బాబా కాన్స్‌ప్ట్
మానవుడికి చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి.
- చిటికెన వ్రేలు
- ఉంగరపు వ్రేలు
- మధ్య వ్రేలు
- చూపుడు వ్రేలు
- బొటన వ్రేలు
ఈ ఐదు వ్రేళ్ళూ ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో మనవైన వివిధ అంశాలకు ప్రతీకలుగా ఉన్నాయి.
చిటికిన వ్రేలు > భౌతిక శరీరం |
ఉంగరపు వ్రేలు > మనస్సు |
మధ్య వ్రేలు > బుద్ధి |
చూపుడు వ్రేలు > జీవాత్మ |
బొటన వ్రేలు > సర్వాత్మ |
“భౌతిక శరీరం”
ఈ భౌతిక శరీరం పాంచభౌతిక ప్రకృతి నుంచీ, తల్లిదండ్రుల నుంచీ మనకు సంప్రాప్తిస్తుంది. మన నిజస్వరూపంలో వ్యక్తమవుతున్న అతిచిన్న భాగమే మన ఈ భౌతిక శరీరం. అందుకే ఈ భౌతిక శరీరం చేతివ్రేళ్ళలోని ‘చిటికెన వ్రేలు’, అతి చిన్న వ్రేలుతో సూచించబడుతుంది.
మీరే చూడండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, తరగతి గదిలో ఉన్నప్పుడు అప్రమేయంగా భౌతిక ప్రాకృతిక అవసరానికి “టీచర్, టీచర్” అంటూ మనం చూపించిన వ్రేలు అదే కదా.
“మనస్సు”
రెండు హృదయాలు … రెండు మనస్సులు కలిసినప్పుడు, ఒకే పౌనఃపున్యంతో అనునాదం చెంది ఉత్సాహవంతమైనప్పుడు జరిగే వివాహ బంధానికి సాక్షిగా ఉంగరాలు మార్చుకునేది ఈ రెండవదైన ‘ఉంగరపు వ్రేలు’కే … మరే వ్రేలుకూ కాదు. అందుకే ఈ రెండవ వ్రేలు “మనస్సు” కు సూచన. “మనస్సు” ప్రధానంగా సమాజం నుంచి వస్తుంది. అంటే మనం హిందువుగా పుట్టి పెరిగితే ‘హిందుత్వపు మనస్సు’, క్రిస్టియన్‌గా పుట్టి పెరిగితే ‘క్రైస్తవ మనస్సు’ … ఇలాగన్నమాట. స్థూలంగా మనం పెరిగిన పరిసరాల వాతావరణం లోని అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాల సముదాయమే ‘మనస్సు’ గా ఎదుగుతుంది.
* * *
అంతేకాదు, ఈ ఉంగరపు వ్రేలు, చిటికెన వ్రేలు కన్నా, బాగా పెద్దగా వుంటుంది కదా . . . కనుక, “ఈ ‘మనస్సు’ అనేది ‘భౌతిక శరీరం’ కన్నా చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి వుంది” అనే విషయాన్ని ఈ వ్రేళ్ళ పరిమాణాల్లోని తేడా చూపిస్తుందన్నమాట. భౌతిక శరీరాన్ని పరిపాలించేదీ, అదుపాజ్ఞాలలో ఉంచేదీ ఈ మనస్సే కనుక, అలాంటి మనస్సు ‘ ఉంగరపు వ్రేలు ‘ సూచిస్తుంది.
“బుద్ధి”
మంచినీ, చెడునూ … నిజాన్నీ, అబద్ధాన్నీ … సరైనదాన్నీ, సరికానిదాన్నీ … సత్యాన్నీ, అసత్యాన్నీ … ప్రాముఖ్యతనీ, ప్రాముఖ్యతా రాహిత్యాన్నీ … అందాన్నీ అందహీనతనీ … విస్పష్టంగా సామాజిక ప్రభావాలకు భిన్నంగా మనకు విశదపరిచేదే మన “బుద్ధి”.
