెలెస్టియన్ ప్రోఫెసీ” .. “ఎస్టర్‌డేస్ చిల్డ్రన్” .. “ది బిట్ ఇండిగో” .. “కన్వర్సేషన్స్ విత్ గాడ్” .. “ది లైఫ్ ఆఫ్ బుద్ధా” ఇలా ఎన్నో, ఎన్నెన్నో!!
ఎంత నేర్చుకుంటే అంత ఆనందం!!!