బుద్ధత్వం – తాదాత్మ్యత
“బుద్ధుడు” అంటే .. “ఆధ్యాత్మిక మైన బుద్ధి వున్న ఒకానొక సగటు మనిషి”
“ఒకానొక బుద్ధుడు” అంటే ..
“మిగిలిన అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాబోయే బుద్ధుళ్ళే” అని తెలుసుకున్నవాడు!
“ఒకానొక బుద్ధుడు ” అంటే ..
“ఇతరుల కన్నా భిన్నంగా తనలో విశేషమైన ఏ ప్రత్యేకతలు లేవు” అని తెలుసుకున్నవాడు!
“ఒకానొక బుద్ధుడు అంటే …
“ఇతరులందరిలో కూడా విశేషమైన ఏ ప్రత్యేకతలూ లేవు” అని తెలుసుకున్నాడు!
“ఒకానొక బుద్ధుడు” అంటే ..
“తాను ఒక మహా శూన్యం” అని తెలుసుకున్నవాడు!
“ఒకానొక బుద్ధుడు” అంటే ..
“ఇతరులు అందరూ కూడా మహా శూన్యమే” అని తెలుసుకున్నవాడు!
“తాదాత్మ్యత”
“ఒకానొక బుద్ధుడు” అంటే ..
“తన రోజువారీ సాధారణ దినచర్యల కార్యక్రమాలతో తాదాత్మ్యం చెంది వున్నవాడు”
“రోజువారీ సాధారణ దినచర్యలు” అంటే ..
‘వండడం’ .. ‘తినడం’ .. ‘కూర్చోవడం’ .. ‘చూడడం’ .. ‘నడవడం’ ..
‘మాట్లాడడం’ .. ‘వినడం’ .. ‘పనిచెయ్యడం’ .. ‘చదవడం’ .. ‘ఆలోచించడం’ ..
‘ఆలోచించకుండా ఉండడం’ .. ‘మౌనంగా వుండడం’ .. ఇత్యాది!
“walk while you are walking .. eat while you are eating”
అన్నాడు కదా జగద్విఖ్యాతమైన అలనాటి బుద్ధుడు!
“ఒకానొక బుద్ధుడు” అంటే
సమాజపరంగా తన యదార్థ కర్తవ్యకర్మలతో తాదాత్మ్యం చెందివున్నవాడు
“ఒకానొక బుద్ధుడు” అంటే .. సకలప్రాణికోటితో తాదాత్మ్యం చెందివున్నవాడు
“బుద్ధుడు” అన్న పదానికి మారుపేరే .. “తాదాత్మ్యత”
తన యొక్క మహాశూన్యంతో తన తాదాత్మ్యత; చుట్టుప్రక్కలి మహాబాహ్యంతో తన తాదాత్మ్యత
“బుద్ధత్వం”
“సంఘర్షణ” అన్న పదానికి తావులేనిదే .. “బుద్ధత్వం”
‘భయం’ .. ‘దుఃఖం’ .. ‘సందిగ్ధత’ .. ‘ఆవేశం’ .. ‘అస్పష్టత’
అన్నవాటికి తావులేనిదే “బుద్ధత్వం”
అనుక్షణం మార్పుచెందుతూ .. అనునిత్యం రూపాంతరం చెందుతూ ఉండే ..
బాహ్యాంతరాలను గమనించే శాశ్వతమృదుగంభీరతత్వమే .. “బుద్ధత్వం”
గతంలోని బుద్ధుళ్ళందరికీ వందనాలు!
వర్తమానంలో బుద్ధుళ్ళు అయినవాళ్ళందరికీ అభివందనాలు!
ఇక ముందు బుద్ధుళ్ళు కాబోయేవాళ్ళందరికీ శుభకామనలు!