ఆరోగ్యమే మహాభాగ్యం
“ఆరోగ్యం”
“ఆరోగ్యం మహాభాగ్యం” అని మనం చిన్నప్పటినుంచి వింటూనే వున్నాం కానీ .. పెద్దయిన తరువాత “మహాభాగ్యం అంటే మేడలూ, మిద్దెలూ కట్టడం” అనుకున్నాం.
మహాభాగ్యం అంటే ఆరోగ్యమే కానీ ధనం కాదు! ఆరోగ్యం అన్నదే సంపద! ధనం అన్నది భాగ్యం కాదు ..
కనుక మన మనస్సుల్లో ఆ ‘ధనం’ అన్నదాని మీది ప్రాముఖ్యం తీసివేసి ‘ఆరోగ్యం’ అన్నది పెట్టుకోవాలి. అప్పుడే ‘ఆరోగ్యం’ అనే మహాభాగ్యం ఎక్కడ నుంచి వస్తుంది? మన లోపలి నుంచి వస్తుంది!
“మహా ఆరోగ్యం “
మన లోపలికి మనం వెళ్ళాలి! మన లోపలికి వెళ్తే మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది!
నేనిప్పుడు మహా ఆరోగ్యంగా వున్నాను ; రోజుకీ ఎంత తిరుగుతానో నాకే తెలీదు. ఎంత పని చేస్తానో నాకే తెలీదు. అంత తిరుగుతూ, అంత పనిచేస్తూ ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నానో లెక్కలేదు. మరి నాకు ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను? నేను ఏ టాబ్లెట్లు వేసుకున్నాను? నేను ధ్యాన కార్యక్రమాలు చేపట్టడం వల్లనే నాకు మహా ఆరోగ్యం వచ్చింది!
“ధ్యాన సాధన … అంతర్ శరీరాలు”
ముప్ఫై సంవత్సరాల క్రిందట నేను ఎంతో లోపలికి వెళ్ళడం వల్ల నాకు మహా ఆరోగ్యం వచ్చింది. నాలోకి నేను వెళ్ళగా … వెళ్ళగా .. ఇంకేమీ లేదు ! అక్కడిదాక వెళ్ళాను ! మొదట స్థూలశరీరంలో వున్నాను. ధ్యానం చేయగా, చేయగా స్థూలశరీరం ప్రక్కకు పోయింది .. సూక్ష్మశరీరం వచ్చింది. మరి అందులో ధ్యానం చేశాను. అందులో ధ్యానం చేయగా .. చేయగా .. చేయగా .. సూక్ష్మశరీరం ప్రక్కకు పోయింది .. కారణ శరీరం వచ్చింది. మరి అందులో ఇంకా ధ్యానం చేయగా .. చేయగా .. చేయగా .. కారణశరీరం పోయింది .. మహాకారణశరీరం వచ్చింది. ఇంకా ధ్యానం చేయగా .. చేయగా ..మహాకారణం శరీరం పోయింది .. శూన్యం మిగిలింది. ఆ శూన్యంలో ఇంకా ధ్యానం చేస్తూ .. చేస్తూ ఉంటే .. ఇంకా మహా శూన్యమే ఉంది. మహాశూన్యం అవతల ఏమీ లేదు !
తిరిగివచ్చేశాను. తిరిగివచ్చేసినప్పుడు మళ్ళీ మహాకారణశరీరం కనిపించింది .. “ఓహ్” .. అనుకున్నాను. మళ్ళీ వెనుతిరిగి వస్తూంటే కారణశరీరం కనిపించింది. “ఓహ్” .. అని దాన్ని మళ్ళీ ధరించాను. మళ్ళీ ఇంకా తిరిగి వస్తూ ఉంటే సూక్ష్మశరీరం కనిపించింది. ” ఓహ్ ” .. అని దాన్నీ వేసుకున్నాను. మరి చివరికి వచ్చేసి మళ్ళీ ఏ ఇంట్లో అయితే ఈ స్థూలశరీరం ఉందో .. ధ్యానం చేసుకుంటూ .. మళ్ళీ ఆ శరీరంలోకి వచ్చేశాను!
