6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్
“కారణ జన్ములుగా విశేష కార్యార్థమై ఈ భూమి మీద జన్మతీసుకున్న మనం అంతా కూడా .. ప్రతిక్షణం ఆనందంగా జీవించాలి. అలాంటి విజయవంతమైన సార్థక జీవితాన్ని జీవించాలి అంటే .. మన గురించి మనకు సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ‘ మనం అంటే ఏడు శరీరాల సముదాయం ’ అనీ .. ‘ వాటిలో ఒకటైన ప్రాణమయ శరీరంలోని ఆరుచక్రాల చైతన్యస్థితిలో అలరారుతూ వికసించి ఉన్నప్పుడే మనం ఉన్నతమైన సహస్రారం అనే ఏడవ స్థితిలో విరాజిల్లుతాం ’ అనీ తెలుసుకోవాలి.
1. మూలాధార చక్రం : ‘నేను కేవలం భౌతిక శరీరం మాత్రమే’ అనుకునే వాళ్ళంతా కూడా వెన్నెముక చిట్టచివర ఆసనం స్థానంలో ఉన్న మూలాధార చక్రంలో జీవిస్తున్న వాళ్ళు. ఎవరయితే స్వీయ శరీర ధర్మశాస్త్రం పట్ల సరియైన అవగాహన లేకుండా అశాస్త్రీయంగా జీవిస్తూ .. శరీరాన్ని ద్వేషిస్తూ దానిని యమయాతనలకు గురిచేస్తూ ఉంటారో వారి మూలాధార చక్రం ముడుచుకుని పోయి చైతన్య విహీనంగా వుంటుంది. అలా కాకుండా స్వీయ శరీరం పట్ల మిక్కిలి ప్రేమతో, ఎరుకతో ఉంటూ శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరయితే బాధ్యతాయుతంగా జీవిస్తూ వుంటారో వారి మూలాధారం చక్కగా వికసించి .. చైతన్యంతో అలరారుతూ వుంటుంది.
2. స్వాధిష్టాన చక్రం : సదా ‘మనోస్థితి’ లో ఉంటూ ‘మనస్సు’ తోనే జీవించే వాళ్ళంతా కూడా జననేంద్రియాల స్థానంలో ఉన్న స్వాధిష్టాన చక్రంలో ఉన్నవాళ్ళు!
మన మనస్సు మూడు స్థితిల్లో పనిచేస్తూ వుంటుంది.
1. సంకల్ప వికల్పాలతో కూడిన మనోస్థితి
2. ఆలోచనలతో కూడిన చిత్త స్థితి
3. నేను, నాది అనే పరిమితులతో కూడిన అహంకార స్థితి
మనోధర్మ శాస్త్రాన్ని అవగతం చేసుకోకుండా అశాస్త్రీయమైన ఆలోచనలతో మనస్సును ఎవరైతే పదే పదే ఒత్తిడికి గురిచేస్తూ వుంటారో వారి స్వాధిష్ఠాన చక్రం ముడుచుకుని పోయి అత్యంత హీనస్థితిలో వుంటుంది. అలా కాకుండా మనస్సు పనిచేసే ఈ మూడు స్థితులను చక్కగా అవగాహన చేసుకుని తమను తాము ప్రేమించుకుంటూ, వీనుల విందైన సంగీతం, చిత్రకళ, నాట్యం వంటి 64 కళలతో ఎవరయితే తమ మనస్సును రంజింపచేసుకుంటూ ఉంటారో వారి స్వాధిష్టాన చక్రం వికసించి .. చక్కటి చైతన్యంతో అలరారుతూ వుంటుంది.
మూలాధార – భౌతిక కాయం
స్వాధిష్టాన – మనస్సు/చిత్తం/అహంకారం
మణిపూరక – బుద్ధి
అనాహత – మౌనం
విశుద్ధ – సత్యవాక్కు
ఆజ్ఞా – ధ్యానం
సహస్రార – సేవ/సహకారం
3. మణిపూరక చక్రం : శరీరంలోని నాభిస్థానంలో ఉండే మణిపూరక చక్రం ‘ బుద్ధి ’కి సంబంధించింది. యుక్తాయుక్త విచక్షణతో కూడిన బుద్ధిని అనుసరించకుండా ఎవరయితే అవివేకంతో పనులు చేస్తూ ఉంటారో వారి మణిపూరక చక్రం ముడుచుకుపోయి చైతన్యవిహీనంగా మారుతుంది. విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదువుతూ ధ్యానసజ్జనసాంగత్యాదుల ద్వారా బుద్ధిని పదును పెట్టుకుంటూ ప్రయోజనకరమైన పనులు చేయడం ద్వారా బుద్ధి వికసించి .. మణిపూరక చక్రం విప్పారివుంటుంది.
4. అనాహత చక్రం : ‘అ’ అంటే ‘NO’- ‘ అహతం ’ అంటే ‘Sound or Friction’
‘అనాహతం’ అంటే .. ‘సంపూర్ణ మౌనం’
మనం ఎంత మౌనంగా ఉంటే అంతగా మన శరీరంలోని హృదయభాగంలో ఉన్న అనాహత చక్రం వికసించి వుంటుంది. వడ వడ వాగుతూ ఎంతగా మనం లోపలా, బయటా ఘర్షణపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటామో అంతగా మన అనాహత చక్రం ముడుచుకుని పోయి చైతన్యరహితంగా మారుతుంది.
