ఏడుపు ఉండకూడదు

 

దేవుళ్ళం అయిన మనం అంతా కూడా జీవుడిలా “జీవితం” అనే ఈ నాటక రంగంలో నిరంతరం మన పాత్రలను పోషిస్తూవుంటాం. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా రకరకాల పాత్రలను రసవత్తరంగా పోషిస్తూ .. నాటకం అయిపోగానే పారితోషికం తీసుకుని వెళ్ళిపోయే కళాకారుల్లా ఏదో ఒకనాడు మనం అంతా కూడా అనుభవజ్ఞానం అనే పారితోషకంతో ఈ జీవితం లోంచి నిష్క్రమిస్తాం!

మళ్ళీ ఇంకొక నాటకంలో ఇంకొక వైవిధ్యభరితమైన పాత్రకోసం ప్రణాళికలు వేస్తూ పైలోకాలలో కొంతకాలం ఉంటాం! ఇదంతా మరచిపోయి .. “నాటకమే శాశ్వతం” అనుకుని “నా భార్య, నా మొగుడూ, నా పిల్లలూ” అనుకుంటూ “ఏడేడు జన్మల బంధాలు” గా వారితో పెనవేసుకునిపోవడం మూర్ఖత్వం మరి అజ్ఞానం.

కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడి కోసం ఏడుస్తూన్న అర్జునుడిని శ్రీకృష్ణుడు పైలోకాలకు తీసుకుని వెళ్ళి అక్కడ అతనికి హాయిగా ఉన్న అభిమన్యుడిని చూపించాడు.

“కుమారా!” అంటూ ఆత్రంగా దగ్గరకు వెళ్ళిన అర్జునుడిని విచిత్రంగా చూసిన అభిమన్యుడు “ఎవరు మీరు?!” అని అడిగి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. అప్పుడు గానీ అర్జునుడికి కళ్ళు తెరుచుకోలేదు! ఈ ఆత్మవిజ్ఞానాన్నంతా మనకు అందించేదే ధ్యానం!

ధ్యానం ద్వారా మన కళ్ళను ఆవరించి ఉన్న మాయను తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. ఆత్మవత్ జీవితాన్ని హాయిగా జీవిస్తూనే ప్రతిక్షణం ప్రతి ఒక్కరి దగ్గరినుంచీ మరి ప్రతి ఒక్క సంఘటన నుంచీ విశేషంగా పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న కళలన్నీ ఔపోసన పట్టాలి; నవీన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టాలి; సరస్వతీ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోవాలి.

“జీవితంలో ఏదయినా ‘ఉంటే’ లాభమే .. కానీ ‘లేకపోతే’ మాత్రం నష్టంలేదు కనుక పండితుడు ఎప్పుడూ గతించిన దానికోసం కానీ .. గతించబోయే దానికోసం కానీ ఏడవడు!” అని తెలుసుకోవాలి.