అరచేతిలో వైకుంఠం

 

మన చేతికి అయిదు వ్రేళ్ళున్నాయి. ఇందులో చిటికెన వ్రేలు ‘శరీరం’ .. ఉంగరం వ్రేలు ‘మనస్సు’ .. మధ్య వ్రేలు ‘బుద్ధి’ .. చూపుడు వ్రేలు ‘శ్వాస’ .. మరి బొటన వ్రేలు శుద్ధ చైతన్య స్వరూపం అయిన ‘నేను’.

శరీరం మనకు తల్లితండ్రులు నుంచి వస్తుంది; మనస్సు సమాజం నుంచి వస్తుంది; బుద్ధి పూర్వజన్మ కర్మ సంస్కారాల నుంచి వస్తుంది; మరి శ్వాస మనకు ప్రకృతి నుంచి ప్రసాదింపబడుతుంది. వీటన్నింటికీ అతీతమైన నేను .. నాలుగు వ్రేళ్ళకు కొంచెం ఎడంగా బొటన వ్రేలు రూపంలో ఒక సాక్షీభూతురాలిగా ఉంటుంది.

తల్లితండ్రుల నుంచి వచ్చిన ఈ శరీరం మనకు మన తల్లితండ్రుల యొక్క వారసత్వపు రూపలక్షణాలను అందిస్తుంది. తెల్లగా ఉన్నామా? .. నల్లగా ఉన్నామా? .. పొడువుగా ఉన్నామా? .. పొట్టిగా వున్నామా? .. అందవికారంగా ఉన్నామా మరి అందంగా ఉన్నామా? .. అన్న రూపలక్షణాలను శరీరం మనకు ప్రసాదిస్తుంది.

మనస్సు మనకు సమాజం నుంచి వస్తుంది కనుక మనం మన చుట్టూ ఉన్న సమాజానికి దర్పణంలా ఉంటాం. హిందూ సమాజంలో పుడితే మనకు హిందూ మనస్సు .. ముస్లిం సమాజంలో పుడితే మనకు ముస్లిం మనస్సు .. నాస్తిక కమ్యూనిస్ట్ సమాజంలో పుడితే నాస్తిక మనస్సు .. తీవ్రవాద సమాజంలో పుడితే తీవ్రవాదంతో కూడుకున్న మనస్సు .. ఒక బుద్ధ సమాజంలో పుడితే బుద్ధుడి లాంటి మనస్సు .. మరి ఒకానొక పిరమిడ్ మాస్టర్ల సమాజంలో పుడితే పిరమిడ్ ఫిలాసఫీతో కూడిన మనస్సు మనకు వస్తుంది.

బుద్ధి మనకు కర్మానుసారిణిగా వస్తుంది. మనం తీసుకున్న అనేకానేక జన్మలలో చేసిన కర్మల సంచయాన్ని అనుసరించి మన బుద్ధి రూపుదిద్దుకుంటుంది.

శ్వాస మనకు విశ్వమయప్రాణశక్తి రూపంలో ప్రకృతి నుంచి వస్తుంది. ధ్యానంలో బొటనవ్రేలు అయిన “నేను”ను చూపుడు వ్రేలు అయిన శ్వాసతో ఏకం చేసినప్పుడు .. చిటికెన వ్రేలులాంటి శరీరం అంతా కూడా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయి ఆరోగ్యవంతం అవుతుంది .. ఉంగరపు వ్రేలు లాంటి మనస్సు హాయిగా మారి మధ్యవ్రేలు లాంటి బుద్ధి ప్రకాశవంతం అవుతుంది. వెరసి జీవితమంతా ఆనందప్రదమైన వైకుంఠంలా మారిపోతుంది!

“నా రోగం నా వల్లనే వచ్చింది .. అది మళ్ళీ నా వల్లనే బాగవుతంది కనుక నా ధ్యానంలో నన్ను నేనే స్వస్థత పరచుకోవాలి; నా మనస్సు నా వల్లనే కలత చెందింది కనుక ధ్యానంలో నా మనస్సును నేనే శూన్యపరచుకుని దానిని హాయిగా మలచుకోవాలి; బుద్ధి నా వల్లనే మసకబారిపోయింది. కనుక మళ్ళీ నా ధ్యానంలో వచ్చే విశ్వమయప్రాణశక్తితో నా బుద్ధిని నేనే ప్రకాశవంతం చేసుకోవాలి; అందుకుగాను నేను నిరంతరం నా శ్వాస ప్రకృతితో మమేకమైవుండాలి” అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.

పరిణామక్రమంలో ఆత్మ మొట్టమొదటిస్థాయి అయిన శైశవదశలో ఉండి అతి తక్కువ జన్మలకు సంబంధించిన అనుభవ జ్ఞానంతో జీవిస్తూ ఉంటుంది. ఆ తరువాత ఇంకొన్ని జన్మలు ఆడగా, మగగా రకరకాల పాత్రలను ధరిస్తూ అనుభవజ్ఞానంతో ఇంకాస్త పైస్థాయికి చేరి బాలాత్మగా జన్మ తీసుకుంటుంది. క్రమంగా సమాజంలోని ఇతర రకరకాల పాత్రలను ధరించి రకరకాల జన్మలు తీసుకుంటూ మరింత అనుభవజ్ఞానాన్ని గ్రహించి యువాత్మగా మరి ప్రౌఢాత్మగా ఎదుగుతూ విముక్తాత్మ నుంచి అనుభవజ్ఞానంతో పండిపోయిన పరమాత్మగా ఎదుగుతుంది.

అందుకే కౌరవులు, పాండవులు మరి శ్రీకృష్ణుడు .. అందరూ కూడా ఒకే సమయంలో ఒకే ఇంట్లో పుట్టారు. కానీ వారి వారి జన్మకర్మలను బట్టి వచ్చిన వారు రకరకాల ఆత్మస్థాయిల వల్ల మహాభారతంలో తమ తమ వివిధ పాత్రలను పోషించారు. ఇలా ప్రతి ఒక్క ఆత్మ నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది. ధ్యానం వలన ఆ ఎదుగుదల మరింత వేగవంతం అవుతూ ఉంటుంది!