ధ్యానమే దివ్య జీవితం

 

        

నా జీవితం చాలా వరకు ఏ లోటు లేకుండా ఆనందంగానే సాగిందని చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్య, తమ్ముడు, స్నేహితులు .. అంతా కూడా నాకు ప్రేమను పంచుతూ నా పట్ల ఎంతో అభిమానంగా వుండేవారు.

1964 సంవత్సరంలో తమ్ముడు “అరవింద్” లుకేమియా (రక్త క్యాన్సర్) ద్వారా మరణించడం ఒక పెద్ద అఘాతం .. ఇంటిల్లిపాదీ దుఃఖం .. ఆ తర్వాత మళ్ళీ యథావిధి జీవితం.

1964 సంవత్సరం నుంచి 1974 సంవత్సరం వరకు చదువులతో పాటు సంగీతసాధన, ఆటలూ, పాటలు; 1974వ సంవత్సరం నుంచి సంసారం, 1975వ సంవత్సరం నుంచి ఉద్యోగం, జీవితం ఇలా అందరిలా అతి సాధారణంగా గడిచిపోతున్నా కూడా .. నాలో “ఏదో తపన” నన్ను ప్రశాంతంగా వుండనీయకపోయేది. “ఏదో చెయ్యాలి” అనిపించేది కానీ .. ” ఆ చెయ్యాల్సింది ఏమిటో” తెలిసేది కాదు!

అయితే, 1976 సంవత్సరం నుంచి సహోద్యోగి శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా ధ్యానం చెయ్యడం మొదలు పెట్టాక మాత్రం .. నా మనస్సు క్రమక్రమంగా శాంతించి .. నా లోని ఆరాటానికి ఒక సుస్పష్టమైన మార్గం దొరికినట్లయ్యింది. మిత్రుడు “శ్రీ రామచెన్నారెడ్డి” గారి ద్వారా నేను ఈ “ఆనాపానసతి” శ్వాస ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఆయనకు నా నమస్కారాలు!

1979 సంవత్సరానికి సంపూర్ణంగా ఆత్మజ్ఞానం లభ్యమయ్యింది. వెంటనే” ఇంక ఈ సంసారం .. ఈ ప్రపంచం .. ఈ గోల .. ఇదంతా ఎందుకు? హాయిగా అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతే బాగుంటుందేమో?!” అనిపించింది.

కర్నూలులో వున్న నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుని మనస్సులోనే ‘క్షణకాలంలో’ హిమాలయాలకు వెళ్ళిపోయాను. అక్కడి అందాలన్నీ తిలకించి అక్కడి ప్రశాంతతను అనుభవించి తృప్తిగా తిరిగి వచ్చేసాను.

ధ్యానంలోంచి బయటికి వచ్చాక కూర్చుని ఆలోచించాను. “హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తాం?! అసలు అక్కడ నేర్చుకోవడానికి ఏం వుంది?! నేర్చుకోవాల్సిందంతా ఇక్కడే, ఈ సంసార ప్రపంచంలోనే వుంటూనే నేర్చుకున్నాను కనుక ఎక్కడ నేర్చుకున్నదానిని అక్కడే మరింత సాధన చేసి సంసార ప్రపంచంలోని సంసారులందరికీ పంచాలి” అని బలంగా అనిపించింది! అంతే .. ఇక నా లక్ష్యం నాకు సుస్పష్టం అయ్యింది.

అలా ఒక్క క్షణంలోనే నాకు ‘వైరాగ్యం’, ‘సన్యాసజీవితం’ అన్నీ అయిపోయి .. ‘హిమాలయాల’ కు కూడా వెళ్ళివచ్చేసి ఒక ‘బుద్ధుడి’ లా నా కర్తవ్యాన్ని నేను తెలుసుకున్నాను.

