ఆరోగ్యం స్వీయవరం
“తెరవెనుక భాగవతం”
మన సాధారణ కంటికి కనిపించే “అణువులు, పరమాణవుల యొక్క సంపూర్ణ సముదాయం” అయిన “తెరముందు ఉన్న కదులుతూన్న దేహం” గురించి తెలుసుకోవాలంటే తెరవెనుక ఆ దేహాన్ని కదిలించే ‘ఇచ్ఛాశక్తి’..‘క్రియాశక్తి’..‘జ్ఞానశక్తి’ అనబడే “ఆత్మశక్తి యొక్క తెరవెనుక భాగవతం” గురించి విశేషంగా తెలుసుకోవాలి.
ఒక ఇల్లు కట్టడం వెనుక ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలు అంటే “దాని గోడలు ఎల కట్టాలి?” .. “భూమి బలం ఎలా ఉంది?” .. “వాటికి అనుగుణంగా ఇంటి ప్లాన్ ఎలా వేయించాలి?” .. డబ్బు ఎలా సమకూర్చుకోవాలి?” .. “ఈ పనంతా పూర్తిచేయడానికి ఎంత విల్‌పవర్‌ని పెంచు కోవాలి?” .. అంటూ రకరకాలుగా ఆలోచించి, తత్సంబంధిత ఇంజనీయర్లనూ, మేస్త్రీలనూ పనివాళ్ళనూ, బ్యాంకువాళ్ళనూ కలిసి విషయసేకరణ ఎలా చేసుకుంటామో .. అలాగే మన స్వంత ఆత్మశక్తితో ఇల్లు లాంటి మన దేహాన్ని కూడా నిర్మించుకుంటాం!
దేహధారుల్లా ఈ భూమ్మీద పుట్టడానికి ముందు .. మన ఆత్మయొక్క ప్రేరణతో కూడిన ఇచ్ఛాశక్తితో .. సూక్ష్మలోకాల్లో పిండం పుడుతుంది. ఆ పిండం యొక్క సూక్ష్మశరీరం యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాల కోసం అనేకానేక మంది ప్రకృతి దేవతలు, సూక్ష్మదేవతలు, గార్డియన్ ఏంజిల్స్, నేచర్ స్పిరిట్స్ అంతా కలిసి ఒక బృందంగా తయారై తమ అకుంఠిత దీక్షతో సూక్ష్మశరీర నిర్మాణాన్ని గావిస్తారు. ఇదంతా కూడా ఆత్మ యొక్క జ్ఞానశక్తిని అనుసరించి జరుగుతూ ఉంటుంది.
భూమ్మీద మనం జీవించబోయే శరీరపు నకలు లాంటి ఈ సూక్ష్మశరీరంలో గుండె, ఊపిరితిత్తులు,లివర్, మూత్రపిండాలు, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, జీర్ణకోశవ్యవస్థ, గ్రంధుల వ్యవస్థ .. అన్నీ కూడా సూక్ష్మలోకాల్లో అత్యంత పటిష్టంగా పొందుపరచబడతాయి.
ఇలా సూక్ష్మతలాల్లో పిండం సంపూర్ణంగా తయరైన తరువాత .. భూమ్మీద స్త్రీ నుంచి విడుదల అయిన అండకణం, పురుషుని నుంచి విడుదల అయిన వీర్యకణం రెండూ కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే ఎన్నుకోబడిన ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది.
ఆ పిండం లెక్కలేనన్నీ కణవిభజనలను చెందుతూ .. క్రమక్రమంగా శరీర అంగాలను సంతరించుకుంటూ .. చక్కగా ఎదుగుతూ తల్లి గర్భం నుంచి బయటపడి సజీవమైన శిశువుగా దర్శనం ఇస్తుంది.
ఎలాగైతే ఒక దేవాలయంలో విగ్రహాలన్నీ అందంగా మలచబడ్డా కూడా .. అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగకపోతే .. ఆ దేవాలయం అన్నది పూజలకు నోచుకోదో .. అలాగే శరీరం ఎంత పటిష్టంగా తయారైనా కూడా అందులో ఆత్మ వచ్చి చేరకపోతే .. ఆ శరీరం ఎంత మాత్రం నిలువదు.
