“బుద్ధత్వం – బుద్ధుడు – తాదాత్మ్యత”
“బుద్ధుడు” అంటే .. “అందరూ సగటు సామాన్య మనుష్యులే” అని తెలుసుకున్నవాడు
“బుద్ధుడు” అంటే .. “నాలో ఏ ప్రత్యేకతలూ లేవు” అని తెలుసుకున్నవాడు
“బుద్ధుడు” అంటే .. “ఇతరులందరిలో కూడా ఏ ప్రత్యేకతలూ లేవు” అని తెలుసుకున్నవాడు
“బుద్ధుడు” అంటే .. “నేను ఒక మహాశూన్యం” అని తెలుసుకున్నవాడు
“బుద్ధుడు” అంటే .. “ఇతరులందరూ కూడా ఒక మహాశూన్యం” అని తెలుసుకున్నవాడు
“బుద్ధుడు” అంటే .. తన శరీరంతో సంపూర్ణ తాదాత్మ్యం చెందినవాడు
“బుద్ధుడు” అంటే .. తన రోజువారీ సాధారణ దినచర్యల కార్యక్రమాలలో సంపూర్ణ తాదాత్మ్యం చెందినవాడు
“రోజువారీ సాధారణ దినచర్యలు” అంటే: ‘తినడం’ .. ‘కూర్చోవడం’ .. ‘చూడడం’
‘మాట్లాడడం’ .. ‘వినడం’ .. ‘పనిచేయడం’ .. ‘చదవడం’ .. ఇంకా ఇంకా ఎన్నెన్నో!
“Walk while you are walking .. Eat while you are eating”
అన్నాడు “ఒక్కప్పటి బుద్ధుడు”
“బుద్ధుడు” అంటే సమాజపరంగా తన కర్తవ్యకర్మలలో సంపూర్ణ తాదాత్మ్యం చెందివున్నవాడు
“బుద్ధుడు” అంటే .. సకలప్రాణికోటితో సంపూర్ణ తాదాత్మ్యం చెందివున్నవాడు
“బుద్ధుడు” అన్న పదానికి మారుపేరే .. “తాదాత్మ్యత”
తన శూన్యంతో తన తాదాత్మ్యత; తన బాహ్యంతో తన తాదాత్న్యత
అసలు ‘సంఘర్షణ’ అన్న పదానికి తావులేనిదే .. “బుద్ధత్వం”
‘భయం’ .. ‘దుఃఖం’ .. ‘సంశయం’ .. ‘ఆవేశం’ అన్న పదాలకు
ఎంతమాత్రం తావులేనిదే “బుద్ధత్వం”
అనుక్షణం మార్పు చెందుతూ ఉండే .. రూపాంతరం చెందుతూ ఉండే .. బాహ్యాంతరాలను
చిరుమందహాసంతో గమనించే శాశ్వత మృదుమధుర గంభీరతత్వమే .. “బుద్ధత్వం”
గత కాలాలలోని బుద్ధుళ్ళందరికీ ప్రణామాలు!
వర్తమానంలో బుద్ధుళ్ళు అయి విరాజిల్లుతూన్న వాళ్ళందరికీ అభినందనలు!
భవిష్యత్తులో బుద్ధుళ్ళుగా కాబోయేవాళ్ళందరికీ శుభాభివందనాలు!