ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం
“ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం! డాక్టర్లకూ, ఉద్యోగస్థులకూ, వ్యాపారవేత్తలకూ, గృహిణులకూ, విద్యార్థులకూ మరి యువతకూ .. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం ఎంతో, ఎంతెంతో అవసరం. ‘నేను మనిషిని’ అనుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ జీవితంలో భాగం చేసుకుని తీరాలి.
“ధ్యానం గురించి తెలియని మనిషి పశువుతో సమానం! అతడు ‘ద్విపాద పశువు’ అని పిలువబడతాడు. ధ్యానం చేస్తూ తనలోని శివుడుని తాను దర్శిస్తూ .. తన కర్తవ్య కర్మలను తాను ఆచరిస్తూ .. మరి నలుగురికీ ధ్యానం తెలియజేస్తూ సమాజంలో ఉన్నతంగా జీవించేవాడు ‘పశుపతి’తో సమానం. ‘ధ్యానం’ .. పశువులాంటి ఏమీ తెలియని మనిషికి .. అన్నీ అనుభవపూర్వకంగా తెలియజేసి ‘పశుపతి’గా పరిమారుస్తుంది. అతనికి జీవితం విలువలను తెలియజేసి తనను తాను ఉద్ధరించుకుంటూ ఇతరులకు కూడా ఉపయోగపడేలా చేస్తుంది.
“అందుకే పశుపతి అయిన శివుడు కూడా ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. ఆయనకు కూడా భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. కైలాస పర్వతం అనే లంకంత కొంప ఉంది. ఈ ప్రపంచాన్ని నిర్వహించవలసిన పెద్ద ఉద్యోగం ఉంది. అవన్నీ ఆయన తన ధ్యానంలోనే నిర్వహించుకుంటాడు!
“మనం కూడా ఇతోధికంగా ధ్యానం చేద్దాం. చక్కగా మన ప్రాపంచిక పనులన్నింటినీ మరింత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ మనల్ని మనం పశుపతులుగా తీర్చిదిద్దుకుందాం!!