ధ్యాన ఫలం

 

ప్రతి కార్యం వెనుకా ఒక నిర్దిష్టమైన కారణం వుంటుంది. ఈ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందుగోరతామో, ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో, అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది.

ప్రతి కార్యం ఒకానొక ఫలాన్నిస్తుంది.

దుష్కార్యాలు దుష్ఫలాలనిస్తాయి; సుకార్యాలు సుఫలాలనిస్తాయి.

చక్కటి సుగంధ పుష్పాలతో, తియ్యటి సుమధుర ఫలాలతో విరాజిల్లుతూ వున్న మనం, ఎంత చూడముచ్చటగా వుంటుందో ..

పుష్పాలతో, ఫలాలతో వృక్షాలు తమను తాము అలంకరించుకోవటమే కాకుండా తమను తాము అర్థవంతం చేసుకోవటమే కాకుండా, మిగతా సృష్టినంతటినీ అలరింప చేస్తాయి.

అలాగే ధ్యాన పుష్పాలతో, ధ్యానఫలాలతో విలసిల్లని మానవ జీవితాలు మృతప్రాయమైన జీవితాలు.

ధ్యానసాధన ద్వారా పొందే ఫలాలు దివ్య ఫలాలు.

తస్మాత్ యోగీ భవార్జున|| అన్నారు శ్రీకృష్ణుడు; దాని అర్థం – ధ్యాన ఫలాలు పొందవోయ్; బడ్డూ, అని.

ఇక మనం చేసేది ఏముంది? వెధవది తప్పేటట్లు లేదు; శ్రీకృష్ణుని ఆదేశం జవదాటలేం గదా?

తప్పదు, శిరసావహించవలసిందే ..

ఆనాపానసతి – విపస్సన ధ్యాన పద్ధతిని ప్రచారం చేయటమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం.

దుఃఖరాహిత్యమే, జన్మరాహిత్యమే, మనం అందరం కోరుకునే, ఆశించే ధ్యానఫలం.

సంగీత సాధన చెయ్యకపోతే సంగీత ఫలం దక్కదు.

వ్యవసాయ సాధన చెయ్యకపోతే వ్యవసాయం ఫలం దక్కదు.

వ్యాపార సాధన చేయకపోతే వ్యాపార ఫలం సిద్ధించదు.

అలాగె ధ్యానం చేయకపోతే ధ్యాన ఫలం లభించదు. ధ్యానం చేస్తేనే ధ్యాన ఫలం లభిస్తుంది.

ధ్యాన విందు భోజనానికి ముముక్షువులందరూ ఆహ్వానితులే; ప్రవేశ రుసుము లేదు.

పిల్లలూ, పెద్దలూ, వృద్దులూ … ఆల్ ఆర్ వెల్‍కమ్ .. సకల దేశకాల పరిస్థితులలోనూ విందు భోజనం రెడీ రెడీ; రకరకాల ఫలాలు; రకరకాల క్రొత్త రుచులు; రకరకాల క్రొత్త అనుభవాలు.

ఇక మాటలు కట్టిపెట్టి కార్యం మొదలు పెడదాం; కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడదాం; ఎక్కడి వారు అక్కడే గప్ చుప్.