“నాకు సర్వం తెలిసింది”
అప్పుడు నాకు సర్వం తెలిసింది ! స్థూలశరీరం, సూక్ష్మశరీరం, కారణశరీరం, మహాకారణశరీరం ఇవన్నీ కూడా నేనే! స్థూలమయశరీరాన్ని ‘ బాడీ – దేహం ’ అంటాం. సూక్ష్మశరీరాన్ని ‘మైండ్-మనస్స’ అంటాం. కారణశరీరాన్ని ‘ఇంటలెక్ట్ .. బుద్ధి ..’ అంటాం. మహాకారణ శరీరాన్ని ‘ఆత్మపదార్థం’ అంటాం! అయితే ‘నేను’ అనేది ఓ మహాశూన్యం! బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఆత్మ, సర్వాత్మ ..! మహాశూన్యం! మనం ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాం స్థూలశరీరంతో ఇప్పుడు మన ‘ప్రస్తుత చిరునామా’ స్థూలశరీరం ! తరువాతి అడ్రస్‌కు ఎక్కడికి వెళ్ళాలి మనం? మన సూక్ష్మశరీరానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే స్థూలశరీరాన్ని వదిలిపెట్టెయ్యాలి. స్థూలశరీరాన్ని వదిలిపెట్టేస్తేనే సూక్ష్మశరీరంలోకి, కారణశరీరం లోకి వస్తాం. ఈ విధంగా మనకి ఉన్న ఈ నాలుగు తొడుగులను వరుసగా ధ్యానంలో మనం చుసుకోవాలి.
“ఐదు సత్యాలు”
దేహం, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ! దేహచైతన్యంలో మాత్రం వుంటే .. త్రాగడం, తినడం, పడుకోవడం .. ఖానా, పీనా, సోనా .. కుంభకర్ణుడిలాంటివాడు.
శరీరం .. తమోగుణం .. కుంభకర్ణుడు మనస్సు .. రజోగుణం .. రావణాసురుడు బుద్ధి .. సాత్వికగుణం .. వీభీషణుడు ఆత్మ .. శుద్ధసాత్వికం .. ఆంజనేయస్వామి మహాశూన్యం .. నిర్గుణం .. శ్రీరాముడు
మనస్సులో వుంటే రావణాసురుడివంటివాడు. కారణశరీరంలో వుంటే విభీషణుడిలాంటివాడు. మహాకారణ శరీరంలో వుంటే ఆంజనేయస్వామి లాంటివాడు. మరి ఈ మహాశూన్యం ఉంది .. అది శ్రీరాముడు !
శరీరం సత్యమా ? .. సత్యమే ! మనస్సు సత్యమా ? .. సత్యమే ! బుద్ధి సత్యమా ? .. సత్యమే ! ఆత్మ సత్యమా ? .. సత్యమే !
మహాశూన్యం సత్యమే? .. మహాసత్యం !
“మనం ఐదు సత్యాలమయం”
మహాశూన్యం అన్నది సత్యం, ఆత్మ అన్నది సత్యం, బుద్ధి అన్నది సత్యం, మనస్సు అన్నది సత్యం, శరీరం అన్నది సత్యం. వెరసి మనం ఐదు సత్యాలమయం !
చనిపోయేటప్పుడు ఒక సత్యం వీడిపోతుంది. మిగిలిన నాలుగు సత్యాలతో కలిసి ఉంటాం. ఇంకా కొన్నిరోజులు పోయిన తర్వాత మూడు సత్యాలమయం అవుతాం. ఇంకా దూరం పోతే అది కూడా పోతుంది.
ఏకో నారాయణ! ఇక్కడ మిగులుతాం మనం, అక్కడ వుంది మన ప్రథమ మూలతత్వం! ” ఓహ్ .. ఇంతకన్నా వేరే లేదు ” అని మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాం! తిరిగొచ్చి రకరకాల శరీరాల్లో హాయిగా ప్రవేశిస్తాం! ఇక రోగాలు లేకుండా స్థూలశరీరంలో హాయిగా జీవిస్తాం ! అశాంతి లేకుండా సూక్ష్మశరీరంలో అంటే మనస్సులో హాయిగా జీవిస్తాం. ఎక్కడా అసత్యం లేకుండా కారణశరీరంలో అంటే బుద్ధిలో హాయిగా జీవిస్తాం! ఇక ఆత్మలో బంధం ఉండదు!
