అసలైన చదువు

 

పిల్లలు దేనికోసం చదవాలి?

పెద్దలు పిల్లలను దేనికోసం చదివించాలి?

ఉదర పోషణార్ధమా చదువులు?

మనోల్లాసం కోసమా చదువులు?

ప్రకృతి పరిజ్ఞానం కోసమా చదువులు?

లేక సంపూర్ణ ఆత్మపరిణితి కోసమా చదువులు?

ఏ ఒక్కదానికీ కాదు ‘చదువులు’ అన్నవి.

అన్నిటికోసమూ వున్నాయి చదువులు.

అన్ని చదువులూ చదవాలి పిల్లలు.

పిల్లల చేత అన్ని చదువులనూ చదివించాలి పెద్దలు.

అయితే, అన్ని చదువులలోనూ మొట్టమొదటి చదువు ఆత్మ చదువు.

ఆత్మచదువే పిల్లలకు మొట్టమొదటి పాఠ్యశాస్త్రం కావాలి.

ఆత్మచదువు వల్ల పిల్లలు నిర్భయులుగా, నిస్సంశయులుగా మారుతారు.

ఆత్మచదువు వల్ల మిగతా అన్ని చదువులూ త్వరత్వరగా అబ్బుతాయి.

ఆత్మచదువు వల్ల ఆటలూ,పాటలూ ఆశ్చర్యకరంగా సహజం అవుతాయి.

ఆత్మచదువు వల్ల ప్రకృతి తన రహస్యాలను సత్వరంగా బట్టబయలు చేస్తుంది

అక్షరాభ్యాసం అంటే ఆత్మచదువే.

క్షరం కానిది అక్షరం.

క్షరం అంటే నశించేది; అక్షరం అంటే నశించనిది.

ఆత్మే నశించనది.

దేహమే … తెలియకపోతే … నశించేది.

ఆత్మచదువే … అక్షర అభ్యాసం … అంటే.

పిల్లలందరూ ‘అక్షరాస్యులు’ కావాలి.

అంటే ఆత్మానుభావులు గా విలసిల్లాలి.

భూ ప్రపంచంలో ఇక

ఆత్మ శివతాండవం చేయాలి

ఇవే అసలయిన చదువు యొక్క తీరుతెన్నులు.