ధ్యానమే జీవితం
నా జీవితం చాలా వరకు ఏ లోటు లేకుండా ఆనందంగానే సాగిందని చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్య, తమ్ముడు, స్నేహితులు .. అంతా కూడా నాకు ప్రేమను పంచుతూ నా పట్ల ఎంతో అభిమానంగా వుండేవారు.
చదువుతో పాటు నా సంగీతసాధన, ఆటలూ, పాటలూ, ఉద్యోగం, సంసారం .. అందరిలా అతి సాధారణంగా గడిచిపోతున్నా కూడా .. నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా వుండనీయకపోయేది. ” ఏదో చెయ్యాలి ” అనిపించేది కానీ .. ఆ చెయ్యాల్సింది ఏమిటో తెలిసేది కాదు. అయితే 1976 సంవత్సరం నుంచి ధ్యానం చెయ్యడం మొదలు పెట్టాక మాత్రం .. నా మనస్సు సంపూర్ణంగా శాంతించి .. నా లోని ఆరాటానికి ఒక స్పష్టమైన మార్గం దొరికనట్లయ్యింది.
1979 సంవత్సరానికి సంపూర్ణంగా ఆత్మజ్ఞానం లభ్యమయ్యింది. ఈ విధంగా అటు సంసారం .. ఇటు ధ్యానసాధన అలా సాగుతూనే ఉండగా ఉండగా .. ఒకానొక సమయంలో నాలో ఏదో తెలియని వైరాగ్యం : ” ఈ సంసారం ఈ ప్రపంచం .. ఈ గోల .. ఇదంతా ఎందుకు? హాయిగా అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతే బాగుంటుందేమో?! ” అనిపించింది. కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుని క్షణకాలంలో హిమాలయాలకు వెళ్ళిపోయాను. అక్కడి అందాలన్నీ తిలకించి అక్కడి ప్రశాంతతను అనుభవించి తృప్తిగా తిరిగి వచ్చేసాను.
ధ్యానంలోంచి బయటికి వచ్చాక కూర్చుని ఆలోచించాను. ” హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తాం?! అసలు అక్కడ నేర్చుకోవడానికి ఏం వుంది ?! నేర్చుకోవాల్సిందంతా ఇక్కడే ఈ సంసార ప్రపంచంలోనే వుంటూనే నేర్చుకున్నాను కనుక ఎక్కడ నేర్చుకున్నదానిని అక్కడే మరింత సాధన చేసి సంసార ప్రపంచంలోని సంసారులందరికీ పంచాలి ” అని బలంగా అనిపించింది! అంతే .. ఇక నా లక్ష్యం నాకు సుస్పష్టం అయ్యింది.
అలా ఒక క్షణంలోనే నాకు ‘ వైరాగ్యం ’, ‘ సన్యాసజీవితం ’ అన్నీ అయిపోయి .. హిమాలయాలకు కూడా వెళ్ళివచ్చేసి ఒక ‘ బుద్ధుడి ’ లా నా కర్తవ్యాన్ని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇంట్లోనే వుంటూ .. ఉద్యోగ ధర్మాన్ని మరింత నైపుణ్యంగా నిర్వర్తిస్తూ .. ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడ అందరికీ ధ్యానాన్ని నేర్పించడం మొదలుపెట్టాను. ఆత్మజ్ఞానాన్నీ, దుఃఖనివారణోపాయాలనూ అందరికీ చెప్తూ వచ్చాను.
మిత్రుడు ” శ్రీ రామచెన్నారెడ్డి ” గారి ద్వారా నేను ఈ ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఈ విద్యను నేను ఒక గురువు ద్వారా నేర్చుకోలేదు కనుక నేను కూడా ఎవ్వరికీ గురువును కాను ; ఒక మిత్రుడి ద్వారా నేను ఇంతగొప్ప విద్యను నేర్చుకుని బుద్ధుడి ని అయ్యాను కనుక ఒక ‘ మైత్రేయ బుద్ధుడి ’ ని. ఆ తర్వాత అందరికీ నా స్నేహహస్తం చాస్తూ ముందుకు సాగుతున్నాను.
నా లోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశేషంగా తట్టిలేపిన కారుణ్యమూర్తి .. లోబ్‌సాంగ్ రాంపా! 1979 లో ఈ టిబెట్ మహాయోగి వ్రాసిన విజ్ఞాన దాయకమైన పుస్తకం ” ” నేను చదవడం జరిగింది. అందులోని శాస్త్రీయజ్ఞానం నేను చేరుకోవాల్సిన స్థితులను నాకు తెలియపరచింది. దివ్యచక్షువు గురించీ, సూక్ష్మశరీరయానం గురించీ, ఆకాశిక్ రికార్డు ల గురించీ, మరి మరణానంతర జీవితం గురించిన తమ స్వానుభవాలను తిరుగులేని విధంగా అందించిన లోబ్‌సాంగ్‌రాంపా గారు నన్ను కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడి లా మలిచారు.
అటు తరువాత వందల సంవత్సరాల వయస్సున్న శ్రీ సదానందయోగిగారు .. కర్నూలుకు వచ్చి .. అక్కడ ” నా భాగ్యమా ” అన్నట్లు నా కోసం ఆరేళ్ళు నిరీక్షించారు. ” దివ్య ప్రణాళిక ” ప్రకారం అనుకున్నట్లుగానే వారిని కలిసి వారి సాంగత్యంలో రెండు సంవత్సరాల పాటు నేను పొందిన అద్భుతజ్ఞానం వెలకట్టలేనిది.