మనలాగే .. ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి నిర్మాణం వెనుక కూడా ఇలాంటి ఆర్ద్రత, ఆనందం, ఆశయం, ఆదర్శం, ఆలోచనలతో పాటు అనేకానేక మంది విశ్వసృష్టికర్తల నిర్మాణ భాగస్వామ్యం మరి అకుంఠిత దీక్ష ఉంటాయి.
“ప్రకృతి ఆత్మలు”
పుట్టి భూమ్మీద పడ్డాక కూడా మన అద్భుతమైన శరీరం ప్రతి క్షణం ప్రకృతి ఆత్మల ఆలనాపాలనలోని ఉంటుంది. ఒక పెద్ద కర్మాగారంలో వేలకువేల మంది కార్మికులు రేయింబగళ్ళు ఎలా పనిచేస్తూ ఉంటారో .. అలా మన శరీరం అనే పెద్ద కర్మాగారంలో కోటానుకోట్ల మంది ప్రకృతి ఆత్మలు నిరంతరం పని చేస్తూనే వుంటాయి.
మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని అంటే ముడిసరకును జీవశక్తిగా మార్చి ఆ శక్తిని శరీర కార్యకలాపాలకు ఇంధనంగా వాడుతూంటాయి. ఈ తతంగంలో రకరకాల ప్రకృతి ఆత్మలు ఒకానొక కర్మాగారంలోని మేనేజర్లుగా, వైబ్ కాలర్, బ్లూకాలర్ సిబ్బందిగా మరి కార్మికులుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరి ఫ్యాట్స్ అనే ముడిసరుకులను ఆక్సీకరణం చెందిస్తూ వుంటాయి. వీటిలో కొన్ని శక్తిని ఉత్పత్తి చేస్తాయి .. కొన్ని ఆ శక్తిని గ్లైకోజెన్ రూపంలో నిలువ ఉంచుతాయి .. మరి కొన్ని ఆ శక్తిని వివిధ దేహధర్మ కార్యక్రమాలకు వినియోగిస్తూ వుంటాయి.
ఇదంతా కూడా భౌతిక శరీర నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మికత! ఇలా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ శరీర ధర్మాలను నిర్వహించడానికి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది!
ప్రాపంచిక శాస్త్రజ్ఞానంతో పాటుగా మనకు ఆధ్యాత్మికశాస్త్ర విజ్ఞానం కూడా ఉంటే మనం హాయిగా, ఆనందంగా మరి ఆరోగ్యంగా ఈ జీవిత యాత్రను “చాన్నాళ్ళ ముచ్చట” గా జరుపుకుంటాం. లేకపోతే ఆధ్యాత్మిక అవగాహనా లోపంతో ఎంత చక్కగా పెంచి పోషించుకున్న భౌతిక శరీరాన్నైనా సరే చేజేతులా క్షీణింప జేసుకుని రోగగ్రస్థుల్లా మారి అర్ధాంతరంగా చావునుకొని తెచ్చుకుంటాం!
తీరా చనిపోయాక మళ్ళీ ఆత్మస్పృహ రాగానే బ్రతికి వున్నప్పుడు జరిగిన అనర్థాలన్నీ తలుచుకుని కాస్త ఏడ్చి మరో క్రొత్త శరీరం కోసం .. మరో మహాప్రణాళికతో .. మళ్ళీ ఆ లోకాల్లో ఎదురుచూస్తూ కూర్చుంటాం! కాబట్టి దేహధారుల్లా ఉన్నప్పుడే ఆత్మ స్పృహతో శాస్త్రీయంగా జీవిస్తూ .. ఆ దేహాన్ని ఒక వాహకంగా చేసుకుని ఇహం నుంచే పరంతో అనుసంధానం కావాలి!
“ఉద్ధరేదాత్మనాత్మానం”
“ఉద్ధరేదాత్మనాత్మానం” ఎవరి బాధలను వారే పోగొట్టుకోవాలి! ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి! ఎవరి శాస్త్రీయత వారే తెచ్చుకుని వారి జీవితాలను చక్కదిద్దుకోవాలి!
