ఆత్మ కు మంచీ చెడూ లేదు
“పత్రీజీ” .. “మనస్సును ఖాళీ చేస్తే శరీరం వజ్రకాయంలా మారుతుంది. శరీరం మనస్సును ప్రతిబింబిస్తుంది .. దానికోసం మనమే వైద్యులుగా మారాలి. ‘MBBS’ అంటే ‘బాచెలర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ బాచెలర్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ’ తో ఆనందంగా వుండండి. ప్రతీదీ మన చేతిలోనే వుంది. చేతికి వున్న అయిదు వ్రేళ్ళు..
1.”చిటికెనవ్రేలు:-శరీరానికి సంకేతం; శరీరం స్త్రీ పురుషుడు అనే రెండు విధాలుగా వుంటుంది. నఖశిఖపర్యంతమూ ఉన్న శరీరం తల్లి దండ్రుల నుంచి వస్తుంది; దేహం మాతపితానుసారిణీ!
2.ఉంగరపువ్రేలు:- మనస్సుకు సంకేతం, అది పలువిధాలుగా వుంటుంది. ఆలోచనల, నమ్మకాలపుట్ట. మనం పెంచబడిన సమాజం ద్వారా వచ్చే మనస్సు సమాజానికి ప్రతిబింబం; అంటే మనస్సు సమాజానుసారిణీ.
3. మధ్యవ్రేలు:- బుద్ధికి సంకేతం; ఇది గత జన్మల కర్మల నుంచి సంక్రమిస్తుంది. బుద్ధీ కర్మానుసారిణీ.
4.చూపుడువ్రేలు:- ఆత్మకు సంకేతం. ఇది పూర్ణాత్మలోని భాగం కనుక ఆత్మ .. ఇది సర్వాత్మానుసారిణీ.
5. బొటనవ్రేలు: సర్వాత్మకు సంకేతం. అన్నింటికీ అదే ఆధారం. అది అనాది, అనంతం.
“ప్రతి ఒక్క ఆత్మా సర్వాత్మ యొక్క అంశాత్మయే. సముద్రంలోని నీటి బిందువే.
“వ్రేళ్ళను వరుసగా చూస్తే చిటికెన వ్రేలు కంటే ఉంగరపు వ్రేలు పెద్దగా వుంటుంది .. అంటే శరీరం మనస్సుతో ప్రభావితం చేయబడుతుంది. మనస్సుకు ఒకవైపు బుద్ధి, మరొక వైపు శరీరం ఉన్నాయి. అంటే మనస్సును బుద్ధి శరీరం రెండూ అదుపు చేస్తాయి. మధ్యవ్రేలుకు అంటే బుద్ధికి ఒక వైపు మనస్సు మరొక వైపు ఆత్మ వున్నాయి.
“బుద్ధి” ఆ రెండింటితోనూ ప్రభావితం అవుతుంది. ఆత్మకు మనస్సు నుంచి, బుద్ధి నుంచి, ముక్తి కావాలి. అందుకే అది సర్వాత్మను చేరుతుంది. ఆత్మ సర్వాత్మతో కలవడమే ధ్యానం – అప్పుడే విశ్వశక్తి ప్రవాహం. ఆ విశ్వశక్తి ప్రవాహం వలన శరీర ఆరోగ్యం, మనఃశాంతి, బుద్ధి ప్రకాశం పొందటమే కాక సర్వాత్మను చేరిన ఆత్మ ‘పరమాత్మ’గా మారుతుంది.
“శరీరానికి పైన ఆత్మ వుంది; కానీ మనస్సు, బుద్ధులకు పైన ఏదీ లేదు, అందుకే ధ్యానం తరువాత కూడా మూర్ఖత్వంతో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉంటారు.
“బాబాముద్ర”
“శరీరం స్వచ్ఛమైనది, దానిలో మంచీ, చెడూ లేవు. మనస్సులో స్వచ్ఛత లేదు, బుద్ధికి మంచీ, చెడూ వున్నాయి. ఆత్మ కు మంచీ చెడూ లేదు .. అది శుద్ధచైతన్యం. శరీరానికి ఆత్మకు మధ్య ఇద్దరు అసురులు ఉన్నారు. వారిని సర్వాత్మతో అణచిపెట్టాలి. అందుకే బాబా చూపుడు, చిటికెన వ్రేళ్ళను పైకి లేపి .. మధ్య, ఉంగరపు వ్రేళ్ళను క్రిందకు వంచి బొటన వ్రేలితో నొక్కి వుంచే ముద్రను చూపుతారు. అంటే మనస్సు, బుద్ధిల ప్రాధాన్యత తగ్గించి ఆత్మ, శరీరాలకు .. రెండు స్వచ్ఛ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వమని చూపుతారు.
“ఆదర్శమూర్తులు”
“మన జీవితంలో ఆదర్శమూర్తులు .. ముగ్గురు స్త్రీలు – ముగ్గురు పురుషులు ఆదర్శమూర్తులు గా ఉన్నారు. అందులో ఒక స్త్రీ పేరు ‘పార్వతి’ ఆమె ఎప్పుడూ ధ్యానం చేస్తూ .. విశ్వశక్తిని ప్రోగుచేసుకుంటూ దానిని విశ్వకళ్యాణం కోసం వినియోగిస్తూ ఉంటుంది.
“రెండవ స్త్రీ ‘సరస్వతి’ .. చేతిలో పుస్తకంతో ఆవిడ ఎప్పుడూ స్వాధ్యాయ జ్ఞానాన్ని సమీకరించుకుంటూ .. సంగీతాన్ని సాధన చేస్తూ తనలోని జ్ఞానాన్నీ మరి సంగీతాన్నీ విశ్వకళ్యాణం కొసం వినియోగిస్తూ ఉంటుంది.
“మూడవ స్త్రీ పేరు ‘లక్ష్మీదేవి’ .. ఆవిడ ఎప్పుడూ తన దగ్గర ఉన్న ‘సేవ’, ‘ధనం’ అనే సంపదలను అందరికీ పంచుతూ వాటిని విశ్వకళ్యాణార్థం వినియోగిస్తూ ఉంటుంది.
“ఇక పురుషులలో మొదటి పురుషుడు అయిన ‘శివుడు’ మూడవ కంటిని ఉత్తేజపరచుకుని మనలోని అజ్ఞానం అంతమయ్యేంత వరకూ ధ్యానం చెయ్యాలని చెబుతూంటే .. రెండవ పురుషుడు అయిన ’బ్రహ్మ’ .. నిరంతరం సృజనాత్మకమైన ఆలోచనలతో ఈ భూమి మీద నూతనత్వాన్ని సృష్టిస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని బోధిస్తున్నాడు.
“ఇక మూడవ పురుషుడు అయిన ‘శ్రీమన్నారాయణుడు’ అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కూడా చిద్విలాసంగా శేషతల్పంపై పవ్వళించి .. ‘జీవితం అన్నది సమస్యలతో ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే అందులో హాయిగా జీవించాలి’ అని సందేశం ఇస్తున్నాడు.
“ఇలా గతం గురించీ మరి భవిష్యత్తు గురించీ ఆందోళన చెందకుండా వర్తమాన క్షణంలో జీవించే వాళ్ళంతా కూడా ఏ బాదరబందీ లేని శ్రీమన్నారాయణులే కనుక .. మనం కూడా నిరంతరం మనలోకొలువుదీరి ఉన్న ఆ పూర్ణపురుషుల మరి ఆ పరిపూర్ణ స్త్రీల యొక్క లక్షణాలతో విలసిల్లుతూ హాయిగా ఆనందంగా జీవించుదాం!