” సుభాష్ ! నువ్వు మాంసపిండానివి కాదు .. మంత్రపిండానివి! ” అని చెప్పి నాకు దిశానిర్దేశనం చేసి తమ ఆత్మస్ఫూర్తి నాకు అందించారు. తాము వచ్చిన పని పూర్తయ్యిందని ప్రకటించి .. ముందుగానే నిర్ణయించుకున్న తేదీ మరి సమయం ప్రకారం హాయిగా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేశారు.
” చేస్తే చెయ్యి .. లేకపోతే చావు” అన్నదే గురువు గారి ఆజ్ఞ! వారి ఆజ్ఞానుసారం ధ్యానప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి 2004 – ధ్యానాంధ్రప్రదేశ్ .. 2008 – ధ్యానభారత్ .. 2012 – ధ్యానజగత్ లు పూర్తిచేసుకుని .. 2016 – శాకాహార జగత్ .. 2020- పిరమిడ్ జగత్ ల పరిసాధనకై ముందుకు సాగుతున్న క్రమం అందరికీ తెలిసిందే.
” ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే వుంటుంది ” అన్న సత్యాన్ని తెలుసుకున్నాను ; ప్రపంచం మారదు. ” ధ్యానం ద్వారా మనలో వున్న అశాస్త్రీయతను సరిచేసుకుని చూస్తే .. ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కటీ మనకు అద్భుతంగా కనపడుతూ వుంటుంది ” అన్న అవగాహనను పొందాను. ” మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది. మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తోందో ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది ” అన్నది మనం అందరం తెలుసుకోవలసిన సత్యం.
ముళ్ళకంపలతో నిండిన అడవిలో మనం నడవాలి అంటే ఆ అడవిలో వున్న ముళ్ళకంపలన్నింటినీ మనం ఏరవలసిన పనిలేదు. కేవలం మన కాళ్ళకు చెప్పులు వేసుకుని నడిస్తే చాలు .. క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి అంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పనిలేదు. మన దృక్పధాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ .. సృష్టిలో వున్న ప్రతి ఒక్క వ్యక్తీకరణపట్ల గౌరవభావంతో మెలుగుతే చాలు. మనం ఆనందంగా వుంటే అందరూ ఆనందంగానే వుంటారు. ” ఎవరి వాస్తవానికి వారే ‘ కర్త ’, ‘ కర్మ’, ‘ క్రియ ’ ” అన్న సత్యాన్ని ఎరుకలో వుంచుకుని జీవించాలి.
మానవ నాగరికతలో మాంసాహారం అన్నది తరతరాలుగా వస్తోంది. ” ఇది ఒక తప్పు పని ” అని కానీ .. ” దానివల్ల మేము ఒక జీవిని హింసిస్తూన్నాము ” అన్న అవగాహన కానీ చాలా మందికి లేదు. కోడి, మేక, రొయ్య, చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించడాన్నే జీవనాధారంగా ఎన్నో వేల కుటుంబాలు తమ వ్యాపారం చేసుకుంటున్నాయి.
” తోటి ప్రాణులను పెంచి సంహరిస్తున్నాము ” అన్న కనీస మానవత్వపు భావన అన్నది లేకుండా వారు దానిని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. తినేవారు కూడా .. ” చనిపోయిన జంతువుల మృత కళేబరాలను తింటున్నాం ” అన్న ఎరుక లేకుండా దానిని మామూలు ఆహారంలాగే తింటూ .. అనేకానేక రోగాల బారిన పడుతున్నారు.
సర్వదుఃఖాలకూ మూలకారణం అయిన మాంసాహార భక్షణను నిరసించాలి మాంసాహారం తక్షణమే మానాలి .. జీవహింసను ప్రోత్సహించే సకల అనర్థాలనూ నిరోధించాలి. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం వల్ల మనం యోగులుగా మారుతాం .. మరి మాంసాహారం మానడం వల్ల శారిరక శుద్ధి జరుగుతుంది. ఈ రెండు రకాల శుద్ధులు అన్నవి తప్పక జరిగితేనే మనం ఆత్మపరంగా అత్యున్నతమైన స్థితికి చేరుకుంటాం.
ఈ భూగ్రహం చరిత్రలో ఇంతవరకూ ఎంతో మంది బుద్ధుళ్ళు వచ్చారు .. మరెంతోమంది బుద్ధుళ్ళు భవిష్యత్తులో కూడా వస్తారు. అయితే ” సత్యయుగ కాంతి కార్యకర్తలు ” గా ఈ భూమి మీదకు వచ్చే వారిని బుద్ధుళ్ళుగా గుర్తించడం సామాన్య జనాలకు చాలా కష్టం. అందరిపట్ల స్నేహపాత్రులై వుంటూ,కరుణను కురిపించే వాళ్ళే మైత్రేయ బుద్ధుళ్ళు మరి రాబోయే కాలంలో ఈ భూమ్మీద పాదం మోపేవాళ్ళంతా కూడా ఆ మైత్రేయబుద్ధుడి ప్రతిరూపాలే.
అసలు జీవితం అన్నదానిని మనం ” సాహసోపేతం ” గానే జీవించాలి. చేసిందే చేస్తూ, విన్నదే వింటూ, తిన్నదే తింటూ, చూసిందే చూస్తూ సమయాన్ని గడిపేస్తూంటే .. అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ఇది గొంగళి పురుగులాంటి జీవితం.
ఎప్పటికప్పుడు క్రొత్త మనుష్యులను కలుస్తూ .. క్రొత్త క్రొత్త ప్రదేశాల్లో సంచరిస్తూ .. క్రొత్త క్రొత్త ధ్యానానుభవాలను పొందుతూ వుంటే .. జీవితం ఒక పండుగలాగా వుంటుంది. ఇది సీతాకోకచిలుకలాంటి జీవితం! ఇలాంటి అద్భుతమైన జీవితాన్నే ” సాహసోపేతమైన జీవితం ” అంటాం.