శరీరం నుంచి సర్వాత్మ దగ్గరకు వెళ్ళి మళ్ళీ సర్వాత్మ నుంచి శరీరానికి రావాలి. ఈ ప్రయాణం వేరే ధ్యానం, జ్ఞానం !
“సోక్రటీస్ .. విషపాత్ర”
మన మనస్సుల్లో ఎప్పుడూ ‘శాంతం’ అన్నది ఉండాలి. సోక్రటీస్‌కి విషపాత్ర ఇస్తే “ఇయ్యవోయ్” అన్నాడు! ఆయన అంతకుముందే సర్వాత్మ దగ్గరకు వెళ్ళి మళ్ళీ శరీరానికి వచ్చేశాడు! ‘నేను’ అన్నది ఒక మహాశూన్యమైనప్పుడు ఇంకొకరు ఇచ్చేదేమిటి విషపాత్ర?!
ఎవరైతే ధ్యానం చెస్తారో .. జ్ఞానం వల్ల .. జీవితంలో ముక్తి వస్తుంది. ‘ముక్తి’ అంటే మనస్సులో అశాంతి ఉండరాదు .. బుద్ధిలో అసత్యం ఉండరాదు .. ఆత్మలో బంధం ఉండరాదు!
ముక్తితో వున్నవాడికి పెళ్ళాం ఉంటుంది కానీ బంధం ఉండదు! పెళ్ళాంతో పాటు బంధం ఉంటే .. అది అమోక్షం! పెళ్ళాం ఉండీ పెళ్ళాం పట్ల బంధం లేకపోతే అది మోక్షం! శరీరం ఉండీ శరీరం పట్ల బంధం లేకపోతే అది మోక్షం! శరీరం ఉండి శరీరంపట్ల బంధం ఉంటే అది అమోక్షం! అమోక్షం నుంచి మోక్షానికి .. ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం.
“పరమాత్మ .. పరమ ఆరోగ్యం”
నేను .. ఒకప్పుడు అంటే .. ఒక 65 సంవత్సరాల క్రిందట .. ఒక చిన్నపాపడు! ఇప్పుడింత పెద్దవాడనయ్యాను. ఇక్కడున్న వాళ్ళందరూ అంతే, ఒకప్పుడు అంతా చిన్నపాపలు .. ఇప్పుడు వాళ్ళు కూడా పాపల్ని సృష్టిస్తున్నారు! అలాగే మనం ఒకప్పుడు చిన్ని శైశవ ఆత్మగా ఉండి .. ఈ ధ్యానంతో లోలోకి వెళ్ళిపోయి .. ఆత్మజ్ఞానంతో తిరిగివచ్చేసి బయట ఒక పరమాత్మగా విరాజిల్లుతాం ! బుద్ధపరమాత్మలాగా, కృష్ణపరమాత్మలాగా మరి మనం కూడా ఓ పరమాత్మ అవుతాం !
“పరమాత్మ కావడం ఆశ్చర్యకరం కాదు”
“ప్రతి ఆత్మ కూడానూ ఏదో ఒకరోజు పరమాత్మ అవుతుంది” అనటంలో ఆశ్చర్యం ఏమీ లేనే లేదు! ఓ పాప పెరిగితే సహజమా? పెరగకపోతే సహజమా ? పెరిగితేనే సహజం .. పెరగకపోతేనే అసహజం! అలాగే మనమంతా పరమాత్మలం కాకపోతేనే అసహజం మరి అయితేనే సహజం! పరమాత్మ కావడం ఆశ్చర్యకరం కాదు .. పరమాత్మ కాకపోవటమే ఆశ్చర్యం!
మనం ఆత్మజ్ఞానంతో పరమాత్ములం అయితే “గొప్పవాళ్ళం” ఏమీ కాదు! కాకపోతే .. “సరిఅయిన” వాళ్ళం! ఓ పాప పెరిగితే “గొప్పతనం” ఏమైనా వుందా? మరి ఏం చేస్తే ఈ పాపకి “గొప్పతనం” వస్తుంది ? లోకకళ్యాణంలో ఉంటే గొప్ప స్వంత కళ్యాణం జరిగితే గొప్ప కాదు కానీ మనవల్ల లోకకళ్యాణం జరిగితేనే గొప్ప!
