ధ్యాన కమలం
మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది; నది అనేది ఎతైన కొండలలో పుడుతుంది అనేకానేక వంకలు తిరుగుతూ పయనిస్తుంది. దారిలో ఎన్నెన్ని అడ్డంకులో .. ఎన్నెన్ని అనుభవాలో..
ఒక్కొసారి జలపాతంగా దభేల్ మని చతికలపడుతుంది. ఒక్కోసారి తీవ్రమైన వంకలతో చక చక పారుతుంది. ఒక్కోచోట ప్రశాంతంగా, గంభీరంగా, మరోచోట మందంగా కదులుతూ ఉంటుంది. చివరికి జరిగేది తన ప్రత్యేకత ను కోల్పోవటం.. చివరిగా పరిణమించేది అన్ని చోట్లా ఒకే విధంగా వుండే మహాసంద్రంలా..
మనిషి జీవితం కూడా కొండల ఎత్తుల్లో, అంటే పూర్ణాత్మల సంకల్పలోకాలలో ఆవిర్భవిస్తుంది. క్రింది లోకాలలో దింపబడిన జీవాత్మ తన నూతన ఆత్మ జీవితం యొక్క అనేకానేక జన్మల్లో అనేకానేక పాఠాలు నేర్చుకుంటూ, ప్రౌఢత్వం సంపాదించుకుంటూ నిత్యము ఎదుగుతూ వుంటుంది.
జీవాత్మ ప్రౌఢదశను దాటి వృద్ధ దశల్లో ఉన్నప్పుడు అంటే చివరి జన్మల్లో వున్నప్పుడు, అంటే ప్రశాంతంగా, గంభీరం గా సాగుతున్నప్పుడు, అద్భుతమైన ధ్యాన కమలాలు వికసించి అందరినీ ఆకర్షిస్తాయి- ఆకట్టుకుంటాయి.
అ తరువాత ఓ పూర్ణాత్మ గా తానూ విశ్వాత్మ భాగమై పోతుంది. ధ్యాన కమలాలే ధ్యానానుభవాలు. . ధ్యాన కమలాలే యోగ సిద్ధులు. ధ్యన కమలా లే సుజ్ఞాన వీచికలు. ధ్యాన కమలాలే ఆత్మ సౌరభాలు.