ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో!
“ఆత్మలోకాలలో వుండే ఆత్మ”
కారణలోక ప్రయాణాలలో .. మహాకారణలోక ప్రయాణాలలో
మరి ఇతర సూక్ష్మలోక ప్రయాణాలలో వుండే ఆత్మ..
ఎప్పుడూ “తన ‘సృష్టి-కల్యాణకర’ తీపి ఎంపికల” పట్ల కట్టుబడి ఉంటుంది!
***
భూమిపైకి వచ్చీ-పోయే “సమయాల” పట్ల ఎంపిక
“సందర్భాల” పట్ల ఎంపిక .. “స్థలాల” పట్ల ఎంపిక
“పరిస్థితుల” పట్ల ఎంపిక .. “సంబంధాల” పట్ల ఎంపిక..
***
ఇలా తన ఎంపికలపై కసరత్తులు చేసుకుంటూ .. చేసుకుంటూ
ఆ కసరత్తుల ఫలితంగా ఆత్మ .. భూలోక ప్రయాణాలలో
సంభవించే మలపులనూ .. మెలికలనూ .. ఆశ్చర్యంగా తిలికిస్తూ
కేవల అనుభవజ్ఞానం పొందడానికే
“ఆత్మలోకాలలో ఉన్న తన స్వగృహం నుంచి”
ఒక సందర్శకురాలిగా ఈ భూమి మీదకు రాకపోకలను సదాసాగిస్తూ ఉంటుంది!
అందుకే .. ఈ భూలోకం అన్నది ఆత్మకు ఎన్నటికీ “స్వగృహం” కాజాలదు!
***
ఇలా రకరకాల “స్వేచ్ఛాయుత స్వీయ ఎంపికల” ద్వారా
ఈ భూమి మీదకు వచ్చీ-పోయే ప్రతి ఒక్క ఆత్మ కూడా
ఇతర ఆత్మల ప్రయాణాలతో ఏ విధమైన విశిష్ఠ సంబంధాన్నీ ఎంతమాత్రం కలిగి ఉండదు!
***
ఆత్మ యొక్క అనంత, శాశ్వత యానంలో
ఎవరి ఎంపికలు వారివే .. ఎవరి పాఠాలు వారివే
ఎవరి అనుభవాలు వారివే .. ఎవరి అనుభూతులు వారివే
ఎవరి సంబంధాలు వారివే .. ఎవరి అనుబంధాలు వారివే
ఎవరి మలుపులు వారివే .. ఎవరి మెలికలు వారివే
ఎవరి తర్కాలు వారివే .. ఎవరి వాస్తవాలు వారివే
ఎవరి యోచనలు వారివే .. ఎవరి దృక్కోణాలు వారివే
ఎవరి మార్గాలు వారివే .. ఎవరి సృష్టి వారిదే
ఎవరి కసరత్తులు వారివే .. ఎవరి ప్రయోగాలు వారివే
ఓ ఆత్మా! ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో!!!