దర్పహః – దర్పదః
విష్ణు సహస్ర నామం అన్నది ఓ మహత్తర గ్రంథం.
భీష్మ పితామహుడు తన తుది ఘడియల్లో ధర్మనందునుడికి ఇచ్చిన జ్ఞాన సందేశం.
విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాల్లో రెండు అద్భుత నామాలు –
దర్పహః అంటే దర్పాన్ని హరించేది: దర్పదః అంటే దర్పాన్నిచ్చేది.
విష్ణు సహస్ర నామంలోని ప్రతి నామం కూడానూ
విష్ణు గుణాన్ని, విష్ణుతత్వాన్ని విశదీకరిస్తుంది, విపులీకరిస్తుంది.
విష్ణుః అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్ధం.
ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్ధం.
ప్రతి ఆత్మజ్ఞానీ ఓ విష్ణువు.
అదే విధంగా ప్రతి ఆత్మజ్ఞాని కూడా ఓ వేయి పడగల పాము, సహస్ర ఫణిసాయి.
సహస్ర దళ కమలాన్ని సంతరించుకున్నవాడు.
ఇక్కడ సహస్ర అంటే వెయ్యి అని కాదు, అనంతం అని అర్ధం.
మనం మాట వరుసకు నూట తొంభై పనులున్నాయి, అన్నప్పుడు సరిగ్గా నూట తొంభై పనులు అని కాదు అర్థం.
ఒక ఆత్మజ్ఞాని యొక్క అనంతమైన గుణగణాలతో
ఒక వెయ్యిని మాత్రం విశదీకరించి చెప్పినవాడు భీష్మ పితామహుడు.
విష్ణు సహస్రనామం లోని ప్రతి నామమూ ఒక అద్భుతమైన పాఠం.
ప్రతి పిరమిడ్ ధ్యాని కూడా విధిగా చదువవలసిన గ్రంథం విష్ణు సహస్ర నామం.
ఇక దర్పహః, దర్పదః అన్న నామాల దగ్గరకు వద్దాం.
ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నాకే తెలుసు అన్న దర్పం హరించుకుపోతుంది.
అదే దర్పదః అంటే.
ఆత్మజ్ఞాని కానివాడు ఇతర ఆత్మజ్ఞానులను చూడలేడు …
కనుక, తనకన్నా మించిన వారు ఎవ్వరూ లేరు అనుకుంటాడు.
తనకున్న ఏవో చిల్లర వాటిని చూసుకుంటూ అహంకారియై తిరుగుతూ వుంటాడు.
పగలు ఏ నక్షత్రాలూ కనపడకపోయినా,
రాత్రి కాగానే నక్షత్రాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనబడినట్టు, ఒక అజ్ఞాని ఆత్మజ్ఞానిగా కాగానే మిగిలిన ఆత్మజ్ఞానులందరూ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ దర్శనమిస్తారు.
అప్పుడు నాకింతవరకూ ఏమీ తెలియదు;
ఇంకా నిజంగా తెలియవలసింది అనంతంగా ఉంది అని తెలుసుకుంటాడు.
అంతవరకూ అనర్థకారి అయిన అతని మిడిమిడి జ్ఞానం, ఒక్క దెబ్బతో మొత్తం హరించుకుపోతుంది.
ఇక దర్పహః అంటే,
కానీ వెనువెంటనే దర్పదః అని కూడా భీష్మాచార్యులవారు శెలవిచ్చారు.
అంటే దర్పాన్నిచ్చేది అని.
ఆత్మజ్ఞాని అయిన వాడికి వెంటనే ఒక విధమైన ఆత్మబలం చేకూరి.
నేను సాధించాను, నేను తెలుసుకున్నాను, నేను కూడా తెలుసుకున్నాను.
అన్న సత్యాన్ని సంతోషంగా, సగర్వంగా వినయంగా ప్రకటిస్తాడు.
ఆత్మజ్ఞానం లేని వాడికి, ఆత్మజ్ఞానికుండే ఆత్మబలం అహంకారంలా కనబడుతుంది.
కానీ అది అహంకారం కాదు.
ఇదీ దర్పదః అన్న నామానికి వున్న అర్థం.
పిరమిడ్ మాస్టర్లెవ్వరికీ గర్వం లేదు గర్వం ఉంది; అదీ పరిస్థితి.
వెధవది, భీష్మాచార్యుడు చెప్తే గానీ మన సంగతి మనకర్థం కావటం లేదు.
– ఈ రెండు పదాలూ ఓ ఉదాహరణకు ఇవ్వటం జరిగింది.
మిగతా గ్రంథమంతా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటీ మాస్టర్లందరికీ హ్యాట్సాప్.