శ్రద్ధ – సహనం

 

మన ప్రాపంచిక ఎదుగదలకూ మరి మన ఆధ్యాత్మిక ప్రగతికీ “శ్రద్ధ” మరి “సబూరి” అన్నవి చాలా ముఖ్యం. డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శ్రద్ధగా ఎన్నెన్నో జన్మల సంగీత సాధన చేశారు కనుకనే వారు ఈ జన్మలో అయిదేళ్ళ వయస్సునుంచే సంగీత కచేరీలు చేస్తూ సంగీతంలో దిట్ట అయ్యారు!

అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గత అనేకానేక జన్మలలో శ్రద్ధగా మరి ఇతోధికంగా ధ్యానసాధనలో తమ జీవితాలను గడిపినవాళ్ళు. కనుకనే ఈ జన్మలో వాళ్ళు ధ్యానంలో కూర్చోగానే తమ దివ్యచక్షువును తెరిపించుకుని .. తమ కుండలినీ జాగృతం చేసుకుని .. తమ గత జన్మల సాధనా ఫలితాన్ని చిటికెలో అందిపుచ్చుకుంటున్నారు.

అంతే సులభంగా తమ ధ్యానప్రచార సేవను శ్రద్ధగా నిర్వహిస్తూ శ్రద్ధగా స్వాధ్యాయం చేస్తున్నారు .. శ్రద్ధగా సజ్జన సాంగత్యం చేస్తున్నారు. “చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా” అని అందుకు తగిన ఫలితాలను పొందుతున్నారు!

“తింటే గారెలే తినాలి; వింటే భారతమే వినాలి; చేస్తే ఆనాపానసతి ధ్యానమే చెయ్యాలి; కడితే పిరమిడ్‌లే కట్టాలి; జీవిస్తే ఓషోలాగే జీవించాలి; ఒక విశిష్ఠ సొసైటీలాగా ఉండాలంటే PSSMతోనే ఉండాలి; ఒక సరియైన మాస్టర్‌లా విరాజిల్లాలంటే పిరమిడ్ మాస్టర్‌లానే నడుచుకోవాలి” అన్నది గత 25 యేళ్ళుగా PSSM ద్వారా మనం ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం!

త్వరలోనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మాంసాహారీ .. శాకాహారీ అయి తీరుతాడు; ప్రతి ఒక్క అజ్ఞానీ .. సుజ్ఞాని అయితీరుతాడు; ప్రతి ఒక్క అధ్యానీ .. ధ్యాని అయి తీరుతాడు. మరి ప్రతి ఒక్క ప్రాణితో మిత్రత్వం చేసితీరుతాడు.

అంతవరకూ మన PSSM ఉద్యమం అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటుంది!!