ఆత్మైక జీవన విధి విధానం

 

“మనం అంతా దేవుళ్ళం” అన్నదే పరమ సత్యం! ఈ సత్యాన్ని ప్రతి రోజూ పదే పదే మనం మననం చేసుకోవాలి. పదే పదే పలుకుతూ ఉండాలి. ఏది మన నోటిలోంచి పదే పదే బయటికి వస్తుందో అదే మా “నుదుటి మీది వ్రాత”గా మారుతుంది. కనుక మనం పదే పదే ఈ సత్యాన్ని పలుకుతూ ఉండాలి.

మన నోటిలోంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఒక “పెన్ను”గా మారి మన నుదుటి మీద వ్రాతను చకచకా వ్రాసేస్తుంది .. మరి మన జీవితాలను నిర్దేశిస్తుంది. వేరెవరో పై వాళ్ళు మన నుదుటి వ్రాతను ఎన్నటికీ వ్రాయజాలరు! నకారాత్మక మాటలను మన పెదవిదాటి బయటకు రానివ్వకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి.

ఫ్లూట్ వాయించడం రాకపోతే ఫ్లూట్‌ను ముట్టుకోకూడదు; సితార్ వాయించడం రాకపోతే సితార్‌ను ముట్టుకోకూడదు; అలాగే మాట్లాడడం రాకపోతే మాట్లాడకూడదు. తబలా వాయించడం రాకపోయినా తబలా వాయించడానికి సాహసిస్తే అందులోంచి అపస్వరాలతో కూడిన శబ్ధం వచ్చినట్లు .. మాట్లాడడం రాకపోయినా మాట్లాడడానికి సాహసిస్తే నోటిలోంచి పనికిమాలిన మాటలే వస్తాయి. దానివల్ల మనకు మహాపాపం చుట్టుకుంటుంది.

“వయొలిన్” .. “సితార్” .. “తబలా” అన్నవి అత్యంత పవిత్రమైన సంగీత పరికరాలు. “వాటిని వాయించడానికే నా జీవితాన్ని అంకితం చేస్తాను” అనుకుంటేనే మనం వాటిని ముట్టుకోవాలి. అప్పుడే వాటిని తాకే అర్హత మనకు వస్తుంది. లేకపోతే మహాపాపం వస్తుంది. అలాగే మన నోరు కూడా ఒక అత్యంత పవిత్రమైన వాయిద్య పరికరం! దానిని అత్యంత ఎరుకతో జాగ్రత్తగా ఉపయోగిస్తేనే దానిలోంచి పదిమందికీ స్ఫూర్తినిచ్చే సత్యపూర్వకమైన వాక్కులు వినసొంపుగా వస్తాయి. లేకపోతే అపవాక్కులు బయటికి వచ్చి మనకు మహాపాపం చుట్టుకుంటుంది.

ఒకసారి, ఒకానొక పెద్ద మనిషి రమణ మహర్షిని దర్శించుకోవడానికి అరుణాచలం వెళ్ళాడు.
“నువ్వెవరు?” అడిగాడు రమణ మహర్షి.
“నా పేరు సుబ్బారావండీ”
“నీ పేరు అడగలేదయ్యా .. నువ్వెవరు?”
“నా ఊరు నెల్లూరండీ”
“నీ ఊరు అడగలేదయ్యా .. నువ్వెవరు?”
“నేను సర్పంచ్‌గా పనిచేస్తూంటాను”
నువ్వేం చేస్తూంటావని అడగలేదయ్యా .. నువ్వెవరు?”
ఇంకేం చెప్పాలో తెలియని పెద్దమనిషి బుర్రగోక్కున్నాడు!

“నేనొక ఆత్మను” అని కనుక అతను చెప్పి ఉంటే రమణ మహర్షి చప్పున లేచి వచ్చి అతనిని సంతోషంగా కౌగలించుకుని ఉండేవారు. ఎందుకంటే రమణ మహర్షి తన జీవితమంతా వెచ్చించి ధ్యానయోగసాధన చేసి తెలుసుకున్న సత్యం అదే మరి!!

