ధ్యానానికి ముందు, తరువాత

 

‘కోరిక’ కూ, ‘అవసరాని’ కీ గల తేడా ఏమిటంటే “ప్రకృతి మన అవసరాలను అన్నింటినీ తీరుస్తుంది. మనం మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకుంటే మన ప్రాపంచిక అవసరాలన్నీ తీరుతాయి. దాని ద్వారా మన ప్రాపంచిక కోర్కెలూ ఈడేరుతాయి. అందుకే ‘ధ్యాని’ కానివాడు ‘భోగి’ కాలేడు.”

యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్నవేశాడు. “సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?” ధర్మరాజు దానికి సమాధానంగా “మృత్యువు” అని సమాధానం చెప్పాడు. నిజంగా మృత్యువు చాలా ఆశ్చర్యకరమైనది. అందరికీ వస్తున్న ఆ మృత్యువు “నాకు రాదులే,” అనుకుంటాడు అదే ఆశ్చర్యం. చావులేని బ్రతుకు, బ్రతుకు లేని చావు, ఎక్కడా లేవు.

ధ్యానం చేయనివాడు ‘B.C.‘ నాటి వాడు . . . ‘B.C.‘ అంటే ‘Before Christ‘ అంటే, Before Christ Consciousness. అంటే జ్ఞానోదయం అవ్వకముందరివాడు అంటే, ఆత్మజ్ఞానం పొందని వారందరూ ‘B.C.‘ నాటి వారే. జ్ఞానోదయం పొందనివాడు, కుటుంబంలో ఎవరూ చనిపోయినా ఏడుస్తూ వుంటాడు. ప్రతిదానికీ ఏడుపే వీడి లక్షణం. ధ్యానం చేసినవాడు ‘A.D.‘ వాడు. అంటే ‘After Death‘ నాటి వాడు. నువ్వు చనిపోతేనే మళ్ళీ జీవించేది. ధ్యానం చేసేవాడు చనిపోయి, నూతన జన్మను తీసుకున్నవాడు. ధ్యానం చేసేవాడు, చావు అంటే ఒక తమాషా అని తెలిసినవాడు. చావు అంటే భయం అనుకునేవాడు ‘B.C.‘ నాటివాడు. ‘ చావు ‘ అన్నదే లేదు అని తెలుసుకున్నవాడు ‘A.D.‘ నాటి వాడు.

నూతనత్వమే ఒక ఉత్సవం. ఎక్కడ ధ్యానం వుందో అక్కడ నిత్య నూతనత్వం వుంటుంది. నీ సరి అయిన మాటల ద్వారా ఎదుటివారిని ఒక సుందర శిల్పంగా మలచుకోవాలి. గౌతమబుద్ధుడు అనేకమందిని తనకు కావలసిన విధంగా మలచుకున్నాడు. చక్కని మాటలు నేర్పే విద్య, ఆధ్యాత్మిక విద్య. మాటలు మాట్లాడకుండా వుండటం వస్తేనే మాట్లాడడం అనేది వస్తుంది. నీ మాటలు ఆత్మ యొక్క తూటాలు కావాలి.

ధ్యానానికి ముందు ధ్యానం తరువాత
1. చావుకు ఏడుస్తాడు. 1. ‘చావు’ కు ఏడవడు
2. మాటలు సవ్యంగా మాట్లాడడు. 2. అవసరమైతేనే మాట్లాడుతాడు.
3. “నేను చేశాను” అంటాడు. 3. “నేను లేదు” అని తెలుసుకుంటాడు.
4. “మరణమే చివరిమెట్టు” అనుకుంటాడు. 4. “మరణం తరువాత ‘నేను’ ఉంటాను” అని తెలుసుకున్నవాడు.