5. విశుద్ధ చక్రం : మన శరీరంలోని గొంతుభాగంలో ఉండే స్వరపేటికను మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో .. మన విశుద్ధచక్రం తెలియజేస్తుంది. ప్రాణం పోయినా సరే.. సత్యపూర్వకమైన మాటలే మనం ధైర్యంగా మాట్లాడాలి. మన సత్యవచనాలను మనం ప్రేమిస్తూ వాటిని త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ ఉన్నప్పుడు మన విశుద్ధచక్రం చక్కగా వికసిస్తూ చైతన్యవంతంగా వుంటుంది.
“మనం తెలుసుకున్న సత్యాన్ని బయటికి చెప్పలేక ఆత్మనూన్యతా భావంతో సతమవుతూ ఉన్నప్పుడు మన విశుద్ధ చక్రం ముడుచుకునిపోయి కళావిహీనంగా మారిపోతుంది.”
6. ఆజ్ఞాచక్రం : మన నుదిటి భాగంలోని రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రాన్ని ‘సుదర్శన చక్రం’ అంటే ‘సరియైన వాటిని దర్శింపజేసే చక్రం ’ అని కూడా అంటాం. ” ధ్యానం ద్వారా మన దివ్యచక్షువు తెరుచుకోబడి చక్కటి ప్రకృతి దృశ్యాలనూ, సూక్ష్మలోకాలనూ మనం దర్శిస్తూ వుంటే మన ఆజ్ఞాచక్రం మరింతగా వికసిస్తూ చైతన్యవంతంగా మారిపోతుంది. అప్పుడే మనం మన పూర్వజన్మ కర్మఫలితాలకు సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుంటూ స్థిత ప్రజ్ఞత్వ స్థితిలో ఉంటాం. అలాంటి నిశ్చల గురుస్థితిలో మనం ఉన్నప్పుడు .. మన మాట మంత్రంలా మారిపోతుంది.
7. సహస్రార స్థితి : వెన్నెముక చిట్టచివరి ఆసన భాగంలో ఉన్న మూలాధార చక్రస్థాయి నుంచి నుదిటి భాగంలోని రెండు కనుబొమ్మల మధ్య వున్న ఆజ్ఞాచక్రపు స్థాయి వరకు ఉన్న ఆరు చక్రాలు సంపూర్ణంగా వికసించి ఉన్నత చైతన్యపు స్థాయిలో మనం ఉన్నప్పుడు మన గురించి సంపూర్ణ జ్ఞానం మనకు తెలుస్తుంది. అప్పుడే ఇతరులకు సేవచేసే అర్హత మనకు వస్తుంది మరి ఇలాంటి సేవార్హతను సంపాదించుకునే స్థాయినే ‘ సహస్రారస్థితి ’ అంటాం.
ఇదంతా కూడా ఆధ్యాత్మిక పరిభాషలో “6+1 ఫార్ములా ” గా చెప్పుకోవచ్చు. “ఇలా సహస్రార స్థితిలో ఇతరులకు సేవచేసే నిష్కామకర్మ స్థాయికి చేరినప్పుడు మనం ఆరురకాల సేవలు చేయగలుగుతాం!
1. మూలాధార సేవ : ఇతరుల భౌతిక శరీరానికి చేసే సేవ, ఉదా: కాళ్ళు పట్టడం, రోగుల శరీరాలను స్వాంతన పరచడం, ఆకలి తీర్చే అన్నదానం చేయడం మొదలైనవి.
2. స్వాధిష్టాన సేవ : ఇతరుల మనస్సులను రంజింపజేసే చక్కటి సంగీతాన్ని వినపించడం, పాడడం, చిత్రాలు గీయడం, నాట్యం చేయడం మొదలైనవి.
3. మణిపూరక సేవ : ఇతరుల బుద్ధిని వికసింపజేసే విజ్ఞానదాయకమైన పుస్తకాలు వ్రాయడం, చదివి వినిపించడం, సజ్జన సాంగత్యాదులను ఏర్పాటు చేయడం మొదలైనవి.
4. అనాహత సేవ : ఇతరులచే విశేషంగా మౌనాభ్యాసం చేయించడం!
5. విశుద్ధ సేవ : ఇతరులకు సత్యపూర్వకమైన మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వడం; సత్యపూర్వకమైన మాటలను మాట్లాడే వారిని గుర్తించి వారిని ప్రోత్సహించడం.
6. ఆజ్ఞాసేవ : ధ్యాన ప్రచారం విశేషంగా చెయ్యడం ” ఇలా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు అత్యంత ఎరుకతో వినయంగా నిరంతరం సేవచేస్తూ వుండడమే .. ‘ సహస్రార స్థితి ’ లో వున్న పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణం మరి అలా జీవించడమే సార్థక జీవితం యొక్క విజయరహస్యం!