అప్పటి నుంచి నేను ఇంట్లోనే వుంటూ .. నా ఉద్యోగ ధర్మాన్నీ, నా కుటుంబ ధర్మాలనూ సక్రమంగా నిర్వర్తిస్తూ .. ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడ అందరికీ ధ్యానాన్ని నేర్పించడం మొదలుపెట్టాను. ఆత్మజ్ఞానాన్నీ, దుఃఖ నివారణోపాయాలనూ అందరికీ వివరంగా చెప్తూ వచ్చాను. ఈ విధంగా అందరికీ .. అప్పటికీ, ఇప్పటికీ .. నా స్నేహహస్తం చాస్తూ ముందుకు సాగుతున్నాను.

ఈ విద్యను నేను ఒక “గురువు” ద్వారా నేర్చుకోలేదు కనుక కూడా ఎవ్వరికీ “గురువు” ను కాను. ఒక “మిత్రుడి ద్వారా ” నేను ఇంత గొప్ప విద్యను నేర్చుకుని బుద్ధుడి ని అయ్యాను కనుక ఒక “మైత్రేయ బుద్ధుడిని”.

1979 వ సంవత్సరంలో టిబెట్ మహాయోగి లోబ్‌సాంగ్ రాంపా గారు వ్రాసిన విజ్ఞానదాయకమైన పుస్తకం “You Forever “ నేను చదవడం జరిగింది. అందులోని ఆత్మశాస్త్రీయవిజ్ఞానం .. ప్రతిఒక్కరూ విధిగా తమ తమ జన్మ పరంపరలలో చేరుకోవాల్సిన స్థితులను గురించీ నాకు తెలియపరచింది. దివ్యచక్షువు గురించీ, సూక్ష్మశరీరయానం గురించీ, ఆకాశిక్ రికార్డుల గురించీ, మరి మరణానంతర జీవితపు తమ స్వానుభవాలను గురించీ తిరుగులేని విధంగా అందించిన లోబ్‌సాంగ్‌రాంపా గారికి నా ప్రణామాలు!

అటు తరువాత వందల సంవత్సరాల వయస్సున్న శ్రీ సదానందయోగి గారు .. 1975 సంవత్సరంలోనే కర్నూలుకు వచ్చి .. అక్కడ “నా భాగ్యమా” అన్నట్లు నా కోసం ఆరేళ్ళు నిరీక్షించారు. “సృష్టి యొక్క దివ్య ప్రణాళిక” ప్రకారం నేను 1980 సంవత్సరంలో .. వారిని కలిసి, వారి సాంగత్యంలో రెండున్నర సంవత్సరాల పాటు పొందిన అద్భుతజ్ఞానం వెలకట్టలేనిది! 1982 సంవత్సరంలో తాము వచ్చిన పని పూర్తయ్యిందని ప్రకటించి ముందుగానే నిర్ణయించుకున్న తేదీ మరి సమయం ప్రకారం వారు హాయిగా తమ భౌతికకాయాన్ని విడిచి పెట్టేసారు! ఆ రోజు మే 22వ తేదీ 1982 వ సంవత్సరం!

“సుభాష్! నువ్వు చేస్తే చెయ్యి .. లేకపోతే చావు ” అన్నదే గురువు గారి ఆజ్ఞ! “నువ్వు మాంసపిండానివి కాదు .. మంత్రపిండానివి!” అని చెప్పి నాకు దిశానిర్దేశనం చేసిన వారు తమ ఆత్మస్ఫూర్తిని నాకు అందించారు. శ్రీ సదానంద యోగి గారికి నా సాష్టాంగ ప్రణామాలు!

2000 సంవత్సరం నుంచి “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” ద్వారా ప్రణాళికబద్ధంగా, ధ్యానప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి “2004– ధ్యానాంధ్రప్రదేశ్” .. “2008 – ధ్యానభారత్” .. ” 2012 -ధ్యానజగత్” లు పూర్తిచేసుకుని .. “2016 -పిరమిడ్ జగత్” .. “2020 – శాకాహార జగత్” ల పరిసాధనకై లక్షలాది పిరమిడ్ మాస్టర్లందరితో పాటు ముందుకు సాగుతున్నాను.

“ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే వుంటుంది” అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. “ప్రపంచం మారదు; కానీ ధ్యానం ద్వారా మనలో వున్న అశాస్త్రీయతను సరిచేసుకుని చూస్తే .. ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కటీ మనకు అద్భుతంగా కనపడుతూ వుంటుంది” అన్న అవగాహనను పొందాను.

“మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది. మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో, ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది” అన్నది మనం అందరం తెలుసుకోవలసిన సత్యం.

“ముళ్ళకంపలతో నిండిన అడవిలో మనం నడవాలి” అంటే ఆ అడవిలో వున్న ముళ్ళకంపలన్నింటినీ మనం ఏరవలసిన పని లేదు. కేవలం మన కాళ్ళకు చెప్పులు వేసుకుని నడిస్తే చాలు .. క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం.

“ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి” అంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పనిలేదు. మన దృక్పధాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ .. సృష్టిలో వున్న ప్రతి ఒక్క ప్రాణి యొక్క దివ్య వ్యక్తీకరణపట్ల గౌరవభావంతో మెలగుతే చాలు. మనం ఆనందంగా వుంటే అందరూ ఆనందంగానే వుంటారు. “ఎవరి వాస్తవానికి వారే ‘కర్త’, ‘కర్మ’, ‘క్రియ’” అన్న సత్యాన్ని ఎరుకలో వుంచుకుని సదా జీవించాలి.

ముఖ్యంగా, మానవ సమాజంలో మాంసాహారం అన్న అనాగరికత తరతరాలుగా వస్తోంది.”ఇది ఒక తప్పు పని” అని కానీ .. ” దానివల్ల మేము ఒక జీవిని హింసిస్తున్నాము” అన్న అవగాహన కానీ అత్యధికశాతం మందికి లేదు. కోడి, మేక, రొయ్య, చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించడాన్నే జీవనాధారంగా లక్షల కుటుంబాలు తమ “వ్యాపారం” చేసుకుంటున్నాయి.

“తోటి ప్రాణులను పెంచి సంహరిస్తున్నాము” అన్న కనీస మానవత్వపు భావన అన్నది లేకుండా వారు దానిని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. తినేవారు కూడా .. “చనిపోయిన జంతువుల మృతకళేబరాలను తింటున్నాం” అన్న ఎరుక లేకుండా దానిని” సహజం అయిన ఆహారం” లాగే తింటూ .. అనేకానేక పాపాల బారిన, రోగాల బారిన పడుతున్నారు.

సర్వదుఃఖాలకూ మూలకారణం అయిన మాంసాహార భక్షణను నిరసించాలి! మరి మాంసాహారం తక్షణమే మానాలి! .. జీవహింసను ప్రోత్సహించే సకల అనర్థాలను నిరోధించాలి! మరి శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం వల్ల మనం యోగులుగా మారుతాం .. మరి మాంసాహారం మానడం వల్ల శారీరక శుద్ధీ కరణం జరుగుతుంది.

ఈ భూగ్రహ చరిత్రలో ఇంతవరకూ ఎంతో మంది బుద్ధుళ్ళు వచ్చారు .. మరెంతోమంది బుద్ధుళ్ళు భవిష్యత్తులో కూడా వస్తారు. అయితే “సత్యయుగ కాంతి కార్యకర్తలు” గా ఈ భూమి మీదకు వచ్చే వారిని ” బుద్ధుళ్ళు” గా గుర్తించడం సామాన్య జనాలకు చాలా కష్టం. అందరిపట్ల స్నేహపాత్రులై వుంటూ, కరుణను కురిపించే వాళ్ళే “మైత్రేయ బుద్ధుళ్ళు”!