బుద్ధి + జ్ఞానం = పుష్పం + పరిమళం
ధనం అంటే .. “ధనవంతురాలు/ధనవంతుడు” అంటారు.
బలం అంటే .. “బలవంతురాలు/బలవంతుడు” అంటారు.
అందం ఉంటే .. “అందగత్తె/అందగాడు” అంటారు
“బుద్ధి” ఉంటే .. “బుద్ధిమంతురాలు/బుద్ధిమంతుడు” అంటారు
ధనం కన్నా .. బలం కన్నా .. అందం కన్నా మహత్తరమైనది “బుద్ధి”
గొప్పవారినీ, మరి సామాన్యులనూ, సమంగా చూడగలగడమే బుద్ధి యొక్క నైజం
బుద్ధికి మరో పేరు .. “వివేకం”
వివేకానికి మరో అర్థం .. “సమయస్ఫూర్తి”
వివేకానికి మరో అర్థం .. “సందర్భమూర్తి”
వివేకానికి మరో అర్థం .. “ఇంగిత జ్ఞానం”
సమయ సందర్భానుసారంగా, సౌమ్యంగా, ఉభయకుశలోపరిగా వ్యవహరించగలగడమే..
“ఇంగితజ్ఞానం – కలిగివుండటం” అంటే
బుద్ధికి మరో పేరు “సమత్వం”
కలిగి ఉన్నవారినీ, మరి కలిగి లేనివారినీ
సర్వత్రా, సమంగా చూడగలగడమే “సమత్వం కలిగి వుండడం” అంటే
బుద్ధికి మరో పేరు .. “మృధుమధుర హాస్యం”
అహంకరించడం, పరిహసించడం అన్నవి బుద్ధి లేకపోవడానికి సూచికలు
వ్యంగ్య భాషణం .. వ్యంగ్య వ్యవహారం .. అన్నవి బుద్ధిలేమికి నిదర్శనాలు
***
ఒక వృక్షాన్ని చూసినప్పుడు మన దృష్టి పుష్పాల వైపే వెళుతుంది ..
ఒకానొక వృక్షానికి శోభను ఇచ్చేది పుష్పసంపదే
ఒకానొక మనిషికి శోభను ఇచ్చేది బుద్ధి సంపదే
***
“బుద్ధి” అన్నది ఒకానొక .. “పుష్పం”
అయితే, ఒకానొక పుష్పానికి ‘తావి’ లేకపోతే అది ‘పుష్పమే’ కాదు
అదేవిధంగా, బుద్ధికి “జ్ఞానం” అన్నది అంటకపోతే అది ‘బుద్ధే’ కాదు
“ఏమిట్రా! నీకు బుద్ధి – జ్ఞానం లేవూ?” అని అంటారు కదా..
“జ్ఞానం” అన్నది శాశ్వత ఆత్మకు సంబంధించింది
“జ్ఞానం” అన్నది పరలోక చింతన చేసేది
“జ్ఞానం” అంటే అది “మరణం తరువాత ఏమిటి?” అన్నది కనుక్కునేది
“జ్ఞానం” అంటే “పుట్టుకకు పూర్వం ఏమిటి?” అని తెలుసుకునేది
“బుద్ధి” అన్నది ఇహలోకపు మంచి-చెడులకు సంబంధించినది
“బుద్ధి” అన్నది ఇహలోకపు నడవడికకు సంబంధించినది
పువ్వు పుట్టగానే పరిమళించకపోవచ్చు .. కానీ పరిమళించి తీరాలి
“బహూనాం జన్మనామంతే .. జ్ఞానవాన్ ‘మాం’ ప్రపద్యతే
వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః”
ఎన్నో “బుద్ధియుత జన్మల” తరువాతే, పరంపరగా, మనలో “జ్ఞానం”అన్నది అంకురిస్తుంది
“పువ్వు”గా తయారైన తరువాత కూడా మానవజన్మ మరి పరిమిళించాలంటే
ప్రాపంచిక “బుద్ధియుత జీవితం”తో పాటు
“ఆత్మజ్ఞానం+అహింసాయుత జీవన విధానం” అన్నవి విధిగా కలిగి వుండాలి
“అహింసాయుత జీవన విధానం” అంటే .. “శాకాహారులుగా వుండడమే” కదా!
తోటి జంతు, పక్షి, మత్స్య, ప్రాణికోటి పట్ల కరుణ, దయ అన్నవి విధిగా కలిగి వుండాలి
ప్రాపంచికంగా
ఎంతటి గొప్ప మేధావులయినా, ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞులు అయినా
ఎంతటి గొప్ప ప్రజానాయకులు అయినా
“ఆత్మజ్ఞానం” మరి “అహింసాయుత జీవన విధానం” అన్నవి మౌలికంగా లేకపోతే
వారి జీవితాలు .. “వాసన లేని పువ్వులు”గానే మిగిలిపోతాయి
ఇకనుంచీ
ప్రాపంచికతతో నిండిన తావి లేని పుష్పాలన్నీ
ఆత్మజ్ఞానంతో కూడి .. అహింసా జీవిత విధానంతో కూడి .. ‘తావి’ ఉన్న పుష్పాలుగా అవుగాక!
బుద్ధి+జ్ఞానం = పుష్పం+పరిమళం