అధర్మం – ధర్మం – సత్యం

 

“0 – 50 – 100”

మనం అధర్మంలో జీవిస్తే మన యొక్క మార్కులు “సున్న” 
“అధర్మంలో జీవించటం” అంటే “ హింసలో జీవించటం”
అంటే తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఘాతక హింసలకు పాల్పడడం
అంటే ,ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపి వాటి మాంసాన్ని వండుకుని తినటం అంటే , కక్ష కోసం మనుష్యులను చంపటం 
అంటే, భరించలేని దైన్య పరిస్థితులలో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య కు పాల్పడడం
అయితే, ఎలాంటి పరిస్థితులలో అయినా సరే ..
ఆత్మహత్య చేసుకోవటం అన్నది మాత్రం పూర్ణంగా అధర్మయుతమైన చర్య.
శాకాహారి కాకపోయినప్పుడు, హింసావాది అయినప్పుడు 
ఎంతటి ప్రాపంచిక పండితుడికి అయినా సరే వచ్చే మార్కులు “సున్న”
అధర్మంలో జీవిస్తే మనకు వచ్చే మార్కులు “ సున్న” ..
ధర్మంతో జీవిస్తే మనకు వచ్చే మార్కులు “యాభై” .. 
“ధర్మంలో జీవించటం” అంటే “అహింసలో జీవించటం” 
అంటే, తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఏ ఘాతకాలూ చేయకపోవడం
అంటే, ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపకుండా ఉండటం 
అంటే, ఏ కక్షల కారణంగానైనా మనుష్యులను చంపకపోవటం 
అంటే, భరించలేని దీన పరిస్థితులలో సైతం ఆత్మహత్య చేసుకోకపోవటం.
అయితే, విధిలేని పరిస్థితులలో ..
“స్వీయప్రాణరక్షణ” కోసం అయితే చంపటం అన్నది కుడా ధర్మయుతమైన చర్య అయినదే;
“స్వీయప్రాణరక్షణ” కోసం క్రూర జంతువులను చంపటమో
లేక మనుష్యులను చంపటమో అన్నది ఎంత మాత్రం అధర్మం కాజాలదు ; 
అది “ఆపద్ధర్మం” అవుతుంది. 
“స్వీయప్రాణరక్షణ” కోసం చంపటం ధర్మయుతమైన చర్య అయినదే కనుక
అక్కడ “ యాభై మార్కులు “ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి
అయితే జీవితంలో “ వంద మార్కులు ” రావాలంటే
“అహం బ్రహ్మాస్మి” అనే సత్యం అర్థం కావాలి
“మనం భువికి దిగివచ్చిన ఆత్మసత్యదేవుళ్ళం” అన్న సత్యం తెలుసుకుని తీరాలి
“మన ఆత్మ అనంతం, శాశ్వతం అయినది” అన్న సత్యం తెలుసుకుని తీరాలి
మన ఆత్మ యొక్క “సమయ పరిధి రాహిత్యం” మరి “వ్యాప్తి పరిధి రాహిత్యం” అన్నవి 
అర్థం అయినప్పుడు “తెలిసీ తెలియని ఆత్మదేవుళ్ళం” అయిన మనం
“ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మసత్యదేవుళ్ళం” గా మారుతాం
అంతేకాకుండా ..
“మన జీవిత వాస్తవాలకు .. జన్మకు పూర్వం మరి జన్మ తరువాత .. మనం స్వయంగా ప్రణాళికాబద్ధంగా సంకల్పించిన ఎంపికలే కారణభూతాలు”
అన్న సత్యం కూడా తెలుసుకోవాలి
అదనంగా 
“ఆనాపానసతి – శ్వాసానుసంధానం ద్వారానే ధ్యాన-సమాధి స్థితి లభ్యం”
అన్న సత్యం కూడా అనుభవపూర్వకంగా తెలియాలి :
అప్పుడే జీవితంలో “వంద మార్కులు” వస్తాయి.
“సున్న మార్కులు”= అధర్మం + అసత్యం
“యాభై మార్కులు” = ధర్మం + అసత్యం
“వంద మార్కులు” = ధర్మం + సత్యం
వంద మార్కుల స్థితిలో :

  • హింస అన్నది కలలో కుడా తలపెట్టం
  • “మనం దివి నుండి భువికి దిగివచ్చిన ఆత్మసత్యదేవుళ్ళం” అని పూర్తిగా అర్థం అవుతుంది
  • “మన వాస్తవాలకు నూటికి నూరు శాతం పూర్వ స్వీయ ఎంపికలే కారణభూతాలు” అని తెలుస్తుంది
  • “ఆనాపానసతి ధ్యానం” అత్యంత సంతోషదాయకమైన దైనందిన అలవాటుగా ఉంటుంది.

ఇదే “ అధర్మం – ధర్మం – సత్యం ” అన్న విషయాల పట్ల మౌలిక ప్రవచనం !
ఇదే “ సున్న – యాభై – వంద ” అన్నపిరమిడ్ ఫిలాసఫీ కాన్సెప్ట్ !