బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా

 

 

ప్రకృతి అన్నది శాశ్వతాశాశ్వతాల అద్భుత కలయిక. ప్రకృతిలోని శాశ్వతత్వమే పురుషుడు. ప్రకృతిలోని అశాశ్వతత్వమే నామరూపాలు.

సదా శాశ్వతమైన పదార్ధమే ఆత్మ.

అశాశ్వతమైన పదార్ధమే అనాత్మ.

అనాత్మ అన్నది సూక్ష్మ, కారణ ప్రకృతుల సమూహం.

ముక్తి లభిస్తూనే కారణ శరీరం కూడా హుళక్కి.

భౌతికకాయంలో వున్నంత, సేపూ మరి, చనిపోయిన తర్వాత, ఈ రెండు పరిస్థితుల లోనూ వుండేది సూక్ష్మశరీరం … అంతవరకే దాని అస్తికత.

సూక్ష్మ శరీర మరణ సమయం ఆసన్నమవగానే సూక్ష్మశరీరం హుళక్కి.

ఇకపోతే స్థూల శరీరంలో వున్న అవస్థలు గర్భంలో అండంగా మొదలై పిండంగా రూపుమారి, శిశువు గా అవతరించి, బాల్యంలో ఎగరలాడి, యవ్వనంలో మిరుమిట్లు గొలిపి, ప్రౌఢత్వంలో నిలద్రొక్కుకుని వృద్ధాప్యం లో జారగిలబడి, మరణ సమయం లో అంతమవుతుంది స్థూల శరీరం.

ఇంకొంచెం సూక్ష్మంగా చూస్తే స్థూలశరీరం అన్నది కోటానుకోట్ల కణాల సముదాయం. అనుక్షణం కోటానుకోట్ల కణాలు ఒక ప్రక్కన పుడ్తూంటాయి.

మరొక ప్రక్కన మరణిస్తూంటాయి.

ఇప్పుడున్న కణం మరొక మిల్లీమైక్రో సెకనులో వుండకపోవచ్చు.

వున్నదంతా ఎప్పుడూ నిరంతరంగా మారుతూ వుండేదే.

ప్రకృతిలో స్థిరత్వం చూడబోవడమే అజ్ఞానికి చిహ్నం.

ప్రకృతి యొక్క నిత్యనూతనత్వమే ప్రకృతి యొక్క శోభ. ప్రకృతి యొక్క రమణీయత. ప్రకృతి యొక్క ఆకర్షణ. ప్రకృతి యొక్క రసకందాయం.

వెలుపల వున్న నామరూపాలే మహా అశాశ్వతమనీ, పొరలు పొరలుగా లోపలికి పోతున్నకొద్దీ సూక్ష్మం స్థూలం కన్నా ఒకింత ఎక్కువ శాశ్వతమనీ కారణం సూక్ష్మం కన్నా మరీ ఎక్కువ శాశ్వతమనీ అసలైన శాశ్వతమైన పదార్ధం ఒక ఆత్మేనని గ్రహించడమే జ్ఞానం.

ప్రకృతి అంతా మాయమయం.

అంటే,

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో అసమానంగా వుండేది.

ఆదిశంకరాచార్యులు అన్నారు;

మాయమయమిద మఖిలం భూత్వా,

బ్రహ్మాపదం త్వం ప్రవిశ విదిత్శా.

అంటే,

ఈ సర్వ ప్రకృతి అంతా కూడా మాయామయమైనది;

ఈ విషయాన్ని సదా స్ఫురణలో వుంచుకోవడమే బ్రహ్మపదంలో ప్రవేశించడమంటే అని.

పిరమిడ్ మాస్టర్స్‌కు ఈ విషయం చక్కగా తెలుసు; అందుకే, ఏ మార్పుకూ ఆశ్చర్యపడరు వారు.

ప్రతీదీ ఒక ప్రక్క నుంచి వస్తూ, ఇంకొక ప్రక్క నుంచి పోతుంది అని వారికి మా బాగా తెలుసు.

పురుషుడు ఎప్పుడూ ఏదేని ఒక ప్రకృతిలో నివసించేవాడే కనుక, ప్రతి ప్రకృతీ కొద్దిగానో, లేక ఎక్కువగానో, లేక పూర్తిగానో అశాశ్వతమే కనుక, వున్న ప్రకృతిలో ఒక ప్రక్క ఎంత నిమగ్నులయి వున్నా; మరో ప్రక్క వస్తే రానీ, వుంటే వుండనీ, పోతే పోనీ, అన్న తత్త్వాన్ని పూర్తిగా వంటపట్టించుకున్నవారే – పిరమిడ్ మాస్టర్స్.

పిరమిడ్ మాస్టర్లందరూ అతి క్లిష్ట తరమైన దానిని అతి సులభ సాధ్యం చేసుకున్నారు పిరమిడ్ మాస్టర్లందరూ.

అందరూ బ్రహ్మవేత్త లయిపోయారు.

అందరూ బ్రహ్మాపదాన్ని అధిష్టించారు.