“ఆళ్ళగడ్డ – కర్నూలు జిల్లాలో పత్రీజీ సందేశం”

 

“ప్రపంచం అంతా తిరుగుతూ నేను ‘నా ప్రపంచాన్ని’ బాగు చేసుకుంటున్నాను. మీ ప్రపంచం మీ ఆళ్ళగడ్డ. మీ ఆళ్ళగడ్డ దేవుడు ‘శ్రీ రామకృష్ణుడు గారు’ పిరమిడ్ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలాన్ని ఇస్తున్నారు. ప్రతి ఊరికీ ఒక దేవుడు ఉండాలి. బ్రహ్మయ్యగారు, రామకృష్ణుడు గారు మీ ఊరి దేవుళ్ళు.”

“నేను ప్రపంచానికి దేవుడిని. మీ ఊరుని, మీ శరీరాన్ని మీరే బాగుచేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.. పిరమిడ్ ధ్యానం ద్వారా మరి శాకాహారం ద్వారా! గంటలు గంటలు ధ్యానంచేసి ఆ ధ్యానశక్తితో నాడీమండలం శుభ్రం చేసుకోవాలి. మీకు మీరు మిత్రులు కావాలి గానీ మీకు మీరు శత్రువులు కాకూడదు. మాంసం తింటూ .. ధ్యానం చేయకపోతే మీకు మీరే శత్రువులు. అలా కాకుండా శాకాహారం స్వీకరిస్తూ .. ధ్యానం చేసుకుంటే మీకు మీరు మిత్రులు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచెప్పాలి.”

“మానవుడు పక్షిజాతినీ, మత్స్యజాతినీ, జంతుజాతినీ పొట్టన పెట్టుకుంటున్నారు. నెత్తిన పెట్టుకోవాల్సిన వాటిని పొట్టన పెట్టుకుంటున్నాడు. మత్స్యావతారం అంటే విష్ణుమూర్తి! విష్ణువుని పూజిస్తూ చేపను తింటున్నాడు మానవుడు .. ఇది ఏమి భక్తో!”

“మై డియర్ ఫ్రెండ్స్ .. మై డియర్ మాస్టర్స్&మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆళ్ళగడ్డ .. రాయలసీమ అంటే రారాజుల సీమ. ఆత్మ రారాజుల సీమ. ఆత్మరాజులు అంటే ఎలా ఉంటారు? .. ‘శ్రీ కాశిరెడ్డి నాయన’లా ఉంటారు. వారికి నా “శత సహస్ర వందనాలు”. “కర్నూలులో ‘శ్రీ బుద్ధా పిరమిడ్’ నిర్మాణం జరుగుతూన్న రోజులలో శ్రీ కాశిరెడ్డి నాయన అప్పుడప్పుడు వచ్చేవారు. వారు వచ్చి ఆయన జేబులోని చిల్లర అంతా పిరమిడ్ నిర్మాణానికి ఇచ్చేవారు!”

“1991వ సం||లో ప్రారంభం అయ్యింది ఒక మహా విప్లవం .. ఆ విప్లవం పేరే ‘పిరమిడ్ ధ్యాన విప్లవం’ అదే శ్వాస ధ్యానం .. అదే ఆత్మ ధ్యానం .. అదే శాకాహార ధ్యానం .. మహా విప్లవానికి నాంది 1991వ సం||లో భారతదేశంలో .. ఆంధ్రరాష్ట్రంలో .. కర్నూలు జిల్లాలో కర్నూలులో!”

“అప్పటినుంచి నేను తిరగని గ్రామం లేదు; తిరగని పట్టణం లేదు. నిజంగా రాయలసీమ ఆత్మ రారాజుల సీమ అయ్యింది. ఒకప్పుడు నేను ఒక్కడినే. ఇప్పుడు ఈ ఆళ్ళగడ్డలోనే 2,000 మంది తిరిగారు!”

“శ్రీ బ్రహ్మయ్య గారు ఒక్కడే నిలబడి ఇంతమందిని తయారుచేశారు. ఈ రోజు మనకు తోడుగా నిలబడి పిరమిడ్ కోసం స్థలం ఇచ్చారు. మనం మంచి వాళ్ళం అయితే తోటి మంచివాళ్ళు ఊరికే ఉండరు. మన దగ్గరకు వచ్చి మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళతారు.”

“శ్రీ రామకృష్ణుడుగారు స్థలం ఇచ్చారు. ఇక మనం అందరం ఆ పిరమిడ్ నిర్మాణానికి కృషి చేయాలి. ఆ పిరమిడ్ పేరు ‘శ్రీ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్’. కాశిరెడ్డి నాయన మన రాయలసీమ దేవుడు. ఆయన పేరు మీద ఒక మెగా పిరమిడ్‌ను ఆళ్ళగడ్డలో నిర్మించి రాయలసీమ వాసులకు కానుకగా ఇద్దాం. ఆయన పేరుతో ఆళ్ళగడ్డలో పిరమిడ్ రావాలి వచ్చి తీరాలి. అందరూ ఈ మెగా పిరమిడ్‌కి చేయూత ఇవ్వాలి. ఇది నా కల; నా కల నెరవేరి తీరుతుంది.”

