భ్రమలను తొలగించుకున్న మానవుడే .. మాధవుడు

“మనం ఆత్మపదార్థాలం”

ఆత్మపదార్థం యొక్క సహజ స్థితి .. “సదానంద స్థితి”
అప్పుడప్పుడూ ఆత్మపదార్థం తన సదానంద స్థితిని వదిలిపెట్టేసి
తన స్వ ఇచ్ఛతో భౌతిక పదార్థంతో మమేకం అవుతుంది
ఆత్మపదార్థానికి “సమస్య” అన్నది ఎక్కడా లేదు!
అంతా సదా బ్రహ్మానందమే .. మరి అంతా సదా నిత్యనూతనమే
“ఆత్మపదార్థానికి”
“భౌతిక లోకంలో జననం” ఒక సమస్య కాదు మరి
“భౌతిక లోకంలో మరణం” ఒక సమస్య కాదు
“ఆత్మపదార్థానికి”
ప్రతి జీవిత సన్నివేశం కూడా నిత్యనూతన పాఠాలను నేర్పిస్తుంది
ప్రతి జీవిత సన్నివేశం కూడా నూతన ప్రగతికి సోపానంగా మారుతుంది
“ఆత్మ యొక్క జీవితం”లో వాస్తవానికి ఇలా ఉన్నా కూడా,
“మానవుడు” తన దైనందిన జీవితంలో అనేకానేక “సమస్యలతో” కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు!
అది ఎంతటి మూర్ఖత్వం?! .. మరి ఎంతటి అవివేకం?!
అది ఎంతటి అజ్ఞానం?! మరి ఎంతటి మాయ?!
“రజ్జు సర్పవత్” భ్రాంతి లా .. చీకటిలో త్రాడును చూసి పాముగా భ్రమించడం
“పాము” అన్నది అసలు మానవజీవితంలో లేనే లేదు
ఆధ్యాత్మిక జీవన “వైకుంఠపాళి” లో ఎక్కడా పాములు అన్నవి లేవు
ఉన్నవల్లా “నిచ్చెన” లే! .. మరి అద్భుతమైన శిక్షణా సోపానాలే!
నిరంతర ధ్యాన సాధన ద్వారానే మరి ఆ రజ్జుసర్ప భ్రాంతి తొలగిపోతుంది
“స్థాణు తస్కరవత్” భ్రాంతి లా రాత్రి పూట “దుంగ”ని చూసి “దొంగ” అని భ్రమించడం
“మరు మరీచికవత్” భ్రాంతి లా పగలే ఎండమావులలో నీళ్ళు ఉన్నట్లు భ్రమించడం
భ్రమలలో జీవించే జీవితం .. సదా దుఃఖమయం
భ్రమల ద్వారా కలిగే దుఃఖాలు
శరీరానికి సకల అనారోగ్యాలనూ .. సర్వ వ్యాధులనూ కలుగజేస్తాయి
శరీరాన్ని సత్వరంగా ముసలితనంవైపు మరి చావు వైపుగా తీసుకుని వెళ్తాయి
భ్రమలు అన్నవే లేకపోతే మానసిక దుఃఖాలు అన్నవి ఉండనే ఉండవు
మానసిక దుఃఖాలు తొలగితే శారీరక వ్యాధులు మరి శారీరక ముసలితనం అన్నవి ఉండవు
సకల భ్రమలూ తొలగాలంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాదులే మరి శరణ్యం
“భ్రమలను తొలగించుకున్న మానవుడే మాధవుడు”
తస్మాత్, ధ్యానం ఏవ శరణం వయం
తస్మాత్, స్వాధ్యాయం ఏవ శరణం వయం
తస్మాత్, సజ్జసాంగత్యం ఏవ శరణం వయం
ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులకు మహా నిలయమైన “PSSM”కు జేజేలు!
ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య నిరంతర సాధకులైన “పిరమిడ్ మాస్టర్లకు” జేజేలు!