అందరికోసం చేసే ప్రార్థనయే .. సరియైన ప్రార్థన

 

“సబ్ కో సన్మతి దే భగవాన్” అంటూ మహాత్మాగాంధీగారు మన అందరి మంచి కోసం భగవంతుడిని ప్రార్థించారు. సాధారణంగా మనం గుడికో, మసీదుకో, లేదా చర్చ్‌కో వెళ్ళి “నేను బికారిని .. నేను పాపాత్ముడను .. దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు” అంటూ దీనంగా అర్థిస్తూంటాము.

“దేవుడా! నాకు పెళ్ళాన్ని ఇవ్వు, నాకు మొగుడిని ఇవ్వు, దేవుడా! నాకు పిల్లలను ఇవ్వు, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వు, నేను చేసే వ్యాపారంలో నాకు లాభాలను ఇవ్వు” అంటూ ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం ఏదో ఒకటి అడుక్కుంటూనే ఉంటాం. కానీ మహాత్మాగాంధీజి మాత్రం “సబ్ కో సన్మతి దే భగవాన్” అంటూ అందరికోసం చక్కటి ప్రార్థన చేశారు.

మనకోసం మన స్వీయ ‘సాధన’ చెయ్యాలి .. మరి ప్రక్కవాళ్ళ ప్రయోజనాల కోసం మనం ‘ప్రార్థన’ చెయ్యాలి. ఇది గొప్ప ఆధ్యాత్మిక రహస్యం!

మన కోసం, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం ధ్యానసాధన చెయ్యాలే కానీ ప్రార్థన చేస్తే అది ఎంతమాత్రం ఫలితాన్ని ఇవ్వదు. ప్రక్కవాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అందరికీ సౌభాగ్యం కావాలి. అందరికీ శాంతి కావాలి, “అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ మోక్షం కావాలి .. మరి దానికి అందరికీ ‘సన్మతి’ రావాలి” అని ప్రార్ధన చెయ్యాలి. అందులోనే మనందరి సుఖం, సంతోషం, ఆనందం అన్నీ ఉన్నాయి. లోకా సమస్తా సుఖినోభవంతు!!

గాంధీజీ .. అందరికీ అదీ, ఇదీ కావాలని .. ఎవేవో ప్రాపంచికమైన కోరికలు కోరుతూ ప్రార్థన చెయ్యలేదు. అందరికీ “సన్మతి” ని అంటే “సరియైన మతి”ని అనుగ్రహించమని ప్రార్థన చేశారు. సరియైన మతి ఉన్నవాళ్ళంతా కూడా సరియైన విధంగా జీవిస్తారు! కనుక గాంధీజీ చేసిందే సరియైన ప్రార్థన. “నేను” .. “నాది” అన్న వ్యక్తిగత అస్తిత్వాలను మరచిపోయి ప్రాపంచికంలోంచి నిష్క్రమించి .. అందరికోసం జీవిస్తూ అందరి సౌభాగ్యం కోసం ప్రార్థించడమే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం!

ఇలా ప్రక్కవాళ్ళకోసం మనం ఏది ప్రార్థిస్తే అది వాళ్ళతోపాటు మనకు కూడా వస్తుంది. ప్రక్కవారి సుఖంకోసం ప్రార్థిస్తే మనకు సుఖం వస్తుంది .. మరి ప్రక్కవారి జ్ఞానం కోసం ప్రార్థిస్తే మనకు జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఎవరు తమను తాను మరచి పోయి ప్రక్కవాళ్ళకోసం ఆలోచిస్తారో, ప్రార్థిస్తారో, మరి తపస్సు చేస్తారో అలాంటి వారికి భగవంతుళ్ళు తప్పక ప్రత్యక్షం అవుతారు. “ఆ భగవంతుళ్ళు ఎవరయ్యా?” అంటే .. మనకన్నా జ్ఞానపూర్వకంగా ఎక్కువ స్థాయిలో ఉన్నవారు.