* * *
“మనస్సు” మదమత్సరాల పెన్నిధి, రాగద్వేషాల సన్నిధిగా వుంటే “బుద్ధి” మాత్రం వీటన్నింటికీ అతీతంగా వుంటుంది.
* * *
జీవాత్మ యొక్క గడచిన అనేకానేక జన్మలూ, ఆ జన్మల లోని మొత్తం అనుభవాల ద్వారా వివసించిన జ్ఞాన సారాంశ పాఠమే కర్మఫలమే మన “బుద్ధి”. గతజన్మల అనుభవ జ్ఞానమే విచక్షణాశక్తికి ఉత్పత్తి కేంద్రంగా వుంటుంది. మన జీవాత్మకు వున్న భూతల జీవిత చరిత్ర సమగ్ర స్వరూపమే ఈ “బుద్ధి”.
* * *
‘మధ్య వ్రేలు’ సహజంగానే ఉంగరపు వ్రేలు కన్నా పెద్దదిగా వుంటుంది. “బుద్ధి” సహంజగానే “మనస్సు” కన్నా గొప్పది మరి. “మధ్యేమార్గం” లో వుంచేదే “బుద్ధి” … విపరీత ధోరణులతో ఊగిసలాడేదే “మనస్సు” . అన్ని జన్మల మొత్తం అనుభవ జ్ఞానం, ప్రత్యేకించి ఈ జన్మలోని అనుభవ జ్ఞానం కన్నా, ఇప్పటి మన సామాజిక ఆలోచనాధోరణి కన్నా సహజంగానే … పెద్దది కదా. మధ్య వ్రేలు “బుద్ధి” ని సూచిస్తుంది.
“జీవాత్మ”
మనం ఎవరికైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు, ఆ దిశగా చూపించటానికి ఉపయోగించేది కేవలం ‘చూపుడు వ్రేలు’ ను మాత్రమే కదా. నిజానికి ఈ ‘మనం’ అనేది కేవలం భౌతిక శరీరం కాదు ; మనస్సు మాత్రమే కాదు ; కేవలం ‘బుద్ధి’ కూడా కాదు ; అవి అన్నీ వెరసి మన ‘వ్యక్తిత్వం’ ‘మనం’ అంటే … యదార్ధానికి … ఆత్మస్వరూపం … జీవాత్మ. ‘మనం’ అనే నిజమైన స్వరూపం . . . మన జీవాత్మే. అనంత చైతన్య సాగరంలోంచి జనించిన ఓ చిన్ని మబ్బుతునకే … ఈ జీవాత్మ. “స్వతంత్ర ఎరుక” గా ప్రకాశిస్తున్న “నేను” యొక్క అసలు స్వరూపమే … ఈ “జీవాత్మ”. ఈ స్వతంత్ర ఎరుకను, మన అసలైన ‘నేను’ ను సూచించేదే చూపుడు వ్రేలు.
“సర్వాత్మ లేదా విశ్వాత్మ”
‘జీవాత్మ’ కు మాతృ స్థానమే ఈ “సర్వాత్మ” లేదా “విశ్వాత్మ”. మనమందరమూ భౌతికంగా, మానసికంగా ఇంకా బుద్ధిపరంగా వేరు వేరుగా, విభిన్నంగా వుంటాం. అయితే అన్నిటికీ ఆధారమైన ఆత్మపదార్ధం మాత్రం అందరిలోనూ ఒకేరకంగా ఉంటుంది. విశ్వాత్మ స్థాయిలో మనం అందరమూ “ఏక స్వరూపం” గానే వుంటాం. అనంతంగా గల జీవాత్మలన్నింటి ఆధారం – మూలం – అపరిమిత చైతన్యంనే ” విశ్వాత్మ” గా పిలుస్తారు. ఈ ఆధారం – మూలం – అపరిమిత చైతన్యమే మరో రకంగా “బ్రహ్మాత్మ” లేదా “సర్వభూతాత్మ” గా పిలవబడుతుంది.
