ధ్యాన కిరీటం

 

 

భక్తి అనేది యోగం కాదు – రోగం;

కర్మ అనేది యోగం కాదు – ధర్మం;

జ్ఞానం అనేదే యోగం – జ్ఞాన యోగం;

ధ్యానం అనేదే యోగం – రాజయోగం.

కిరీటం అనేదే రాజ్యత్త్వానికీ, రాజసానికీ చిహ్నం. రత్నఖచిత కిరీటాలను రారాజులు ధరిస్తూ వుంటారు.

పరమ యోగులు మాత్రం ధ్యాన కిరీటాలను అలంకరించుకుంటారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఒకానొక అద్భుతమైన యోగీశ్వరుడు; అపారమైన యోగ సాధనా ద్వారా ధ్యాన కిరీటధారి అయినవాడు.

భౌతిక రారాజులకూ, ధ్యాన రారాజులకూ మధ్య ఎంత వ్యత్యాసమో.

భౌతిక రారాజులు అయిన వారు స్వయంగా శాంతి శూన్యులు. ఇతరులకూ ఎలా శాంతిని ఇవ్వగలరు? వారికి ఎన్ని రాజ్యాలు, సంపదలు వున్నా అసంతృప్తే.

ధ్యాన రారాజులకు మాత్రం ఆది, మధ్యం, తుది అంతా శాంతిమయమే.

తమతో కలిసిన వారందరినీ కూడా శాంతిమయులుగా చేయగలిగినవారే.

ప్రతి ఒక్కరూ ధ్యాన కిరీటధారులు అవ్వాలి.

శ్రీ వెంకటేశ్వరస్వామి లాంటి యోగిపుంగవుల అడుగుజాడలలో నడవాలి అందరూ.

అదే శ్రీ వెంకటేశ్వరస్వామి యొక్క నిజమైన ఆకాంక్ష.

తిరుమలలోని భక్తి అన్నది నిష్ట అయిన రాజ యోగ సాధనగా సత్వరంగా రూపాంతరం చెందాలని వాంఛిస్తూ …