ఏదీ వరం కాదు .. ఏదీ శాపంకాదు
మనం అందరం కూడా మన జీవితాన్ని ఏ రోజుకారోజే ఉన్నతోన్నతంగా జీవించాలి. ఒక్క క్షణం కూడా వృధగా జీవించరాదు; ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడరాదు.
మన శరీరాన్ని .. మన మనస్సునూ మరి మన బుద్ధినీ ప్రతిక్షణం ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటూ అప్రమత్తతతో జీవించాలి. శరీరానికి ఎప్పుడూ ఆకలి వేస్తూ ఉంటుంది. కనుక శ్రద్ధగా దాని ఆకలిని తీరుస్తూనే ఉండాలి; మనస్సుకు ఎప్పుడూ అశాంతి ఉంటూ ఉంటుంది కనుక సహనంతో దానిని తొలగిస్తూనే ఉండాలి; బుద్ధిలో ఎప్పుడూ మాంద్యం వచ్చి చేరుతూ ఉంటుంది కనుక ఎరుకతో ఆ మాంద్యాన్ని తీసేస్తూనే ఉండాలి. శ్రద్ధ, సహనం మరి ఎరుకల యొక్క స్తోత్రస్థానం ధ్యానమే కనుక నిరంతర ధ్యానసాధనతో ఎప్పటికప్పుడు వాటిని మరింతగా సానబెట్టుకుంటూ ఉండాలి.
ధనలాభం కంటే మిత్రలాభం ఎంతో గొప్పది. కనుక ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణితో మిత్రత్వం నెరపగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ధనలాభం మనకు ఈ లోకంలోనే కొంతవరకు ఉపయోగపడితే మిత్రలాభం అన్నది ఈ లోకంతో పాటు పరలోకంలో కూడా ఉపయోగపడుతూ అక్కడి మాస్టర్లందరినీ మనకు చేరువ చేస్తూ ఉంది.
“ఈ ప్రపంచంలో ఏదీకూడా మనకు శాపమూ కాదు .. వరమూ కాదు” అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనకు ఉన్న జ్ఞానాన్ని బట్టి మరి మనం స్వీకరించే విధానాన్ని బట్టే మనకు వరం “శాపం” అవుతుంది .. శాపం “వరం” అవుతుంది.
బ్రిటిష్ ప్రభుత్వం వారు స్వాతంత్ర్య సమర యోద్ధులు బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్టు చేసి అండమాన్ జైల్‌లో ఉంచినప్పుడు .. ఆయన అయిదు సంవత్సరాల పాటు అక్కడ హాయిగా కూర్చుని భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసారు! బ్రిటీష్ వారు ఇచ్చిన శాపాన్ని కాస్తా ఆయన తనకు వరంలా మలచుకుని లోకానికి ఒక చక్కటి గ్రంథాన్ని అందించారు.
ఒకానొక అజ్ఞాని ప్రతి ఒక్క వరాన్నీ ఒక శాపంలా మలచుకుంటే .. ఒకానొక సుజ్ఞాన్ని ప్రతి శాపాన్ని ఒక వరంలా మలచుకుని జీవిస్తూ ఉంటాడు.
పిరమిడ్ మాస్టర్లందరూ శాపాలను వరాలుగా మలచుకుని నిరంతరం లోకకల్యాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వుంటారు!