‘భావం’ .. అన్నదే ‘భవం’ అవుతుంది
“ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నివారణామార్గాన్ని కనుక్కుంటాను” అని కపిలవస్తు రాకుమారుడైన సిద్ధార్థుడు రాజప్రసాదాన్ని వదిలి ఒక సన్యాసిలా సత్యాన్వేషణ చేస్తూ బయలుదేరాడు. అయిదున్నర సంవత్సరాలపాటు అందరు గురువుల దగ్గరికీ తిరిగి .. నేర్చుకోవలసినదంతా నేర్చుకుని కూడా అతడు తృప్తి చెందలేదు. ఇక చివరి ప్రయత్నంగా తన ‘శ్వాస’ దగ్గరికి వెళ్ళాడు!
తన శ్వాసనే తన గురువుగా యెంచి .. తన లోపలికి తాను ప్రయాణించి .. తన అంతరంగాన్ని శోధించి .. ” ‘దుఃఖం’ అన్నది తృష్ణవలన కలుగుతుంది” అని తెలుసుకున్నాడు. ” ‘తృష్ణ’ అన్నది ‘అవిద్య’ లేదా ‘అజ్ఞానం’ వలన కలుగుతోంది కనుక ధ్యానం చేసి ఆ అవిద్యను తొలగించుకుంటే దుఃఖం నుంచి తక్షణమే విముక్తలం అవుతాం” అని తెలుసుకున్నాడు.
“అవిద్య” అంటే “ఆత్మ లేని విద్య” .. కనుక నాలుగు ఆర్యసత్యాలు మరి అష్టాంగమార్గంతో కూడిన ఆత్మజ్ఞానప్రకాశంతో తన అవిద్యను దూరం చేసుకున్న సిద్ధార్థుడు “బుద్ధుడు” అయ్యాడు! బుద్ధత్వం గురించి తెలుసుకున్న ఆ బుద్ధుడు వెంటనే ఈ సత్యాన్ని అందరికీ తెలియజేసి వాళ్ళను కూడా తనలాంటి బుద్ధుళ్ళుగా మార్చాలని ఆనాపానసతి ధ్యాన ప్రచారానికై బయలుదేరాడు.
ఇలా నిరంతర ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై .. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది మరి ఒక బుద్ధుడిలా చేయవలసిన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది.
“తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున”
(భ గీ ||6-46)
“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు, కనుక అర్జునా! యోగివి కా!” అని సూచించాడు శ్రీకృష్ణుడు.
రకరకాల పూజలూ, ఉపవాసాలూ మరి తపస్సులూ చేస్తే శరీరం తపిస్తుందే కానీ ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం మాత్రం పోదు. సకల సంస్కృత శ్లోకాలను కంఠతా పట్టేసి రకరకాల శాస్త్రవిజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం పోదు. గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తిప్రతిష్ఠలు పొందినా ఆత్మను ఆవరించి వున్న అజ్ఞానం పోదు.
“క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే
క్షుద్రం హృదయదౌర్భల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప”
(భ గీ || 2-3)
“ఓ అర్జునా! పిరికితనానికి లోనుకావద్దు .. నీకు ఇది ఉచితం కాదు. ఓ పరంతపా! ఈ హృదయదౌర్భల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించు” అంటూ కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు. “శరీరం” అన్నది. “ఆత్మ” కు ‘నీడ’ వంటిది. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు ఆత్మకు “అజ్ఞానం” అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడలాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు వేసినా, పుణ్యనదుల్లో మునిగినా మరి స్త్రోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు! చెయ్యవలసింది .. చిత్త వృత్తులన్నీ నిరోధించుకుని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో యోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవడం.
సత్యాన్ని తెలుసుకునేంత వరకూ .. దానిని తెలుసుకోవడమే పని! మరి తెలుసుకున్నాక దానిని అందరికీ తెలియజెయ్యడమే పని! మనం ఎవరిమో ఏ పనికోసం పుట్టామో తెలుసుకునేంత వరకూ మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తరువాత ఇక ఆ చెయ్యాల్సిన పని చేస్తూంటే ఆనందమే ఆనందం!
