దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి

 

ఏదైనా ఒక విషయం అందుబాటలో లేనప్పుడే మనకు దాని విలువ తెలుస్తుంది ! అప్పుడు దాని మహత్తు మరింతగా అర్థం అవుతుంది ! కళ్ళు లేనివాడికే కళ్ళ విలువ తెలిసినట్లు .. మూగ వాడికే మాట విలువ తెలిసినట్లు .. విషయం అందుబాటులో లేని వాడికే దాని విలువ తెలుస్తుంది.

అలాగే ఈ ప్రపంచగతిని మార్చడానికి ఎంతో ప్రేమగా భూమిమీదకు దిగివచ్చిన యుగపురుషుల విషయం కూడా !

ఉన్నప్పుడు వారి విలువను గ్రహించలేని ప్రజలు మహాత్ములను చంపేస్తూంటారు. గాంధీ మహాత్ముడిని కాల్చి చంపారు. మూఢనమ్మకాలపై మూఢాచారాలపై ధ్వజమెత్తి ప్రజలను అప్రమత్తులను చేస్తూభూమండలాన్ని ఉన్నత కాంతి తలాల్లోకి ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన “ఆర్య సమాజ స్థాపకులు” మరి “సత్యార్ధప్రకాశ గ్రంధ” సృష్టికర్త స్వామి దయానంద సరస్వతిని సీసం పొడిని నీటిలో కలిపి త్రాగించి చంపేసారు. ఓషోనూ, సోక్రటీస్‌నూ విషప్రయోగంతో చంపారు.

“వాళ్ళు చనిపోతే మేమంతా హాయిగా ఉంటాం” అని అనుకుంటారు. చంపేశాక వాళ్ళ విగ్రహాలకు గుడులు కట్టి పూజిస్తారు !

అయితే, ఎరుకస్థితిలో వున్న కొందరు సంస్కారవంతులు, మరి జ్ఞానులు మాత్రం గొప్పవారు బ్రతికి ఉన్నప్పుడే మరి విలువను తెలుసుకుని ” దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు ” వారితో కలిసి సాంగత్యం చేసి .. వారి మార్గదర్శనంలో తమ జీవితాలను ఉద్ధరించుకుంటారు.

“యుగ పురుషులు” మన మధ్య ఉన్నప్పుడే మరి విలువను తెలుసుకున్నట్లు .. భౌతికంగా ఈ శరీరంలో ఉన్నప్పుడే దాని విలువను కూడా మనం తెలుసుకోవాలి ! హాయిగా ముప్పొద్దులా తిని పడుకుని, అశాస్త్రీయమైన జీవన విధానాలతో దాన్ని రోగాలపాలు చేస్తే అది పనికిరాకుండా పోతుంది.

తీరా చనిపోయిన తర్వాత శరీరం నుంచి విడుదల అయ్యాక .. “అయ్యో ! నేను ఇది చేయలేదు .. అది చేయలేదు” అని ఆక్రోశించకుండా .. “శరీరం ఖలు ధర్మసాధనం” అన్న శాస్త్ర వాక్యాన్ని అనుసరించి .. శరీరం ఉండగానే దానితో సాధనలు చెయ్యాలి. ఇక్కడ శరీరంలో ఉండే పైలోకాలతో సంబంధాలను ఏర్పరచుకోవాలి.

రేపో, మాపో ఈ శరీరాన్ని .. అంటే స్థూలశరీరాన్ని వదిలేసిన మన ఆత్మ ఈ భూమ్మీద స్థూలశరీరంలో ఉన్నప్పుడు చేసిన సాధన వల్ల .. పొందిన జ్ఞానాన్ని బట్టి ఆయా స్థాయిలకు చెందిన సూక్మలోకాలకు వెళ్ళిపోతుంది.