* * *
సత్యాలకే పరమ సత్యమైన సిద్ధాంతమిలా చెప్తుంది : “మమాత్మా సర్వభూతాత్మ” “నాలోని ఆత్మ స్వరూపమే అన్ని జీవులలోనూ కొలువై వున్న విశ్వాత్మ స్వరూపం.”
* * *
ఈ విశ్వాత్మ మన ‘బొటన వ్రేలి’ తో సూచించ బడుతుంది. ‘విజయం’ అన్నది అందుకే ఎప్పుడూ ఈ వ్రేలితోనే చూపించబడుతుంది. విశ్వాత్మ తత్త్వాన్ని తెలుసుకోవటం ద్వారా మనమంతా ఘనవిజయాన్ని సొంతం చేసుకోవటానికి పాటుపడదాం.
“బాబా ముద్ర”
“బాబా ముద్ర” లో ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, బొటన వ్రేలితో ముడిచి వుంటాయి. మిగిలిన రెండు వ్రేళ్ళూ … చిటికెన వ్రేలు, చూపుడు వ్రేలు మాత్రం విడిగా, నిటారుగా వుంటాయి. దాని భావం ఏమిటంటే … మన ఆధ్యాత్మిక సంపదల కోసం భౌతిక శరీరాన్ని ఏ మాత్రం కష్టపెట్టనవసరం లేదు. భౌతిక శరీరాన్ని కష్టపెట్టడం సరైన పద్ధతి కాదు. అనుసరించదగింది కానే కాదు. ప్రకృతి దేవతల అపురూపమైన సహాయంతో ఈ పాంచ భౌతిక ప్రకృతి విశేషమైన సాధన వల్ల మనకు సంప్రాప్తించిన అద్భుతమైన, అనన్యమైన వరప్రసాదం. వాస్తవానికి ఎలాంటి హఠయోగాలూ సాధన చేయనవసరంలేదు. ఎలాంటి ప్రత్యేక శీర్షాసనాలు వేయవలసిన పని లేదు. ఇక రెండవదైన … ఉంగరపు వ్రేలు … అదే “మనస్సు” , మాత్రం, మనలో ఖచ్చితంగా నియంత్రించదగిన విభాగం. “మనస్సు” కు తీవ్రస్థాయిలో క్రమశిక్షణ అత్యవసరం… తగినంత ప్రక్షాళన తప్పనిసరి. * * * అరిషడ్వర్గాలు, అనేక రకాల సామాజిక మూర్ఖత్వాలూ అన్నీ ఈ “మనస్సు” వల్లనే మన నుంచి బయటకు ప్రతిబింబిస్తూంటాయి. సామాజిక వొత్తిళ్ళ వలన ప్రేరేపించబడే అలాంటి గుణదోషాన్నీ మన బాహ్య వ్యక్తిత్వం లోని నిగూఢ పవిత్రతనూ, సహజంగా వుండే దివ్యజ్ఞానాన్నీ భంగపరుస్తాయి. ఈ నిగూఢ వ్యక్తిత్వం లోని సమాజపు మూర్ఖత్వాలనూ, గుణదోషాలనూ పలుచన చేసి క్రమేణా ఆవిరి చేసే పద్ధతే “ధ్యానం”.
* * *
మరి, ఈ మనస్సును అదుపులో పెట్టగలిగినదేది ? కేవలం విశ్వాత్మ మాత్రమే. అయితే, ఇది ‘విశ్వాత్మ’ జోక్యం, కేవలం జీవాత్మ అనుమతితో మాత్రమే సాధ్యపడుతుంది. ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి మనస్సు సంపూర్ణంగా అంగీకరించితీరాలి.