అలనాడు గౌతమబుద్ధుడు అనుభవించిన ఆనందం అదే .. మరి ఈ రోజు ఆనాపానసతి .. “శ్వాస మీద ధ్యాస” ధ్యానప్రచారం చేస్తూ పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూన్న ఆనందం అదే!
చిన్నప్పటి నుంచే యోగస్థితిలో ఉంటూ పరమ యోగిలా గృహస్థధర్మంలోకి ప్రవేశించి విహిత ప్రాపంచిక కర్మలు చేయాలి. అప్పుడే అవి ధర్మబద్ధంగా సమస్థితిలో ఉంటాయి. లేకపోతే జీవితం అంతా కూడా తప్పులతడకగా మారి “గృహస్థ ధర్మం” అంతా కూడా “గృహస్థ అధర్మం” అవుతుంది. అందుకే
“యోగస్థ కురుకర్మాణి సంగం తక్త్వా ధనంజయ
సిద్ధ్యస్సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే”
(భ గీ || 2-48)
“ఓ ధనుంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావాన్ని కలిగియుండి కర్తవ్యకర్మలను ఆచరించాలి. ఈ సమత్వ భావాన్నే యోగం అంటాం” అని యోగాన్ని నిర్వచించాడు శ్రీకృష్ణుడు. “దమం” లోంచి “సమం” అన్నది వస్తుంది. “దమం” అంటే బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకోవడం; “సమం” అంటే అంతరేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడం. బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకుని ధ్యానం చేసినప్పుడు అంతరేంద్రియమైన మనస్సు అదుపులోకి వచ్చి .. మనం సమత్వస్థితిని పొంది ఆత్మమూల ప్రకృతిని అవగతం చేసుకుంటాం.
ఇలా “ఆత్మమూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వ స్థితిని పొందటమే యోగం” అనిపించుకుంటుంది కానీ శీర్షాసనం, కుక్కుటాసనం వంటి శారీరక విన్యాసాలు చేసి “అదే యోగం” అనుకున్నంత మాత్రాన ఆత్మసత్యం అవగతమైపోదు.
ధ్యానం ఉన్న దగ్గర వివేకం ఉంటుంది. వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేని అకర్మలుగా మారి లోకకల్యాణ కారకాలవుతాయి. కనుక ..
“కర్మణ్య కర్మ యః పశ్యేద కర్మణి చ కర్మ యః
స బుద్ధిమాన్ మ్నుష్యేషు స యుక్తః కృత్స్నకర్మతృత్”
(భ గీ || 4-18)
“కర్మలో అకర్మనూ, అకర్మలో కర్మనూ దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి; అతడే యోగి మరి సమస్త కర్మలను చేసేవాడు” అంటూ యోగస్థితిలో ఉన్న బుద్ధిమంతుడు చేసే కర్మలపట్ల స్పష్టతను తెలియజేశారు శ్రీకృష్ణుల వారు.
కర్మను అకర్మగా .. అకర్మను కర్మగా భావించడమే నిజమైనకర్మ! “భావం” అన్నదే “భవం” అవుతుంది కనుక “నా ద్వారా ఉత్తమోత్తమమైన కర్మ నిర్వహించబడుతోంది” అని భావన చేసుకుని .. కర్మ ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది “అకర్మ” అవుతుంది.
అనుకోవడం బీజం .. అవడం వృక్షం! బీజం వేస్తే ఏదో ఒక రోజు వర్షం పడి .. ఆ బీజం మొలకెత్తి .. ఒక మహావృక్షం అయినట్లు .. ఉత్తమోత్తమమైన సంకల్పం ద్వారా ఉన్నతోన్నతమైన కర్మలు నిర్వహించబడతాయి.