చతుర్ముఖేన బ్రహ్మః
“బ్రహ్మకు నాలుగు ముఖాలు” అంటారు
“అహం బ్రహ్మాస్మి” అనే వేదవాక్కు ప్రకారం
“అహం” అంటే “బ్రహ్మ”
“నేను” అనేదే “బ్రహ్మ”
“నేను” అంటే “ఆత్మపదార్థం” అన్నమాట
“చతుర్ముఖాలు” అంటే నాలుగు ద్వారాలు
ఈ ‘నేను’ ను చేరుకోవడానికి నాలుగు ద్వారాలు వున్నాయి
నాలుగు మార్గాలే నాలుగు ‘ముఖాలు’
“నేను” అనేది నాలుగు తత్త్వాలుగా ప్రస్ఫుటమవుతోంది
అవే – “మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు”
ఒకే వ్యక్తి, తండ్రితో ఉండేటప్పుడు “కొడుకు” అనీ
మరి కొడుకుతో ఉండేటప్పుడు “తండ్రి” అనీ
అదే సోదరుడితో ఉండేటప్పుడూ “సోదరుడు” అనీ
మనుమడితో ఉండేటప్పుడు “తాత” అనీ వ్యవహరించబడినట్లు
ఒకే “నేను” వివిధ పరిస్థితులలో విభిన్న వస్తువులుగా
పరిగణింపబడుతోంది అన్నమాట
* సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు “మనస్సు” గా
నిత్యానిత్యాలను, మంచిచెడులను చెప్పేటప్పుడు “బుద్ధి” గా
నిరంతర చింతన చేసేటప్పుడు “చిత్తం” గా
‘నేను’, ‘నాది’ అనేటప్పుడు “అహంకారం” గా
“ఆత్మపదర్థాన్ని” అంటే “నేను” ను మనం వివరిస్తాం