గౌతమ బుద్ధుడు
ఈ భూమండలంలో కాలాన్ని రెండు వేరు వేరు శకాలుగా “గౌతమ బుద్ధునికి ముందున్న శకం” .. “గౌతమ బుద్ధుడికి తర్వాత శకం” అని చెప్పవచ్చు. మౌలికంగా బుద్ధుని తరువాత భూమండలం వేరు .. బుద్ధునికి పూర్వం భూమండలం వేరు.
మన జీవితాలను మనం గౌతమ బుద్ధుని యొక్క జ్ఞానంలో, అనుభవంలో, ఆ యొక్క దివ్య చరిత్రలో, ఆ యొక్క దివ్య జీవితంలో మలచుకుంటే మనం అత్యంత సత్వరమైన ప్రగతి పథంలో ఉంటాం. నేను అదే చూశాను.
బుద్ధుడు పుట్టినప్పుడే, ఆయన జాతకం చూసి “మహా సామ్రాట్ అయినా అవుతాడు; లేకపోతే మహాయోగీశ్వరుడైనా అవుతాడు” అని చెప్పారు.
“నేను అతన్ని చూడలేనే! అతను జ్ఞాని కాకముందే నేను చనిపోతానే! అంతటి గొప్ప జ్ఞానీ, అంతటి గొప్ప యుగపురుషుడూ, పూర్ణపురుషుడూ భూమండలంలో మరొకడు మళ్ళీ పుట్టడు; ఇంతకు ముందు ఎప్పుడూ పుట్టలేదు. అంతటి అత్యద్భుతమైన సంఘటన నేను చూడలేను” అని అసిత మహర్షి ఆ వార్త తీసుకుని శుద్ధోధునిని దగ్గరికి వచ్చి భోరుమని ఏడ్చాడు.
బుద్ధుడిని అల్లారుముద్దుగా సకల భోగాలతో పెంచారు తల్లితండ్రులు! ఆయన సకల కళల లోనూ, సకల విద్యల లోనూ ఆరితేరి అందరికీ ముచ్చటగా వివాహం చేసుకున్నాడు! అయితే, అంతా బాగానే ఉంది పైకి! కానీ లోపల మటుకు ఏదో వెలితి, “ఏదో చేయటం కోసం నేను వచ్చాను; ఏదో పొందడానికి వచ్చాను. అది ఇంకా మొదలు కాలేదే ?! ఏమిటో ఆ సంగతి?!” అని ఆయన ఎప్పుడూ గుంభనంగా తనలోతాను వుండేవాడు.
ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ముక్తసరిగా మాట్లాడేవాడు. అయితే సంపూర్ణంగా, లోపరహితంగా మాట్లాడేవాడు. అందరితో చక్కగా వుండేవాడు. కానీ, “ఏదో లోపల వుందే?!” అని ఆలోచిస్తూ ఉండేవాడు. బయటకు వెళ్ళినప్పుడు చూడడానికి మామూలుగా కనిపించేవి అతని కంటపడకుండా తండ్రి ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు .. బుద్ధుడికి ఎంత మాత్రం వైరాగ్యం రాకుండా చూసుకోవడానికి!
“అతి సర్వత్ర వర్జయేత్” గదా! ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే దానికి వ్యతిరేకంగా జరిగే తీరుతుంది! దేని గురించి మనం అధికంగా భయపడతామో, అది జరిగే తీరుతుంది! శుద్ధోధనుడు చాలా ఎకువగా జాగ్రత్తలు తీసుకునే సరికి, ఒకానొక రోజు బుద్ధుడు బయటకు వెళ్ళి మరి చూడకూడని ముసలితనాన్నీ, చూడకూడని రోగాన్నీ, చూడకూడనీ చావునీ చూసే తీరాడు!
తన రధసారధి చన్నుడిని “ఏమిటయ్యా ఇది?” అని అడిగాడు; ఆ చన్నుడు “స్వామీజీ! ఇవి అందరికీ సంభవిస్తాయి, మీకూ వస్తాయి!” అన్నాడు. “అదేం జీవితమయ్యా?!” వీటి నుంచి బయటపడే ముక్తి మార్గం లేనే లేదా?! అని బుద్ధుడు అడిగాడు.
అప్పుడే ఒక సన్యాసి అటునుంచి అలా వెళుతున్నాడు. “ఆ సన్యాసిని చూడండి .. ఆయన ముక్త పురుషుడు; ఆయన వెంట ఎంతమంది వున్నారో! ‘ముక్తి’ అంటే ఏమిటో ఆయన దగ్గరకు వెళ్తే తెలుస్తుందేమో!” అని చున్నుడు పోయి ఆ సన్యాసిని తీసుకువచ్చాడు …
“ఏమిటయ్యా నువ్వు సాధించింది? నీ ముఖం చూస్తే ఆనందంగానే వున్నట్లుగా కనపడుతున్నావు! ఏం చేశావు?!” అని అడిగి .. ఆ సన్యాసికి తెలిసిన గురువు గార్ల చిట్టా చిరునామాలు అన్నీ తీసుకుని ఆ మరుసటి రోజు ఉదయం గౌతముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
చన్నుడు తీసుకువచ్చిన సన్యాసి చెప్పిన రకరకాల గురువులలో “ఉద్ధక రామభద్రుడు” .. “అలారకలముడు” తో పాటు అనేకమంది ఇతర గురువులు అందరి దగ్గరికీ వెళ్ళి గౌతమ బుద్ధుడు దగ్గర వారు ఏమేం చెప్పారో అవన్నీ – రకరకాల క్రియలు, అభ్యాసాలు, ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామ చర్యలు, రకరకాల సాధనలు అన్నీ చేశాడు.
