“ధర్మరాజ్యం వచ్చి తీరుతుంది”

 

నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలవుతాయి! భవిష్యత్తులో మనకు కావల్సిన వాటిని .. కావల్సిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తీ, కొడవళ్ళే .. నేడు మనం కనే కలలు!

అయితే, మన దేశం స్వర్ణసదృశం కావాలంటే కేవలం చక్కటి కలలు మాత్రం కంటూనే వుంటూంటే ఎక్కువ లాభం లేదు! దానికి ఏది కావాలో అది కష్టపడి చెయ్యాలి!

“దేశం అంటే మట్టి కాదు .. ప్రజలు”

దేశంలోని ప్రజలు మట్టికొడుతూ వుంటే దేశం కూడా మట్టి కొడుతూ వుంటుంది .. మరి దేశంలోని ప్రజలు అయోగ్యులైతే దేశం పరిస్థితి అయోమయంగా వుంటుంది.

“యోగ్యత” అన్నది మనలో యోగ శాస్త్ర పరిచయం ద్వారా అంకురీకరించి .. పటిష్ట “ధ్యానయోగసాధన” ద్వారా సంపూర్ణంగా పుష్పించి, ఫలిస్తుంది! కేవలం భౌతికపరమైన శాస్త్రవిజ్ఞానంతో మాత్రమే అయితే “యోగ్యత” అన్నది ఎప్పటికీ సిద్ధించదు.

ఆధ్యాత్మికపరమైన “ధ్యాన అభ్యాసం” ద్వారానే, “ధ్యానాయోగానుష్టానం” ద్వారానే ప్రజలు యోగ్యులై విలసిల్లగలుగుతారు! మొదట అందరూ హింసను వదిలిపెట్టేయాలి! ఎవ్వరికీ మరొకరిని హింసించే హక్కు లేదు! “అహింసా పరమో ధర్మః” అన్నాడు గౌతమబుద్ధుడు! కానీ బుద్ధుడు పుట్టిన దేశంలోనే ఎంత హింసో! అహింసామూర్తి అయిన బుద్ధుని వారసులమైన మనం ఇకనైనా “హింస”ను వదిలిపెట్టేద్దాం .. “హంస” ను పట్టుకుందాం! “హింస” అంటే “జంతువధ” మరి “మాంసభక్షణ”; మరి “హంస” అంటే “శ్వాస”!

అనాది నుంచి మనం భారతదేశంలో “రామరాజ్యం” గురించి వింటూనే వున్నాం. ప్రతి యుగంలోనూ ప్రజలు “రామరాజ్యం” కోసమే కలలు కన్నారు. “రామరాజ్యం” అంటే “ఒకానొక రాముడి లాంటి వాడి చేతిలో నడవబడే రాజ్యం” .. “ప్రజల యోగక్షేమాలను గురించి పూర్తిగా తెలిసివున్న రాజు చేతిలోని రాజ్యం అది ఒక రాజు మహాయోగి అయిన పరిస్థితిలో వున్నటువంటి రాజ్యం. ఆధ్యాత్మికత కోసమే జీవించే ‘యోగి రాజు’ చేతిలో నడుపబడేదే రామరాజ్యం!”

“రాముడు వంటి వాడు” రాజ్యం యొక్క రాజు కాకపోతే “రామరాజ్యం” రావడం అనేది అసంభవం! అందుకే సోక్రటీస్ మహానుభావుడు .. “తత్త్వవేత్తలే పాలకులు కావాలి” అన్నాడు. ప్రజలు రామరాజ్యం కోరుకునేటట్లయితే వారు ఆత్మజ్ఞానులనే పరిపాలకులుగా ఎన్నుకుని తీరాలి.

“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” ప్రజలందరినీ ధ్యాన ప్రజలుగా, ఆత్మజ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతోంది! ఆత్మజ్ఞానులైన ప్రజలు తప్పకుండా ఆత్మజ్ఞానులైన మేధావులనే పరిపాలకులుగా ఎన్నుకుంటారు.

ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది; మళ్ళీ “రామరాజ్యం” అంటే “ధర్మరాజ్యం” వచ్చి తీరుతుంది. మళ్ళీ ఈ నవీన యుగంలో .. భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా “ధర్మరాజ్యం” వెల్లివిరుస్తుంది!

అందుకోసం మనం కట్టుకున్న కంకణమే “పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా”!