అభ్యాసం = అభ్యాసం = అభ్యాసం
మనిషికి ఆరోగ్యం కావాలి
మనిషికి సుఖం కావాలి
మనిషికి దుఃఖం పోవాలి
మనిషికి ముక్తి కావాలి
మనిషికి జన్మ రాహిత్య పదవి కావాలి
ఈ విధంగా ఎన్నో, ఎన్నో ఆకాంక్షలు
అయితే అభ్యాసం మటుకు చేయడు
కష్టపడటానికి ఇష్టపడడు
అన్నీ ఉత్తినే రావాలి
గురువు గారి పాదాలు పట్టుకోగానే అన్నీలభ్యమవ్వాలి
గుడిలో టెంకాయ కొట్టి ఇంటికి రాగానే ఇంట్లో అవన్నీ ఉండాలి
గుడిలో విగ్రహం ముందు ఒక్క క్షణం కళ్ళు మూసుకోగానే దేవుడు ప్రత్యక్షం కావాలి
ప్రత్యక్షం అయి మన భక్తికి పరవశం అయి అన్ని వరాలూ దోసెట్లో పోసెయ్యాలి
మన బుద్ధి ఇలా తగలడింది
మన మేథస్సు ఇంతగా కుంచించుకుపోయింది
శాస్త్రీయ దృక్పథం పూర్తిగా మృగ్యమైపోయింది
క్రికెట్ నేర్చుకోవటానికి ఎంత అభ్యాసం ఉండాలో,
సంగీతంలో పట్టు సాధించటానికి ఎన్నెన్ని గంటలు పణం పెట్టాలో,
లక్షాధికారి కావటానికి ఎంత చెమటోడ్చాలో,
భార్యా బిడ్డల్ని పోషించటానికి ఎన్ని కష్ట నష్టాలను భరించాలో,
ఒక పెళ్ళి సక్రమంగా జరిపించటానికి ఎన్ని సూక్ష్మమైన విషయాలు గమనించాలో,
ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని తతంగాలు అవసరమో,
ఒక ముక్క కాగితం మీద వ్రాయడానికి ఎంత ఆలోచించాలో,
ఆఫీసు నుంచి ఇంటికి స్కూటర్ డ్రైవ్ చేయటానికి అనుక్షణం ఎంత జాగ్రత్త వహించాలో,
వీటన్నింటికీ ఎంతో అభ్యాసం అవసరం అని అందరికీ తెలుసు.
వీటిలో వేటికీ ఎవరూ పూజలు చేయరు; వ్రతాలు చేయరు,
గురువు పాదాలు పట్టరు; మంత్రాలు వల్లించరు.
అన్నీ అభ్యాసం చేస్తేనే వస్తాయి అని అందరికీ చక్కగా తెలుసు.
కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్ని విషయాలలో చక్కగా గ్రహించారు.
అయితే
శారీరక ఆరోగ్యం అన్నది మటుకు డాక్టర్ల దగ్గరికి పోతూనే వచ్చేసేయాలి.
అలా మందులు మింగుతూనే ఇలా స్వస్థత చేకూరాలి.
డబ్బులు అలా వెదజల్లుతూనే ఇలా ఆరోగ్యం వచ్చేయాలి.
మనం తినే వాటిల్లో మటుకు ఏమీ తేడా ఉండకూడదు.
ఏ యొక్క మనోనియంత్రణా మనం చేయకూడదు.
ఆరోగ్యం మటుకు అలా వచ్చేయాలి.
ఎక్కడికి పోయిందీ మన శాస్త్రీయ దృక్పథం?
ఎక్కడికి పోయిందీ బేసిక్ కామన్ సెన్స్?
అదే విధంగా
వెంటనే ముక్తి వచ్చేసేయాలి. వెంటనే మనం గురువులం అయిపోవాలి.
కానీ, దానికి కావలసిన సాధన మట్టుకు తలపెట్టం,
అన్నింటికీ
తొందర – తొందర – తొందర
నాకింకా మూడో కన్ను తెరుచుకోలేదండీ … ఇదీ వరస
ఎక్కడికి పోయిందీ శాస్త్రీయ దృక్పథం?
ఎక్కడికి పోయిందీ బేసిక్ కామన్ సెన్స్?
ఆరోగ్య సూత్రాలు పాటించం – తగిన సాధన చేయం – కానీ ముక్తి కావాలి
రామచంద్రా! ఈ మానవాళికి బుద్ధి ఎప్పుడు వస్తుందో
మానవాళి సంగతి ఎందుకుగానీ – పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానులందరికీ ఒకటే సందేశం …
అభ్యాసం – మరింత అభ్యాసం – నిరంతరం అభ్యాసం
అభ్యాసం శరణం గచ్ఛామి !
అభ్యాసం శరణం గచ్ఛామి !!
అభ్యాసం శరణం గచ్ఛామి !!!