ధ్యాన నేత్రం
మనిషికి నాలుగు చక్షువులు ఉంటాయి.
మొదటిది చర్మచక్షువు, రెండవది మనోచక్షువు
మూడవది దివ్యచక్షువు, నాల్గవది జ్ఞానచక్షువు.
ధ్యాననేత్రం అంటే దివ్యచక్షువు.
చిత్తం వృత్తి రహితమైన పరిస్థితిలో వ్యక్తమయ్యేదే ధ్యాననేత్రం.
ధ్యాన నేత్రమే జ్ఞాననేత్రానికి నాంది.
ధ్యానచక్షువు వినా జ్ఞానచక్షువు అసంభవం.
మనోచక్షువు వికసించిన వారే కవీశ్వరులు.
ధ్యానచక్షువు వికసించిన వారే యోగీశ్వరులు.
జ్ఞానచక్షువు వికసించిన వారే పురుషోత్తములు, లేక బుద్ధుళ్ళు.
మానవుడికి వున్న షట్చక్రాలలో ఆరవ చక్రం జ్ఞాననేత్రం.
ఆజ్ఞాచక్రమే ధ్యానచక్షువు స్థానం. అంటే భ్రూమధ్యం.
ఈ ధ్యానచక్షువు అనే దివ్యచక్షువు ఉత్తేజితం కావాలంటే ఆ స్థానం క్రింద స్విచ్ వుంది. అదే నాసిక.
నాసికలో అటూ ఇటూ ప్రవహిస్తూన్న వాయు ప్రవాహాన్ని గమనించడమే స్విచ్ నొక్కడం అంటే, అదే ఆనాపానసతి. అప్పుడు వెంటనే ఉత్తేజితమౌతుంది ధ్యాననేత్రం.
శివుడు ముక్కంటే. అంటే, పరిపూర్ణమైన దివ్యచక్షువు గలవాడు. అంటే పరమ యోగీశ్వరుడు అని అర్థం.
భూమి మీద పుట్టిన ప్రతి మానవుడూ ముక్కంటి కావాలి. అదే స్వధర్మం, అదే స్వతంత్రం, అదే స్వరాజ్యం. అప్పుడే స్వేచ్ఛ. అప్పుడే స్వయంభూ, అప్పుడే స్వయంప్రకాశం.
అంతవరకూ పరాధీనులమే, పరాన్న భుక్కులమే, పరతంత్రులమే. అంతవరకూ చీకటి రాజ్యమే; అంతవరకూ గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి త్రోవ చూపినట్లే ; అంతవరకూ గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్లే ; అంతవరకూ మరి ‘కత్తి మీద సామే’.
మరి త్వరపడుదామా ధ్యాన సముపార్జనకు, అంటే ధ్యాన అభ్యాసానికి ?
ఈ క్షణమైనా జాప్యం వద్దు.
గమ్యం తెలుసుకున్నాం, మార్గం తెలుసుకున్నాం, కనుక, గమనం సాగిద్దాం.