బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం

 

నా ఈ జీవితంలో.. ప్రథమ గురుపీఠాన్ని అధిరోహించిన తల్లిగారైనా సావిత్రీదేవి గారు .. అద్భుతమైన మాతృమూర్తి

అనేక కళలలో నాకు గురువు .. ముఖ్యంగా పాకశాస్త్రంలో

ఆవిడ నుంచి సహనం, ఓర్పు, సంఘంలో అందరిపట్ల ఆదరణ..

మర్యాద, మన్ననలు చూపటం వంటివి నేను పుష్కలంగా నేర్చుకున్నాను.

నా జీవితంలో .. ద్వితీయ గురుపీఠాన్ని అధిరోహించిన మా అన్నగారైన డా|| వేణు వినోద్ పత్రిగారు

ప్రాపంచిక విద్యలలో ఆదర్శమూర్తి.

32 ఏళ్ళకే ఇంగ్లాండ్ మాంచెస్టర్ నుంచి ఇంజనీరింగ్ Ph.D. పట్టా పుచ్చుకున్నారు ..

ఇంజనీరింగ్ సైన్స్‌లో “మెకట్రానిక్స్” అంటే మెకానికల్ ఇంజనీరింగ్ మరి ఎలక్ట్రానిక్స్‌ని మేళవించి

ఓ క్రొత్త విభాగాన్ని సృష్టించిన సాంకేతిక సృష్టికర్త ..

ఎమరిటస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాంకాంగ్ యూనివర్సిటీ ..

“ఎమరిటస్” అంటే పదవీవిరమణ చేసినప్పటికీ ఆయనే సుప్రీమ్ అన్నమాట.

నన్ను కర్నాటక-వేణువు-ప్రపంచంలోకి అడుగులు వేయించిన సంగీత పిపాసి.. వేణుగాన విశారద

ఆయన ద్వారా “శాస్త్రీయ దృక్పథం”, “శాస్త్రీయ జీవితం” అన్నవి అపారంగా నేర్చుకున్నాను

అవి ఉత్తరోత్తరా నేను ఒక బృహత్ ఆధ్యాత్మిక ప్రపంచానికి సారథి కావడానికి తోడ్పడ్డాయి.

నా జీవితంలో.. మూడవ గురుపీఠాన్ని అధిరోహించిన వారు .. శ్రీ T.S.చంద్రశేఖరన్

సికింద్రాబాద్‌లో చిన్న రైల్వే ఉద్యోగిగా వుంటూ .. జంటనగరాలలో ఎనలేని సంగీత సేవ చేశారు.

ఆయన దగ్గర పది సంవత్సరాలు కర్నాటక శాస్త్రీయ సంగీత విద్యసంగీత సేవ, వేణు వాయిద్యం నేర్చుకున్నాను.

మన ధ్యాన ప్రపంచంలో వేణునాదం ఎంతగా సహకరిస్తోందో అందరికీ సువిదితమే!

దానికి ఒకే కారకులు స్వర్గీయ శ్రీ చంద్రశేఖరన్ గురువుగారు ..

వారికి నా సహస్రప్రణామాలు.

నా ఈ జీవితంలో నాల్గవ గురుపీఠాన్ని అధిరోహించిన మహాగురువు పద్మభూషణ్ డా|| శ్రీపాద పినాకపాణి గారు.

ఇటీవలే వంద సంవత్సరాల ఆయుష్షుతో వారు దేహవిరమణ గావించారు.

ఆంధ్రరాష్ట్రంలో కర్నాటకసంగీతం వ్రేళ్ళూనుకుని విశ్వరూప ప్రదర్శనగావింపబడింది అంటే

అది వారి అపారకృషి వల్లనే ఆయన దగ్గర చేరడం వల్లనే నా గాత్రంలో అసలైన రాణింపు వచ్చింది

వారి శిక్షణలోనే నా వేణుగానం కొత్త పుంతలు త్రొక్కింది!

స్వర్గీయ డా|| శ్రీపాద పినాకపాణిగారికి నాశతసహస్ర ప్రణామాలు

మరి ఆధ్యాత్మిక గురుపీఠాన్ని అధిరోంచినది శ్రీ సదానందయోగి గారు

చివరి అయిదవ గురుపీఠాన్ని అధిరోహించిన కర్నూలు స్వామీజీ

వారికీ శతకోటి ప్రణామాలు.