“శరీరపరంగా శాస్త్రీయతతో జీవించడం” అంటే .. స్వచ్ఛమైన గాలి వెలుతురు లభించే చోట .. వీలైతే చుట్టూ చక్కటి ప్రకృతి నడుమ నివాసం ఉండాలి. అప్పుడు శరీరానికి కావలసినంత ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. శుద్ధమైన చల్లటి మంచి నీటిని త్రాగాలి! భౌతిక శరీరం 80 శాతం నీటితోనే నిండి ఉంటుంది కనుక శరీరానికి మనం ఎప్పుడూ నీటిని సరఫరా చేస్తూనే ఉండాలి. అందుకే యోగులు ఎప్పుడు కమండలంలో నీటిని నింపి తమ ప్రక్కనే ఉంచుకునేవారు! పరిశుభ్రమైన నీటితోనే శరీరాన్ని శుభ్రపరచుకోవాలి.
రుచికరమైన, శుచికరమైన బలవర్ధకమైన శాకాహారాన్ని నియమిత వేళల్లో సరియైన మోతాదులో నిదానంగా నమిలి తినాలి! శరీరానికి తమోగుణాన్నీ మరి రజోగుణాన్నీ .. కలుగజేసే మద్యపానీయాలూ మరి మాంసాహారాలూ పూర్తిగా నిషేధించాలి. ఇతర జంతువులను క్రూరంగా చంపి .. వాటి మృత కళేబరాలను మన శరీరంలో పడవెయ్యడం అత్యంత హేయం! చనిపోయిన జంతువుల శరీరపు మృతధాతువులు మన శరీర మనుగడకు ఎంత మాత్రం సరిపడవు. మాంసాహర సేవనం వల్ల శరీరం తొందరగా రోగగ్రస్థం అవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యత్వంతో విలసిల్ల వలసిన మనం మాంసాహారం తినడం వంటి రాక్షసకృత్యాలకు పాల్పడడం ఎంత మాత్రం తగదు!
భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు “యుక్తాహారస్య” అంటూ సెలవిచ్చారు. అంటే ఏదైతే మనకూ మరి ఇతరులకూ హాని కలిగించదో అలాంటి పవిత్రమైన శుద్ధ శాకాహారమే యుక్తాహారం! శాకాహారాన్ని కూడా ఎంత తినాలో తింటే అది యుక్తాహారం! ఎప్పుడు తినాలో అప్పుడే తింటే అది .. యుక్తాహారం! ఎలా తినాలో అలా తింటే .. అది యుక్తాహారం! ఇలా యుక్తాహారం అంటే అనేకానేక విధాల నిర్వచనాలు వున్నాయి.
చాలా మంది ఉత్తేజం కోసమో మరి స్టైల్ కోసమో సిగరెట్లు, మద్యం త్రాగుతూంటారు. “‘రోజుకు రెండు పెగ్గులు త్రాగితే ఫరవాలేదు’ అని మా డాక్టర్ చెప్పాడు” అని కూడా సమర్ధించుకుంటారు. డాక్టర్ దేం పోయింది కానీ పొగత్రాగడం మద్యం సేవించడం వంటి అలవాట్లు వలన మన దేహవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది! అలాంటి చర్యలను మన ప్రకృతి దేవతలు ఎంత మాత్రం ఒప్పుకోరు!
ఆర్గానిక్ బాడీలో ఇనార్గానిక్ పదార్థాలు ఇమడవు సరికదా .. క్రమంగా ఒక్కొక్క అవయవం రోగగ్రస్థం కావడం మొదలవుతుంది.
చాలా మంది ఆహార పదార్థాలను వారానికి ఒక్కసారే వండి ఫ్రిజ్‌లో ఉంచుకుని .. రోజూ వాటినే మైక్రోవేవ్‌లో వేడి చేసుకుని తింటూంటారు. అలా పాచిపోయిన ఆహార పదార్థాలు శరీరంలో తమోగుణాన్ని పెంచడంతో పాటు మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల విడుదలయిన కొన్ని హానికారక విద్యుదయస్కాంత తరంగాలు ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి .. భయంకరమైన జబ్బులకు దారితీస్తాయి.
ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను కడిగి .. చక్కగా కోసుకుని వండి వేడి వేడిగా తినాలి. ఎక్కువ కారాలూ, ఉప్పులూ మరి మసాలాలూ వేయకుండా .. నేచురల్‌గా తినడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్యసూత్రాలు.
శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి. వీలైనంతగా నడక సాగించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు లేకుండా దగ్గరలో వున్న పర్వతాలూ, కొండలూ ఎక్కుతూ, అడవుల్లో ట్రెక్కింగులు చేస్తూంటే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తుంది. శరీరాన్ని బాగా రుద్ది నీళ్ళతో తడిపి స్నానం చెయ్యాలి. వారానికి ఒక్కసారైనా స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టడమో లేదా నీళ్ళతొట్టిలో శరీరాన్ని వుంచడమో చేస్తూండాలి.