భూలోకంలో “A, B, C, D” అనే లోకాల స్థాయికి సంబంధించిన జ్ఞానం మనం పొంది ఉంటే .. చనిపోయాక సూక్ష్మశరీరంతో అక్కడి నుంచి ఆ పై స్థాయికి చెందిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అంటే “E, F” లోకాలకు వెళ్ళిపోతాం ! ఒకవేళ మనం ఇంకా తీవ్రతను సాధన చేసి భూలోకంలోనే ” Q, R, S ” స్థాయికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి వుంటే .. చనిపోయాక “T” స్థాయికి చెందిన లోకాలకు వెళ్తాం ! ఇదంతా కూడా ఆత్మ ప్రగతిలోనే వివిధ దశలకు సంబంధించి జరుగుతూ వుంటుంది.

సూక్ష్మలోకాల్లో నిమ్నతర స్థాయికి చెందిన నాలుగు నరకప్రాయ లోకాలూ మరి ఊర్థ్వతర స్థాయికి చెందిన నాలుగు స్వర్గలోకాలూ .. ఉంటాయి. పాపం అధికంగా చేసుకున్నవాళ్ళు నరక సదృశ లోకాల్లోనూ మరి పుణ్యం అధికంగా చేసుకున్నవాళ్ళు పరంపరగా స్వర్గప్రాయలోకాల్లోనూ ఉంటారు.

నాస్తికులు “చనిపోయిన తరువాత ఇంక అసలు ఏమీ వుండదు” అని వాదాలు చేస్తూ తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. తీరా చనిపోయిన తరువాత పైలోకాల్లోకి వెళ్ళి .. మళ్ళీ ఆత్మస్పృహను పొంది అప్పుడు బాధపడతారు. “అయ్యో, నేను ఈ సత్యాలన్నీ అప్పుడే ఎందుకు తెలుసుకోలేదు? అవి తెలియజేయడానికి వచ్చిన వారిని అన్యాయంగా చంపేసానే !” అని విచారిస్తారు.

కొంతమంది “పుణ్యం చేస్తే చాలు హాయిగా స్వర్గలోకాల్లో సెటిలైపోవచ్చు” అనుకుంటూంటారు. కానీ “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్లు పుణ్యాలు చేసుకున్నవారు స్వర్గలోకాల్లోకి ప్రవేశించి తాము సంపాదించిన పుణ్యశాతం తగ్గిపోగానే మళ్ళీ స్థూలశరీరాన్ని ధరించి భూమ్మీద పుడతాడు.

కాబట్టి “పాపం” – “పుణ్యం” రెండూ కూడా పూర్తిగా అనుభవించేసిన తరువాత .. రెండింటి సముదాయం నిశ్శేషం అయిన “నిర్గుణ స్థితి”లోని ఆత్మ మాత్రమే సకలలోకాల్లోని అత్యున్నత లోకమైన “సత్యలోకం”లో సెటిలైపోతుంది. ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక శ్రీకృష్ణుడు లాంటి నిర్గుణ స్థితిలోని ఆత్మల నిలయమే .. “సత్యలోకం”!

సత్యలోకపు ఆత్మలు తప్పనిసరిగా భూమ్మీదకు రావాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు .. మళ్ళీ గర్భస్థజననం తీసుకుని కర్మచట్రాలకు గురికాకుండా ..” వాక్ – ఇన్స్ ” అనే మధ్యే మార్గం ద్వారా .. భూమిపై ఉన్న ఆత్మ ఎరుక స్థితిలో దేహాలను ఆశ్రయించి లోక కల్యాణ కార్యాలను జరిపిస్తూంటాయి ! ఇదంతా కూడా ఆ సత్యలోకపు ఆత్మయొక్క స్వంత ఇచ్ఛతో కూడిన ఉన్నత ఎరుకతో జరుగుతుంది.

రూత్ మాంట్‌గోమెరీ జీవితాన్ని తెలుసుకున్న వారికి “వాక్-ఇన్స్” అనే ఉన్నత విజ్ఞానం గురించి తెలుస్తుంది. ఇలా “అటువైపు” ఉన్నదంతా తెలుసుకున్నప్పుడే .. ఇటువైపు వున్న శరీరాన్ని చక్కగా ఉపయోగించుకుంటాం.. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు మన జీవితాలను ధన్యం చేసుకుంటాం !