“సుఖం .. ఆనందం”
లోకకళ్యాణ కార్యక్రమమే ఉదాత్తమైన కార్యక్రమం! మనం ధ్యానం చేసి తరించటం సహజం. ధ్యానం చెయ్యకుండా అలాగే ఉండటం అసహజం. కానీ ప్రక్కవాళ్ళకు ధ్యానం చెప్పడమే లోకోత్తర కార్యక్రమం! అప్పుడు మాత్రమే మనం గొప్పవాళ్ళం! నా కళ్యాణం నాకు ఆనందాన్నిస్తుంది. కానీ ప్రక్కావాళ్ళ కళ్యాణం చేయిస్తే నాకు మహదానందం వస్తుంది!
“సుఖం” అనే పదం చిన్నది. సుఖం శారీరకమైనది, “ఆనందం” ఆత్మపరమైనది. ఆనందం అనే పదం పెద్దది! సుఖం అనేది స్థూలశరీరానికి సంబంధించినది. ఆనందం మహాకారణశరీరానికి సంబంధించినది. రసగుల్లా తింటే .. శరీరంలో సుఖం! మంచి భజన వింటే మనస్సుకి ఉల్లాసం, సంతోషం! మంచి పుస్తకం చదివితే బుద్ధికి విజ్ఞానం, వికాసం! ధ్యానం చేస్తేనే ఆత్మకు ఆనందం ! కానీ .. ఇంకొకళ్ళకు సహాయం చెస్తే అది మహాదానందం .. ఇక ప్రపంచానికంతా సహాయం చేస్తే బ్రహ్మానందం !
శరీరవత్ .. సుఖం మనోవత్ .. ఉల్లాసం, సంతోషం బుద్ధివత్ .. విజ్ఞానం, వికాసం ఆత్మవత్ .. ఆనందం లోకకళ్యాణవత్ .. బ్రహ్మానందం
ఆత్నవత్ సుఖాన్నే ‘ఆనందం’ అంటాం! ప్రక్కవాడితో ధ్యానం చేయించడం వల్ల మహదానందం! మనకి సుఖాలూ కావాలి, సంతోషాలు కావాలి .. మరి ఆనందమూ కావాలి!
“పరిపూర్ణ జీవితం”
మనం ఇంట్లో కూర్చుని కేవలం మన సుఖం మనం చూసుకోవడం కాదు. అందరి సుఖం కూడా మనం చూసుకోవాలి. మన సుఖం మనం చూసుకొవడం అనేది కారణంతో చేసే కార్యం. కానీ అందరి సుఖానికి హేతుభూతం కావడం అనేది అకారణంతో చేసే క్రియ ! అందరూ కూడా సర్వాత్మలై పరమాత్మలు అవుదురుగాక ! ఆ స్థితికి అందరూ చేరాలంటే ధ్యానప్రచారం ప్రభొధం, ఈ రెండూ విశేషంగా అవసరం !
ఆత్మవత్ మనమందరం ఒక్కటే .. శరీరవత్ వేరు, వేరు .. మనోవత్ వేరు, వేరు .. బుద్ధివత్ వేరు, వేరు; కానీ ఆత్మవత్ మనమందరం ఒక్కటే ! శరీరవత్ నరుడు, సర్వాత్మవత్ నారాయణుడు. హనుమంతుడు ‘ చిన్ని ’ నారాయణుడు. శ్రీరాముడు ‘ పెద్ద ’ నారాయణుడు ! అందుకే అంటాడు “నేను నీ బంటును” అని ! విభీషణుడు ‘నారాయణుడు’ కాదు, రావణుడు ‘నారాయణుడు’ కాదు .. అంతా నరులే ! చనిపోయే లోపల మనం అన్నీ చూడాలి. సుఖాలు, సంతోషాలు, ఆనందాలు .. అన్నీ చూడాలి! అదే పరిపూర్ణ జీవితం!