“యద్భావం తద్భవతి”
చాలా మంది “నాకు అరవై యేళ్ళు ముసలితనం వచ్చేసింది ; నాకు వయస్సు మించిపోతూంది” అంటూ అదేదో గొప్ప విషయంలా పదే పదే చెప్పుకుంటూంటారు. “ముసలి తనం” అన్నది మనకు సహజంగా వస్తూనే వుంటుంది! కానీ “యద్భావం తద్భవతి” అన్నట్లుగా ముసలితనం గురించిన మన అప్రయోజనకరమైన ఆలోచనల వల్లే అసహజమైన ముసలితనంతో పాటు .. అనవసర రోగాలన్నీ తొందరగా వచ్చి చేరతాయి! దేహానికి బాల్యం, యవ్వనం ; ప్రౌఢత్వం మరి వృద్ధాప్యం అన్నవి ప్రకృతి సహజమైన దశలు కనుక వాటిని హుందాగా ధైర్యంగా, ధీటుగా అనుభవిస్తూ వుండాలి!
దేహానికి ఎంత మేరకు అవసరమో అంతమేరకు, విశ్రాంతిని కూడా ఇస్తూండాలి! తగినంత విశ్రాంతి లభించినప్పడే ఆ దేహంలో వున్న ప్రకృతి ఆత్మలు కూడా ఒకింత సేదదీరుతూ తమ పనితీరును మరింత మెరుగు పరచుకుంటూంటాయి.
“ఆత్మవిజ్ఞానశాస్త్రం”
ఒక ఇంట్లో మనం వున్నామంటే ఆ ఇల్లే ‘మనం’ కాదు! అలాగే ఈ దేహంలో వున్న ఆత్మస్వరూపులమైన మనం కూడా దేహాలం ఎంతమాత్రం కాదు! కాకపోతే ఈ దేహాన్ని పరిరక్షించుకోవడం మాత్రం డాక్టర్ల చేతుల్లో కాకుండా మన చేతుల్లోనే వుంటుంది! ఇదంతా కూడా ఆత్మవిజ్ఞానశాస్త్రం! “ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో” అన్న ఆత్మవిజ్ఞానం మనకు ధ్యానం ద్వారానే తెలుస్తుంది!
ఆత్మవిజ్ఞానశాస్త్రం గురించి తెలియని వారు .. “వైరస్‌లూ, బ్యాక్టీరియాలు మాత్రమే రోగాలకు కారణం” అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చుచేస్తూ ఇళ్ళూ వాకిళ్ళూ గుల్ల చేసుకుంటూంటారు.
ధ్యానం ద్వారా మనకు సంక్రమించే అణిమ మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ అన్న అష్టవిధాన జ్ఞాన సిద్ధులే మనకు అష్టైశ్వర్యాలు! ఈ జ్ఞాన సిద్ధులను పొందిన తరువాతే మనకు భౌతిక పరమైన సంపదలను ఎరుకతో అనుభవించే అర్హత లభిస్తుంది.
ఈ ప్రపంచంలో ఎవ్వరైనా కూడా జీవించినంత కాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే వారికి శ్రేష్టమైన శాకాహారం, చక్కటి వ్యాయామం మరి ఇతోధికంగా ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం తప్పనిసరి! ఇదంతా వెరసి యోగత్వపు జీవితం! అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడి “తస్మాత్! యోగీభవార్జున” అంటే “ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే యోగివి కా అర్జునా” అని ఆదేశించాడు!
చిన్నచిన్న పాపాలు చిన్నిచిన్ని రోగాలను కలుగజేస్తే పెద్ద పెద్ద పాపాలు పెద్దపెద్ద రోగాలను కలుగజేస్తాయి. కనుక ధ్యానం ద్వారా మనం పొందే విశ్వశక్తితో, ఆత్మజ్ఞానంతో ఆ పాపకర్మలను దగ్ధం చేసుకోవాలి. మన శరీరంలోని ప్రతి ఒక్కకణాన్ని విశ్వశక్తితో నింపుకోవాలి. ప్రతిక్షణం విశ్వశక్తి పరిపుష్టితో కాంతి స్వరూపుల్లా విలసిల్లాలి!