ధ్యానమేవ శరణం వయం

 

 

మార్గం మాత్రం ఒక్కటే
సమస్యలు ఎన్నెన్నో .. పరిష్కార మార్గం మాత్రం ఒక్కటే
ప్రశ్నలు ఎన్నెన్నో .. సమాధానాలు పొందే మార్గం మాత్రం ఒక్కటే
బలహీనతలు ఎన్నెన్నో .. బలం పుంజుకునే మార్గం మాత్రం ఒక్కటే
సంశయాలు ఎన్నెన్నో .. నివృత్తి చెందించే మార్గం మాత్రం ఒక్కటే
భిన్న భిన్న దృక్పథాలు, వ్యత్యాసాలు ఎన్నెన్నో .. ఏకీకరణ మార్గం మాత్రం ఒక్కటే
దుఃఖాలు ఎన్నెన్నో .. దుఃఖ నివారణోపాయ మార్గం మాత్రం ఒక్కటే
అజ్ఞానరీతులెన్నెన్నో .. జ్ఞానరీతి మాత్రం ఒక్కటే
ధ్యానం అన్నది సకల దుఃఖాల నివారిణి
భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే శారీరక రోగాలను, మానసిక దుఃఖాలను ఇక రాకుండా చేసేదే ధ్యానం
ధ్యానం సకల దుఃఖాల హారిణి
వర్తమానంలో అనుభవిస్తూన్న శారీరక రోగాల మానసిక దుఃఖాల నుంచి ముక్తిని ప్రసాదించేదే ధ్యానం
ధ్యానం సకల భోగాల కారిణి
ధ్యానం ద్వారా మనలోని దోషాలన్నీ తొలగి గుణాలన్నీ అభివృద్ధి చెంది 
ఎడతెరిపి లేని .. భోగాల పరంపరకు మనం వారసులం అవుతాం
మనలోని దోషాల ద్వారా .. రోగాలు సంభవిస్తాయి .. ఉద్భవిస్తాయి
మనలోని గుణాల ద్వారా భోగాలు కలిగించుకుంటాము
ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని
అనునిత్య ధ్యాన అభ్యాసం ద్వారా సత్యమైన నిత్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాం
ఆత్మ అన్నది నిత్యమైనది .. సత్యమైనది
ఆత్మ అన్నది అజరామరమైనది
ఆత్మ అన్నది సనాతనమైనది .. శాశ్వతమైనది
సృష్టి అంతా కూడా బృహత్ ఆత్మ యొక్క విరాట్ స్వరూపమే
సృష్టి అంతా కూడా విరాట్ ఆత్మ యొక్క బృహత్ క్రీడాలీలా విన్యాసమే
“మమాత్మా సర్వభూతాత్మా”
అంటే
“నా యొక్క ఆత్మయే .. నిరంతరంగా వుండే నేనే .. సర్వభూతాల యొక్క విరాట్ ఆత్మ కూడా”
ధ్యాన సాధన ద్వారా ఈ విధమైన “అనుభవ జ్ఞానం” మనకు కలుగుతుంది
కనుకనే ధ్యానం అన్నది “సత్య జ్ఞాన ప్రసాదిని”
ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికీ .. ప్రతి పండితుడికీ, ప్రతి పామరుడికీ ..
ప్రతి బాలుడికీ, ప్రతి బాలికకూ .. ప్రతి ధనికుడికీ, ప్రతి పేదవాడికీ
ప్రతి రోజూ విశేషంగా అవసరమైనదే .. రోజువారీ ధ్యానసాధన
మన అందరికీ ధ్యానం ఒక్కటే శరణ్యం
ధ్యానమేవ శరణం వయం