ధ్యానం చేస్తే చప్పట్లు .. లేకుంటే ఇక్కట్లు

 

“జీవితంలో ప్రతి క్షణం ‘వైభోగం’ అన్నది ఉండాలి. అసలు మానవ జీవితం యొక్క మౌలికమైన పరమార్థం .. ఏ పని చేస్తున్నా సరే ప్రతి క్షణం వైభోగంగా జీవించడమే! “సూర్యుడూ, చంద్రుడూ, వెన్నెలా, నక్షత్రాలూ, కొండలూ, కోనలూ ఇలా .. ప్రకృతిలోని అందాలన్నీ చూసి ఆనందించడానికే మనకు రెండు కళ్ళు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న సంగీతాన్నంతా వినడానికే రెండు చెవులు ఉన్నాయి. కాళిదాసు మహా కవి సూర్యోదయాన్ని చూసి తన్మయత్వం చెంది గొప్ప గ్రంథమే వ్రాశారు. రామకృష్ణ పరమహంస ఆకాశంలో పక్షులు హాయిగా ఎగరడం చూసి తన్మయత్వంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అదీ వైభోగం అంటే!

“కనుక ‘జీవితం’ అన్నది వైభోగంగా జీవించడం కోసమే ఉంది! ఇక్కడ వైరాగ్యం అన్న స్థితికి తావే లేదు! వైరాగ్యం అన్నది ప్రకృతి విరుద్ధమైనటువంటి అసహజ ధోరణి! అందుకే .. ‘బ్రతుకంటే ఆట అంట .. బ్రతుకంటే పాట అంట .. బ్రతుకంటే నాట్యమంట .. బ్రతుకంటే నాటకమంట .. వైరాగ్యం వద్దంటరో .. అన్నలార! వైభోగం ముద్దంటరో .. ధ్యానాము చేద్దామురో .. అన్నలార శ్వాసాను పడదామురో!’ ..

” ‘ధ్యానం చేస్తూంటేనే మనకు ‘ఈ జీవితం అంతా కూడా ఒకానొక నాటకరంగం’ అనీ ‘ఇందులో మనం అంతా కేవలం పాత్రధారులం’ అనీ ఎరుకతో కూడిన అవగాహన వస్తుంది. ‘ఇందులో నేను భర్తలా, భార్యలా, తల్లిలా, తండ్రిలా, కూతురిలా, కొడుకులా, గురువులా, శిష్యుడిలా ఇలా నాకు అప్పజెప్పబడిన పాత్రకు తగ్గట్లు చక్కగా నటిస్తున్నాను’ అన్న సత్యం తెలుస్తుంది. ఈ సత్యాన్ని మరచిపోయిన మరుక్షణం .. కర్మసిద్ధాంతం ఎలా పుటం పెడుతుందో కూడా తెలుస్తుంది.

“అందుకే ‘నానాటి బ్రతుకు నాటకము’ అంటూ అన్నమాచార్యుల వారు మరి ‘ఈ జీవితం ఒక నాటకరంగం .. ఇందులో మనం అంతా కేవలం పాత్రధారులం’ అంటూ విలియం షేక్స్‌స్పియర్ గార్లు మనకు తెలియజేశారు. కాబట్టి ఈ జీవిత నాటకం వేస్తూనే మనం ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవాలి.

“ఇలాంటి నేర్చుకునే క్రమంలో అప్పుడప్పుడూ తప్పటడుగులు పడినా .. తమాయించుకుని నాటకాన్ని రక్తికట్టిస్తూ పూర్తి చెయ్యాలి! నాటకం మధ్యలో నుంచి విరమించుకోగూడదు. వైరాగ్యం కానీ, ఏడుపుకానీ ఉన్న జీవితాలు అనారోగ్యాలకు నిలయాలు అవుతాయి కనుక వైరాగ్యాన్నీ మరి ఏడుపులనూ వదిలిపెట్టి జీవితాన్ని ఒక ఆటలా ఆడుకోవాలి!

“ఒక వైపు ధ్యానం చేస్తూ .. చక్కటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ .. ఇంకోవైపు హాయిగా సంసారాన్ని కూడా నిర్వహించుకోవాలి. ఒకవైపు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మరి ప్రకృతి అందాలకు పరవశించిపోతూ .. ఇంకోవైపు హాయిగా ఉద్యోగ విధులు నిర్వహించుకోవాలి. సంసారంలోనే నిర్వాణం చెందుతూ వైభోగంగా జీవించాలి!!