“ధ్యానం సర్వప్రదాత”
ధ్యానం చేస్తేనే శారీరక ఆరోగ్యం వస్తుంది. ధ్యానం చేయకపోతే రాదు. ధ్యానం చేస్తేనే మానసిక శంతి వస్తుంది. ధ్యానం చేయకపోతే మానసిక శాంతి రాదు. ధ్యానం చేస్తేనే సకల గ్రంథాల అవగాహన వస్తుంది. సమాచారం ఈజీగా అర్థమైపోతుంది. పుస్తకం అర్థం అయితేనే బుద్ధిపరమైన వికాసం కలుగుతుంది. భగవద్గీత చదివితే నాకు మొత్తం అంతా అర్థమైపోయింది. నేను నా పదిహేనవ ఏట పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ” ఇండియన్ ఫిలాసఫీ ” రెండు సంపుటాలు చదివాను. చదువుతూ వుంటేనే నాకంత అర్థం అయిపోయేది ! రెండవసారి తిరిగి చదవవలసిన అవసరం వుండేది కాదు !
“చేసిందే చెయ్యం”
మనమంతా గతజన్మల నుంచి ఈ జన్మకు వచ్చాం. ఈ జన్మలో మనం గతజన్మల్లో చేసినవన్నీ చెయ్యక్కరలేదు. ఇంకేవో క్రొత్తవి క్రొత్తగా చెయ్యడానికే వచ్చాం. గతజన్మల్లో చేసినవన్నీ మనకు సహజంగానే అవగతమైపోతూ వుంటాయి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చిన్నప్పటినుంచే కచేరీలి చేశారు. మరి మనం ఎందుకు చెయ్యం? గతజన్మల్లో సంగీతం అంతా నేర్చుకున్నారు ఆయన !
ప్రహ్లాదుడికి గతజన్మల్లో ఆత్మజ్ఞానం అంతా అయిపోయింది. కృష్ణునికి ధ్యానం మొత్తం అంతా .. గతజన్మల్లో అయిపోయింది. గతజన్మల్లో అయిపోయింది మళ్ళీ మనం పునారావృతం చెయ్యం. చదివిందే చదవం ఎప్పుడూ, క్రొత్తగా ఇంకేదో చెయ్యడానికి వ్వస్తాం !
గతజన్మల్లో ధ్యాన ప్రచారం చెయ్యలేదనుకుందాం .. ఈ జన్మల్లో ధ్యాన ప్రచారం కోసం వస్తాం. ఈ జన్మ అన్నది గతజన్మల నుంచి వచ్చిన మరొక పుట. ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో … వారికి పునర్జన్మ లేదు; ” లేదు” అంటే .. ” కావాలంటే వస్తారు ” కానీ కావాలని అంతగా అనిపించదు.
ఎక్కడైతే మనం చెయ్యవలసిన పని వుండదో అక్కడికి మనం వెళ్ళం ! చెయ్యవలసిన పని ఎక్కడైతే వుంటుందో అక్కడికే మనం వెళ్తాం. అది భూలోకం కానీ, మరి ఇంకో లోకం కానీ ! చెయ్యవలసిన పని మిగిలి వుంటే తప్పకుండా దానికోసం మళ్ళీ మనం తిరిగివస్తాం. చెయ్యవలసిన పని లేకుండా వుంటే మనం ఇక్కడికి రాము. ఇంకోచోటికి వెళ్తాం !
యుక్తాహారం + మితాహారం + నిరాహారం యుక్తభాషణం + మితభాషణం + నిర్భాషణం యుక్తయోచన + మితయోచన + నిర్యోచన
శారీరక ఆరోగ్యం కోసం .. యుక్తాహారం, మితాహారం మరి నిరాహారం. అదేవిధంగా మానసికశాంతి వుండాలంటే యుక్తభాషణం, మితబాషణం, నిర్భాషణం.
బుద్ధిపరమైన ఆరోగ్యానికి .. యుక్తయోచన, మితయోచన మరి నిర్యోచన. ‘ నిర్యోచన ’ అంటే ధ్యానం కనుక ఈ ఆరోగ్యసూత్రాలను తూ చ తప్పకుండా పాటిస్తూ వుంటే మనకు మన ఆరోగ్యం మహాభాగ్యంగా పరిణమిస్తుంది.