“మనం శరీరం కాదు ఆత్మ” అని తెలుసుకోనంత వరకు మన గురించి మనకు ఏమీ తెలియదు. అలా మన గురించి మనకు ఏమీ తెలియకపోతే అంతటా దుఃఖమే నిండి ఉంటుంది కనుక ధ్యానం చేసి మన గురించి మనం తెలుసుకుని సంతోషంగా జీవించడానికి తొమ్మిది ఆచరణాత్మక సూత్రాలను మనం మన “జీవిత విధి విధానం”గా మార్చుకోవాలి!

యుక్తాహారం యుక్తభాషణం యుక్తయోచనం
మితాహారం మితభాషణం మితయోచనం
నిరాహారం నిర్భాషణం నిర్యోచనం

ఏది తినాలో .. ఏది తినకూడదో తెలుసుకుని తినడమే “యుక్తాహార సేవనం”. ఇతర జంతువులను చంపి తిని శరీరాన్ని పాపపంకిలం చేసుకోకూడదు. కేవలం శుద్ధ శాకాహారాన్ని మాత్రమే .. అది కూడా శరీరానికి అవసరమైనంత మేర.. రుచిగా, శుచిగా మరి మితంగా శాస్త్రీయంగా భుజించడమే “మితాహారం”. “లంఖణం పరమౌషధం” అని పెద్దలు చెప్పారు కనుక వారానికి ఒక్కరోజు మహాత్మాగాంధీ గారిలా ఉపవాసం ఉండడమే “నిరాహారం”!

ఏది మాట్లాడాలో! ఏది మాట్లాడకూడదో ఆలోచించి మాట్లాడడమే “యుక్తభాషణం”! తెలిసినా, తెలియకపోయినా వడవడా వాగకూడదు. ఒక బుద్ధుడిలా సత్యపూర్వకమైన మాటలనే అవసరమైనంత మేర అవసరమైనప్పుడు మాత్రమే పలుకుతూ ఉండడమే “యుక్తభాషణం”.

ఏది ఎంత మాట్లాడాలో .. ఏ మాట ఎక్కడ ఆపెయ్యాలో తెలిసి మాట్లాడడం “మితభాషణం”! మహాత్మా గాంధీ గారిలా వారంలో ఒక రోజు నిర్భాషణంగా ఉండాలి. మెహర్ బాబా నలభై యేళ్ళ పాటు తన జీవితంలో మౌనం పాటించారు.

ఏది ఆలోచించాలో, దేని గురించి ఆలోచించకూడదో తెలుసుకుని మసలుకోవడం “యుక్త యోచనం”. “Out of sight, out of mind” .. శరీరం ఎక్కడ వుంటే మనస్సు కూడా అక్కడే వుండాలి; ఇంక ఎటూ పోకూడదు; ఏదీ ఆలోచించకూడదు. ఆఫీసులో విషయాలను ఇంట్లో .. మరి ఇంటి విషయాలను ఆఫీసులో కూర్చుని ఆలోచించకూడదు!

ఏ విషయం గురించి ఎంత మేరకు ఆలోచించాలో అన్న విజ్ఞతను కలిగి ఉండడం “మిత యోచనం”. పనికిమాలిన విషయాలతో బుర్రను వేడెక్కించుకోకూడదు. రోజులో కొద్దిసేపు ఆలోచనలన్నీ ఆపివేసి శూన్యస్థితిలో “నిర్యోచనంగా” గడపాలి అదే “ధ్యానం”!

ధ్యానాన్ని ఎంత ఎక్కువ చేస్తే అంతగా మనస్సు సేదదీరుతుంది. పగలంతా పనిచేసుకోవాలి .. రాత్రిళ్ళు ధ్యానం చేసుకోవాలి. వారంలో ఒక్కరోజు .. లేదా 11 రోజులు .. లేదా .. నలభైరోజులు అప్పుడప్పుడూ అఖండ ధ్యాన స్థితిలో గడపాలి!! ఇలా యుక్తాహార, యుక్తభాషణ, మరి యుక్తయోచనలతో సరియైన సాంసారిక జీవితాన్ని గడపాలి!!