భక్తులుగా దేవాలయంలోకి వెళ్ళి ..
భగవంతులుగా రావాలి
“2012 సంవత్సరంలో ఉగాది చాలా శ్రేష్టమైంది ; ఎన్నో సంవత్సరాలనుంచి .. ‘1999 మొట్టమొదటి యుగాంతం అన్నారు ‘. ‘2012 రెండవ యుగాంతం’ అన్నారు. నిజమే అయితే ఈ రెండు యుగాంతాల గురించి మనం తెలుసుకోవాలి.
“1987 + 25 = 2012 .. “
“అంటే, 1987 నుంచి 25 సంవత్సరాలకు 2012 వస్తుంది. సరిగ్గా మధ్యలో 1999 వస్తుంది. ఆ రోజుల్లో డా||వేదవ్యాసగారు 1999 సంవత్సరాన్నే కలియుగాంతం అన్నారు. ‘కలి ‘ అంటే .. ‘అంధకారం’ అంటే ‘ అజ్ఞానం ‘. ‘కలియుగాంతం ‘ అంటే అంధకారం వంటి అజ్ఞానంతో కూడిన యుగం అంతం కాబోతుంది ‘ .. మరి అందుకోసం 25 సంవత్సరాలు సమయం పడుతుంది. ఇది అంతా ఖగోళ శాస్త్రానికి సంబంధించింది.
“చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు .. మరి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, ఈ సూర్యమండలం అంతా కలిసి ‘ అల్సియోన్ ‘ అనే నాల్గవ తలంలోని నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఆల్సియోన్ .. ‘ గెలాక్టిక్ కేంద్రం ‘ చుట్టూ తిరుగుతుంది.
“భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఒక నెల పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు పడుతుంది. సూర్యుడు అల్సియోన్ చుట్టూ తిరగడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది ; ఆల్సియోన్ తన మహాకేంద్రం చుట్టూ పరిభ్రమించడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.
“ఈ 26,000 సంవత్సరాలలో భూమి ఫోటాన్ బాండ్లోకి రెండు సార్లు ప్రవేశిస్తుంది. మన సోలార్ సిస్టమ్ 1987వ సంవత్సరంలో ఫోటాన్ బాండ్లోకి ప్రవేశించి ప్రస్తుతం ఇప్పుడు 2012 సంవత్సరం డిసెంబర్ 21 నాటికి పూర్తిగా ఫోటాన్ బాండ్లోకి వచ్చేస్తుంది. ఇవి అన్నీ ఖగోళ శాస్త్ర సత్యాలు.
“సూర్యుడు మనకు తెలుసు .. కంటికి కనిపిస్తుంది ; అయితే ‘ అల్సియోన్ ‘ ఈ కంటికి కనిపించదు. దానిని దివ్యచక్షువు ద్వారానే తెలుసుకోగలం. అలాగె విశ్వంలో చుట్టూ జరిగేవి అన్నీ కూడా ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. ‘ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ?, ‘ పుట్టుక ముందు ఎక్కడ వుండేవాళ్ళం ? ‘ అన్నవి అన్నీకూడా మనకు శ్వాస మీద ధ్యాస .. ద్వారానే తెలుసుకుంటాం.
” మన జేబులో డబ్బు ఉంది ; అయితే, మన జేబులో డబ్బు వున్న సంగతి మనకు తెలియకపోతే, అందరినీ ‘ డబ్బు కావాలి ‘ అని అడుగుతాం. అలాగే ఆత్మ వుంది ; కానీ ఆత్మ దగ్గరకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఆత్మ మూయబడలేదు. తెరచుకునే వుంది. ఆత్మ దగ్గరకు చేరుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస వుంచాలి. అప్పుడు ఆత్మ యొక్క జ్ఞానం తెలుస్తుంది. ‘ ఏది సత్యం ? ఏది నిత్యం అన్నది ? ‘ తెలుసుకుంటాం. దానినే ‘ విచక్షణా జ్ఞానం ‘ అంటాం. మరి జ్ఞానం చేయవలసిన ధ్యానం చేస్తే .. పొందవలసినవి అన్నీ పొందుతాం “
“దేవాలయాలకూ, చర్చిలకూ, మసీదులకూ వెళ్ళాలి ; అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి. వేంకటేశ్వరస్వామి గుడిలోకి భక్తుడుగా వెళ్ళాలి .. వేంకటేశ్వరుడులా బయటకు రావాలి, ఏడు శరీరాలను ఉత్తేజితం చేసుకుని రావాలి, అయ్యప్పస్వామి గుడిలోకి అయ్యప్ప స్వామి భక్తుడిలా వెళ్ళాలి .. అయ్యప్పలా తయారయి బయటికి రావాలి, జీసస్ భక్తుడిలా చర్చిలోకి వెళ్ళాలి .. జీసస్లా బయటకు రావాలి.
“ముందు ప్రాపంచికంగా పరిపూర్ణంగా జీవించాలి .. తరువాత ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఎదగాలి. ముందు ‘ అర్జునుడు ‘ కావాలి .. ఆ తరువాత ధ్యానం చేసి ‘ కృష్ణుడు ‘ గా ఎదగాలి. “
“భూమి మీద ‘ స్వర్గం ‘ అన్నది అహింస ద్వారానే సాధ్యం. భూమి మీద వున్న ఆఖరి వ్యక్తి మాంసం మానేవరకు నేను భూమి మీదే వుంటాను. తెలిసి మాంసాహరం తింటే పాపం .. తెలియక మాంసం తింటే అజ్ఞానం. పాపాలు రోగాలకు మూలకారణం .. అజ్ఞానం అస్వస్థతలకు మూలకారణం.
“పై లోకాలలో అందరూ ఒకేలాగ వుంటారు. భూలోకంలోనే మనుష్యులు రకరకాల వారు వుంటారు .. ఇక్కడ అందరూ కలిసి మెలిసి జీవించడం చాలా గొప్ప విషయం. ఇక్కడ వున్న నవరసాలు అనుభవించాలి. పై లోకం నుంచి ఇక్కడకు వచ్చేది అందుకే. విశేషమైన అనుభవాలకోసమే మనం జన్మ తీసుకుని వచ్చాం. ఒకసారి పేదవాడిగా, ఒకసారి ధనవంతుడిగా, ఒకసారి స్త్రీగా .. ప్రతి ఒక్క జన్మ కూడా రకరకాల అనుభవాల పుట్ట.”