“మిత్రులారా! నిన్ననో, మొన్ననో ఈ భూమి మీదకు వచ్చాం .. రేపో, ఎల్లుండో పైకి వెళ్ళిపోతాం. అక్కడకు వెళ్ళిన తరువాత అక్కడి వాళ్ళు ‘భూమి మీదకు వెళ్ళి ఏం చేశావు?’ అని అడుగుతారు అప్పుడు ‘నేను ఒక గొప్ప పిరమిడ్ నిర్మించాను’ అని గర్వంగా చెప్పుకోగలగాలి.”

“ఈ రోజు మనం ఒక క్రొత్త జ్ఞానాన్ని తెలుసుకుందాం; ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు .. వీటి గురించి తెలుసుకుందాం.”

ఒకటి నోరు ప్రైమెరీ స్కూల్

రెండు నాసిక మిడిల్ స్కూల్

మూడు నాసికాగ్రం, భ్రూమధ్యం హైస్కూల్

నాలుగు నుదురుభాగం కాలేజీ

ఐదు సహస్రారం యూనివర్సిటీ

“మన ఎదుగుదల ప్రైమెరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు వెళ్ళాలి. ప్రైమెరీ స్కూల్‌లో సిలబస్ పూర్తిచేస్తే మిడిల్ స్కూల్, మిడిల్ స్కూల్‌లో సిలబస్ పూర్తిచేస్తే హైస్కూల్; హైస్కూల్‌లో సిలబస్ పూర్తిచేస్తే కాలేజీ; కాలేజీ సిలబస్ పూర్తిచేస్తే యూనివర్సిటీ.”

“మొదటిది ప్రైమెరీ స్కూల్: ఇక్కడి సిలబస్‌లో ఆరు అంశాలు ఉంటాయి. 1. యుక్తాహారం, 2. మితాహారం, 3. నిరాహారం, 4. యుక్త భాషణం, 5. మిత భాషణం, 6. నిర్ భాషణం”

* యుక్తాహారం అంటే “శాకాహారం-సాత్త్వికాహారం”

* మితాహారం అంటే “మితంగా ఆకలి ఉన్నంత వరకే తినాలి”

* నిరాహారం అంటే “అప్పుడప్పుడు ఉపవాసం”

* యుక్తభాషణం అంటే “సరియైనది/వాస్తవమైనది అయితేనే మాట్లాడాలి”

* మిత భాషణం అంటే “క్లుప్తంగా, స్పష్టంగా మాట్లాడాలి”

* నిర్ భాషణం అంటే “మౌనం” యుక్తాహారం – మితాహారం – నిరాహారం చేస్తే ‘తపస్వి’ ..

“మొదటిది ప్రైమెరీ స్కూలు”: యుక్తభాషణం – మితభాషణం – నిర్‌భాషణం చేస్తే ‘ముని’ .. అని ప్రైమెరీ స్కూలులో రెండు డిగ్రీలు ఉన్నాయి. 

“రెండవది మిడిల్ స్కూలు”: ఇక్కడే శ్వాస ఉంది. ఇక్కడ మన సిలబస్ శ్వాస మీద ధ్యాస; మరింత, మరింతగా శ్వాసను గమనించి ధ్యానం చేసి యోగి అవుదాం. మిడిల్ స్కూల్ సిలబస్ – ‘యోగి’

“మూడవది హైస్కూలు”: దివ్యచక్షువు .. ‘ఋషి’ హైస్కూలు సిలబస్, మూడవకన్ను తెరుచుకోవడం విశేషం. మూడవ కన్ను ద్వారా ఇంకా ముందుకు దూసుకు వెళ్ళి ముఖ్యమైన గత జన్మలన్నీ చూసుకోవడం. 

“నాల్గవదీ కాలేజీ”: కాలేజీలో సిలబస్ తాను ‘తపస్వి’ ఎలా అయ్యిందీ; ప్రైమరీలో ‘ముని’ ఎలా అయ్యిందీ; మిడిల్ స్కూల్లో ‘యోగి’ ఎలా అయ్యిందీ; హైస్కూల్లో ‘ఋషి’ ఎలా అయ్యిందీ; కాలేజీలో నేర్చుకున్నదీ తన దగ్గరకు వచ్చిన వారికి నేర్పించడం అదే ‘బోధిసత్వుడు’ స్థితి.

ఇకపోతే”ఐదవది అత్యున్నత స్థితి”: .. ఊరు ఊరు తిరిగి చెప్పడం ‘బుద్ధత్వం’.

తపస్వి – బహిరేంద్రియ జయం; వివేకయుత భోజనం ముని – మౌనం; వివేకయుత వాక్‌క్షేత్రం యోగి/ఋషి – అంతరేంద్రియ జయం/ ధ్యానం – దివ్యచక్షువు బోధిసత్వుడు – తన దగ్గరికి వచ్చిన వారికి తెలిసినది బోధించడం బుద్ధుడు – “ఇల్లు వదిలి ఊరు ఊరూ తిరుగుతూ తెలిసినది అంతా అంతా చెప్పేవాడు”

ఇలా అద్భుత ప్రవచనాన్ని అందించి అందరిచేత విశేషంగా ధ్యాన అభ్యాసం చేయించారు.