ఐదున్నర సంవత్సరాలు తిరిగి తిరిగి, చివరకు ఎక్కడా సంతృప్తి పొందక ఇక తనకు తానుగానే అన్నీ తెలుసుకోవాలని నిశ్చయించుకుని ఘోరమైన తపస్సు చేద్దామని అనుకున్నాడు.
ఆహారాన్ని పూర్తిగా విసర్జించి, తనతో పాటుగా ఇంకొక ఐదుగురు మిత్రులతో అలా తపస్సులో ఉండగా శరీరం దాదాపు అవసానదదశలో ఉన్నప్పుడు. “సుజాత” అనే ఒకావిడ ఈ గౌతముడిని చూసి…
“నీకేమైనా పిచ్చి పట్టిందా? మొత్తం ఈ బొమికలన్నీ .. వీపూ కడుపూ .. రెండూ ఏకమై పోయాయి! నువ్వు చేసే సాధన అంతానూ ఈ శరీరం నిలబడితేనే గదా?!” అని పాయసం ఇస్తుంది.
“నిజమే గదా” అని బాగా ఆలోచించి పాయసం స్వీకరించాడు; మెల్లిగా ఒకానొక ఆలొచనా స్రవంతి ప్రారంభమయింది. చిన్నప్పుడు తాను ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ను చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. బాలుడిగా వున్నప్పుడు ఒక ప్రక్కన ప్రాపంచికంగానూ, ఇంకొక ప్రక్కన ఆస్ట్రల్ మాస్టర్స్ తోనూ జీవించాడు; ఇప్పుడు అవన్నీ గుర్తుకు వచ్చాయి.
ఏ ప్రత్యేక ధ్యాన ప్రక్రియా లేదు! ఏ కుంభకమూ లేదు! ఏ రేచకమూ లేదు! ఏ శీర్షాసనమూ లేదు! ఏ మంత్రమూ లేదు: కనుక “ఇవన్నీ కూడానూ తప్పుడు పద్ధతులు” అని అప్పుడు తెలుసుకున్నాడు.
మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసుకుని సహజంగా వున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనించడం మొదలుపెట్టాడు. “నా అంతట నేనే అంతా తెలుసుకోవాలి; చిన్నపిల్లవాణ్ణి అయిపోవాలి” అనుకున్నాడు. చక్కగా కూర్చున్నాడు .. ఒక్కడే వున్నాడు. ఏకాంతంగా వున్నాడు, కూర్చున్నాడు, కళ్ళు రెండూ మూసుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చుంటే, సాయంత్రానికి ఆయన దివ్యచక్షువు సంపూర్ణంగా తెరుచుకుంది!
“రాత్రి” అంటే “మూడు ఝాములు” ఉంటాయి. ఈ మూడు ఝాములలో ఆయనకు సంపూర్ణమైన పరిజ్ఞానం లభించింది. మొట్టమొదటి ఝాములో అన్ని జన్మలలోని అన్ని శరీరాలనూ తెలుసుకున్నాడు .. తన జన్మపరంపరను తెలుసుకున్నాడు .. రెండవ ఝాములో తన కర్మ పరంపరను చూసుకున్నాడు .. మూడవ ఝాములో ప్రతి జన్మ యొక్క కార్య-కారణ సంబంధాన్ని తెలుసుకున్నాడు. దుఃఖ నివారణోపాయాన్ని తెలుసుకున్నాడు.
దుఃఖ నివారణోపాయాన్ని తెలుసుకున్న వెంటనే, “ఇంత కష్టమైనది, ఎంతో కష్టపడి నేను సంపాదించాను! మరి ఎంత మందికి ఇంతటి సహనం వుంటుంది? జీవితంలో ఇంత అంకిత భావం ఎంతమందికి వుంటుంది? అయినా ఇది నేనొక్కడినే తెలుసుకోవటం వల్ల ఎవ్వరికీ లాభం లేదు! కనుక ఎంత కష్టపడి అయినా సరే దీనిని అందరికీ తెలియచెప్పాలి; అందరిలో కొంతమందైనా సత్యాన్ని గ్రహించడం జరుగుతుందేమో” అనుకున్నాడు.
వెంటనే తాను ఎక్కడ వున్నాడో అక్కడ నుంచే గతమబుద్ధుడు ధ్యానబోధనూ, సత్యప్రచారాన్నీ మొదలుపెట్టాడు!