అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం
నిశ్చయంగా తలచుకుంటే .. నిరంతర కృషీవలురు అయితే
ప్రతి ఒక్కరూ ఒక ఐన్స్టీన్ గా కాగలరు
ప్రతి ఒక్కరూ ఒక లియోనార్డో డా వించి లా అవగలరు
ప్రతి ఒక్కరూ ఒక మదర్ థెరిసా లా అవవచ్చు
ప్రతి ఒక్కరూ ఒక మహాత్మాగాంధీజీ లా కాగలరు
ప్రతి ఒక్కరూ ఒక ఆదిశంకరాచార్యులు కాగలరు
ప్రతి ఒక్కరూ ఒక ఏసు ప్రభువుగా మారగలరు
ప్రతి ఒక్కరూ ఒక గౌతమబుద్ధుడిలా జీవించగలరు
ప్రతి ఒక్కరూ ఒక వేదవ్యాసుడిలా సాధించగలరు
ఎవరైనా ఒకరు ఒకానొక గొప్ప పని చేస్తే దాని అర్థం
“మిగతా అందరూ కూడా ఆ పనిని చేయగలరు” అని ..
దీనినే “ఉపమాన ప్రమాణం” అంటాం
ప్రతి ఒక్కరి దగ్గరా అన్ని శక్తులూ నిబిడీకృతంగా వున్నాయి
అయితే, అవి ప్రకటితం కావడానికీ, యదార్థంగా రూపుదాల్చడానికీ
కావలసినవి “ఆత్మవిశ్వాసం” .. “తీవ్రవాంఛ” .. “లోకకల్యాణ ఆశయం”
“విశ్వాసం” అంటే మన .. మరి ఇతరుల .. ఆత్మశక్తి పట్ల మనకు ఉన్న “అఖండ నమ్మకం”
“విశ్వాసం”అన్నది అత్యంత ప్రబలమైన మౌలికమైన మహాశక్తి!
యోగీశ్వరుల, పరమాత్ముల ఆత్మశక్తి పట్ల నమ్మకం అన్నది “భక్తియోగం” అయితే
మన స్వీయ ఆత్మశక్తి పట్ల నమ్మకం అన్నది “ధ్యానయోగం/జ్ఞానయోగం” అవుతుంది.
మన ఆత్మవిశ్వాసం ఎటువైపు ధారగా ఉంటే అటువైపు మన జీవితం విశేషంగా ప్రసరిస్తుంది
ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా చేయగలం
“శ్వాసధ్యాస ధ్యాన సాధన” ద్వారా మన స్వీయ ఆత్మతో మనం ఎంతగా కలిసి ఉంటామో
అంతగా మన ఆత్మవిశ్వాసం అన్నది విజృంభిస్తూ ఉంటుంది
“ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉన్నా పర్వాతాలను సైతం కదలించవచ్చు” అన్నారు ఏసుప్రభువు
ఆత్మవిశ్వాసంతో పాటు “తీవ్ర వాంఛ” అన్నది కూడా అత్యంత ముఖ్యం
ఈ రెండూ జతకూడితే అసాధ్యాలన్నీ అతి సహజంగా సుసాధ్యాలు అవుతాయి
ఆత్మవిశ్వాసంతో పాటు .. మరి తీవ్రవాంఛ తో పాటు..
“లోకకల్యాణ ఆశయం” అన్నది కూడా కలిపితే జీవితం మరి చరితార్థం అవుతుంది
నేటి “సరియైన పిల్లలే” రేపటి మహాపౌరులు .. నేటి “సరియైన పిల్లలే” రేపటి మహాకళాకారులు
నేటి “సరియైన పిల్లలే” రేపటి మహాశాస్త్రవేత్తలు .. నేటి “సరియైన పిల్లలే” రేపటి మహాయోగులు
విద్యాలయాలన్నీ విధిగా .. ప్రతి విద్యార్ధికీ, విద్యార్ధినికీ
సరియైన ధ్యానవిద్యనూ, సరియైన ధ్యాన అభ్యాసాన్నీ శాస్త్రీయంగా అందించాలి
ప్రతి విద్యాలయంలో కూడా
“ఆనాపానసతి-ధ్యానవిద్య”ను నేర్పించే ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండి తీరాలి
అంతేకాక ప్రతి విద్యాలయం అహింసాధర్మాన్ని ప్రబోధించాలి
మరి శుద్ధ సాత్విక శాకాహార దైనందిన భోజన విధానాన్ని అమలు చేయించాలి
మాంసభక్షణ కోసం “జంతు/పక్షి/మత్స్య జాతుల వధ” అన్నది ప్రాణికోటి పట్ల
మానవజాతి యొక్క “మహా-అత్యాచారం”
“అత్యాచారం ఏదో, “శిష్టాచారం” ఏదో .. విద్యార్థులందరూ విధిగా తెలుసుకుని ఉండాలి
ప్రాపంచిక విద్యలన్నింటి కన్నా మౌలికమైనది .. మరి ముఖ్యమైనది .. “ఆధ్యాత్మిక విద్య”
“ఆధ్యాత్మిక విద్య” ద్వారానే భిన్న భిన్న సంస్కృతుల వాళ్ళు, భిన్న భిన్న జాతుల వాళ్ళు
కలిసి మెలిసి సరియైన సంఘ-జీవితాన్ని అనుభవించగలుగుతారు
“ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నదే ఆరోగ్యశాస్త్రానికి మూలం
“ఆధ్యాత్మిక జీవితం” అన్నదే ఆనంద జీవితానికి సోపానం
“అభిత్థరేథ కల్యాణే .. మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి” అన్నారు బుద్ధుడు
“మొక్కై వంగనిది .. మ్రానై వంగదు”
“A Stitch in time .. saves nine”
“ఆలస్యం అమృతం విషం”