* * *
మన “జీవాత్మ”, లేదా “స్వతంత్ర ఎరుక” తనకు తానుగా ప్రక్షాళన చెందాలనీ, పవిత్రంగా తయారవ్వాలనీ సంకల్పించినప్పుడు మాత్రమే ఎవ్వరైనా ఆ ‘ధ్యానస్థితి’ లోకి వెళ్ళగలగతారు. అలాంటి ‘ధ్యానస్థితి’ లో మాత్రమే విశ్వాత్మ మనస్సును సంస్కరించే గురుతర బాధ్యతను స్వీకరించి మనస్సును పవిత్రంగా చేస్తుంది. “బాబా ముద్ర” లో ఉంగర వ్రేలు, ‘బొటన వ్రేలి’ లో బంధింపబడి ఉండటం లోని అంతరార్థం ఇదే. ఉంగరపు వ్రేలు మరి బొటన వ్రేలు ద్వారా నియంత్రింపబడి వుండడాన్నే “ధ్యాన యోగం” అంటాం.
* * *
అదేవిధంగా “బుద్ధి” కూడా అంతే … మధ్యవ్రేలు, కూడా పరిమితమైన ప్రాపంచిక జ్ఞానంతో మిడి మిడి జ్ఞానంతో వున్నదై అదుపులో పెట్టదగినదాగినే వుంటుంది. “మిడి మిడి జ్ఞానం” ఎప్పుడూ ప్రమాదకరం. మిడి మిడి జ్ఞానం అన్నది ఒక్క “పరిపూర్ణ జ్ఞానం” అన్నదానితో మాత్రమే నియంత్రించబడుతుంది. “విశ్వాత్మ” మాత్రమే “పరిపూర్ణ జ్ఞానం” తో అలరారుతూ వుంటుంది. మధ్యవ్రేలు సైతం బొటన వ్రేలితో బంధింపబడి ఉండటం లోని అంతరార్థం ఇదే. మధ్యవ్రేలు బొటన వ్రేలి ద్వారా నియంత్రింపబడటమే “జ్ఞానయోగం” ఎప్పుడైతే జీవాత్మ తనలో దివ్యజ్ఞాన ప్రకాశాన్నీ వాంఛిస్తుందో అప్పుడు మాత్రమే ఆ జీవాత్మ ధ్యాన నిమగ్నురాలు అవుతుంది. జీవాత్మ ధ్యాన స్థితికి అడుగిడగానే విశ్వాత్మ బుద్ధిని తన అధీనంలోకి తీసుకుని సంపూర్ణ పరిణితిని ప్రసాదిస్తుంది. పరిమిత బుద్ధి … ప్రాపంచిక బుద్ధి … తుదకు అపరిమిత ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఓలలాడి … “పరిపూర్ణ బుద్ధి (సద్బుద్ధి)” గా ఉదయిస్తుంది. * * * ప్రాపంచిక మిడి మిడి తెలివి పరిపూర్ణ బుద్ధి పరిణితి చెందటాన్నే ఆధ్యాత్మిక జ్ఞానవికాసంగా పిలవబడుతుంది. అర్ధం చేసుకోవలసిన అతిముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ “జ్ఞానయోగం” అన్నది “ధ్యానయోగం” ద్వారానే సహజంగా, అద్భుతంగా తనకు తానుగా ప్రాప్తిస్తుంది. “బాబా కాన్సెప్ట్” సారాంశం స్థూలంగా . . . ఉంగరపు వ్రేలు ప్రక్షాళన . . . ధ్యానయోగం మధ్య వ్రేలు ప్రక్షాళన . . . జ్ఞానయోగం మనస్సు స్థాయి నుంచి పరిపూర్ణ బుద్ధి స్థాయికి జరిగే పరిణామమే . . . “ధ్యానం”, “ఆధ్యాత్మిక శాస్త్రం” , లేదా “దివ్యజ్ఞాన ప్రకాశం (ఎన్‌లైటెన్‌మెంట్)”.