ఇలా మనకంటే ఎక్కువస్థాయి జ్ఞానాన్ని కలిగి ఉన్న భగవంతుళ్ళు మనం చేసే పనులను పై నుంచి ఒక సినిమాలా చూస్తూంటారు. “వీళ్ళు .. వీళ్ళ కోసం కోరుకుంటున్నారా? లేక ప్రక్కవాళ్ళకోసం కోరుకుంటున్నారా?” అని పరిశీలనగా చూస్తూ అందరికోసం ఏది కోరినా వెంటనే గ్రాంట్ చేసేస్తూంటారు.

ఒకసారి .. ఒకానొక విందులో .. భోజనాల బల్లమీద పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన నోరూరించే వంటకాలను వడ్డించారు. ఆకలితో ఉన్న కొందరు ప్రాపంచికవేత్తలను ఆ బల్లమీద ఎదురెదురు కుర్చీల్లో కూర్చోబెట్టి తినడానికి వారి చేతులకు పొడుగాటి చెంచాలను ఇచ్చారు. కొంచెంకూడా వంగడానికి వీలులేని ఆ చెంచాలతో భోజన పదార్థాలను ఎలా తమ నోటిలోకి అందించుకోవాలో తెలియక .. ఒక్క మెతుకు కూడా తినలేని వాళ్ళంతా కూడా బిక్కమొఖాలు వేశారు!

వాళ్ళను లేపి అదే భోజనం బల్లమీద ఆధ్యాత్మికవేత్తల బ్యాచ్‌ను ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చోబెట్టి .. వారి చేతులకు కూడా అవే పొడుగాటి స్పూన్‌లను ఇచ్చారు. వాళ్ళు తమతమ స్పూన్‌లతో ఎదురుగా ఉన్న మరొకరికి పరస్పరం తినిపించుకుంటూ భోజనపదార్థాలనన్నింటినీ కడుపు నిండా భుజించారు!

మరొకసారి ఒకానొక పెద్దమనిషి పరమశివుడి గురించి కొన్నేళ్ళపాటు బాగా తపస్సు చేశాడు. అతడి ఘోర తపస్సుకు మెచ్చి .. శివుడు ప్రత్యక్షమై “నాయనా! ఏమిటి నీ కోరిక?” అని అడిగాడు. “స్వామీ! నా ప్రక్కింటి వాడికి ఒక కన్ను పోవాలి” అన్నాడువాడు. “తథాస్తు” అన్నాడు శివుడు. ఇక వెంటనే పై లోకాల్లోకి ఆకాశిక్ రికార్డులోని అతని కర్మచిట్టాలో “భవిష్యత్తులో ఇతనికి రెండు కళ్ళూ పోవాలి” అని కర్మఫలితం నమోదయిపోయింది.

అలా ప్రతిక్షణం మనం చేస్తున్న ఆలోచనలు కానీ, మనం చేస్తున్న చేష్టలు కానీ, మనం మాట్లాడుతూన్న మాటలు మన ఆకాశిక్ రికార్డుల్లో నమోదు అవుతూనే ఉంటాయి. ఇలా మనం చేసే ప్రతి ఒక్క చేష్టా ప్రతిక్షణం .. కర్మ చిట్టాలో నమోదు అవుతున్నప్పుడు మరి మనం జంతువులను చంపి వాటి మాంసాన్ని వండి తినే దుర్మార్గపు చేష్టలు ఆకాశిక్ రికార్డుల్లో ఎలాంటి కర్మఫలితాలను నమోదు చేస్తాయో!జంతువులను హాని కలిగిస్తే తిరిగి మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో!

ఏ ఒక్క కర్మఫలితాన్నుంచి కూడా ఏ ఒక్కరు కూడా తప్పించుకుని పోలేరు! ఇప్పుడే .. ఇక్కడే ఈ భూమిమీదే మళ్ళీ, మళ్ళీ అన్నీ అనుభవించి తీరవలసిందే! అందుకే గాంధీజీలా మనం కూడా అందరూ ధ్యానం నేర్చుకోవాలనీ, అందరూ శాకాహారులు కావాలనీ, అందరూ పిరమిడ్‌లు నిర్మించుకోవాలనీ, అందరూ ఆనందంగా జీవించాలనీ మనకన్నా జ్ఞానంలో పైస్థాయి వాళ్ళను ప్రార్థిద్దాం!