అపసవ్యం నుంచి సవ్యం వైపుకు
“సత్యం” అన్నది దేశ కాల పరిస్థితులకు అతీతమైనది
జీవితంలో ప్రప్రధమంగా పరిశోధించవలసినదే సత్యం
జీవితంలో ప్రప్రధమంగా తెలుసుకోవలసినదే సత్యం
జీవితంలో ప్రప్రధమంగా కూలంకషంగా గ్రహించవలసినదే సత్యం
“అహం ఆత్మా” అన్నదే “సత్యం”
“మమాత్మా సర్వభూతాత్మా” అన్నదే “పరమ సత్యం”
“ధర్మం” అంటే అది విధిగా ఆచరించవలసింది
ధర్మం అంటే అది తప్పనిసరిగా అనుసరించవలసింది
ధర్మం అన్నది సదా సత్యం మీదే ఆధారపడి వుంటుంది
సత్యం తెలుసుకున్న తరువాతే మరి ధర్మం అవగతం అవుతుంది
ఒకవైపు సత్యం పట్ల .. మరొక వైపు దేశ కాల పరిస్థితుల పట్ల మొగ్గు చూపుతూ
“మధ్యేమార్గం” లో వుండేదే “ధర్మం”
“సవ్యం” అంటే “సరియైనది “
“అపసవ్యం” అంటే “సరికానిది”
“సత్య-ధర్మాలు” తెలియకపోతే జీవితం “అపసవ్యం” గా ఉంటూ
క్రింద మీద అవుతూ సుడిగుండంలా వుంటుంది
సత్య- ధర్మాలు కూలంకషంగా తెలియడం ద్వారా
జీవితం ప్రశాంత సరోవరం లాగా “సవ్యం” అయినప్పుడు ..
ఏది తినాలో అదే తింటాం .. ఏది తినకూడదో దానిని వదిలి పెడతాం
ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతాం .. ఏది మాట్లాడకూడదో అది మాట్లాడం
ఎలా జీవించాలో అలానే జీవిస్తాం .. ఎలా జీవించకూడదో అలా ఇక జీవించం
సత్యజాగృతి, ధర్మావగాహనల ద్వారా
సరికాని ఆలోచనలన్నీ సరియైన ఆలోచనలుగా మార్పు చెందుతాయి
సరికాని మాటలన్నీ సరియైన మాటలుగా మార్పు చెందుతాయి
సరికాని తిండివిధానాలన్నీ సరియైన తిండివిధానాలుగా మార్పు చెందుతాయి
వెరసి మనలోని అపసవ్యాలన్నీ క్రమక్రమంగా సవ్యాలుగా మారిపోతాయి
“అంతా సవ్యం” గా మారిపోయిన జీవితమే “దివ్యం”
సత్యం, ధర్మం తెలుసుకుని ధర్మాచరణ ద్వారా జీవితం అంతా సవ్యం అయినప్పుడు ..
ఆ జీవితం “దివ్యజీవితం”
ఆ జీవుడు “దివ్యుడు”
జీవితం దివ్యమైనప్పుడు పరంపరగా జీవితం “భవ్యం” అవుతుంది
అంటే
అప్పుడే సకల సుఖశాంతులు, ఆరోగ్య, ఐశ్వర్యాలు పుష్కలంగా సమకూరుతాయి
అపుడు ఎటుచూసినా మిత్రులే వుంటారు
ప్రతి ఒక్క ప్రాణి కూడా మన మిత్రబృందంలో సంతోషంగా చేరుతుంది
అన్ని వైపులనుంచీ ధారాపాతంగా మిత్రలాభాలు
సదావర్షిస్తూనే వుంటాయి
అదీ “భవ్య జీవితం” అంటే !
“సవ్యం” “దివ్యం” కాని జీవితం ..
“భవ్యం” ఎన్నిటికీ కాజాలదు
“సత్యం” ధర్మం ” తెలియని జీవితం ..
“సవ్యం” ఎన్నటికీ కాజాలదు
సత్యం శరణం గచ్ఛామి! ధర్మం శరణం గచ్ఛామి!
సవ్యం శరణం గచ్ఛామి! దివ్యం శరణం గచ్ఛామి!
భవ్యం శరణం గచ్ఛామి!