దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి
సకల మానవాళిని దివ్యత్వం వైపుగా నడిపించడానికి కరుణామయుడయిన ఏసు ప్రభువు ఎన్నెన్నో జ్ఞాన సందేశాలను అందించారు ; ఉదాహరణకు :
“దేవుని సామ్రాజ్యం మనలోపలే వుంది” నా తండ్రి రాజ్యంలో అనేకానేక తలాలు, కోటాను కోట్ల లోకాలూ వున్నాయి .. వాటిలోకి ప్రవేశించాలి ! అందుకు గాను .. మీరంతా చిన్నపిల్లలుగా మారాలి” .. “మీ రెండు కళ్ళూ ఒకటిగా కావాలి”.
“మన ఆత్మసామ్రాజ్యంలోకి మనం వెళ్ళాలి” అంటే మన మనస్సును నిర్మలం చేసుకుని ఏ ఆలోచనలూ లేని చిన్ని పిల్లాడిలాంటి శూన్యమనస్సుతో వుండాలి. అందుకుగాను మన రెండు కళ్ళూ మూసేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి. అప్పుడే మన దివ్యచక్షువు అన్నది తెరుచుకోబడి .. ఆ కోటానుకోట్ల లోకాలను చూడగలుగుతూ అనేకానేక తలాల్లో మనం జీవించగలుగుతాం.
ఏసుప్రభువు “నేనూ, నా తండ్రి ఒక్కటే” అని చెబుతూ “మీరు నేను ఒక్కటే” అని కూడా స్పష్టం చేశారు. ఏసు ప్రభువు ఇహలోకంలో తిరుగుతూనే పరలోక సత్యాలు తెలిపేవాడు. పదకొండేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు ఒకసారి ఏసుప్రభువు అందరినీ కూర్చోబెట్టుకుని జ్ఞాన ప్రవచనాలను అందిస్తూంటే ఒకానొక కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి .. “ఓ జీసస్ ! నిన్ను మీ తల్లి పిలుస్తోంది !” అని చెప్పాడు.
అప్పుడు ఏసుప్రభువు వెంటనే “ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఈ ప్రపంచానికి చెందిన ఏ బంధానికి కూడా నేను బంధీని కాను ..” అని కరాఖండీగా చెప్పేసాడు !
ప్రాపంచికంగా ఎంతగొప్ప వాళ్ళం అయినా మన ఆత్మ సామ్రాజ్యానికి మనం అధిపతులం కాకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ! ఎన్ని రాజ్యాలను పాలించిన వారయినా ధ్యాన రారాజులు కాలేకపోతే బ్రతుకు వ్యర్థం !
ఏసు ప్రభువు చెప్పినట్లు మన తండ్రి లోకాల్లోకి ప్రవేశించి ఆయనంతటి వాళ్ళం కావలసిందే ! జ్ఞానేశ్వర్ మహారాజ్, .. సాయినాథ్ మహారాజ్ ల్లా ప్రతి ఒక్కరూ ఆత్మానంద మహారాజ్‌లు కావల్సిందే.