నవ విధ ధర్మాలు

 

‘ ధర్మమా ? ‘ .. ‘ అధర్మమా ? ‘

‘ ధర్మాచరణమా ? ‘ .. ‘ అధర్మాచరణమా ? ‘

ఎవరి బుద్ధిని వారు పదును పెట్టుకుంటూ ..

ఎప్పటికప్పుడు ధర్మాధర్మాలను తెలుసుకుంటూ ధర్మాన్నే శరణుకోరుతూండాలి ..

“యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధిః స ధర్మః “

.. అన్నారు వైశేషికదర్శన కారకులు – కణాదమహర్షి

అంటే

 “ఇహలోకపరంగా అభ్యుదయాన్నీ, మరి పరలోకపరంగా జన్మరాహిత్యపదవినీ

ఏదైతే ప్రసాదిస్తుందో .. దాన్ని ‘ ధర్మం ‘ అంటారు “

 “ధర్మాచరణ “

ధర్మాచరణ ద్వారానే ఊర్థ్వగతి .. అధర్మాచరణ ద్వారా అధోగతి

 “యా మతిః సా గతిర్భవేత్ ” అన్నాడు అష్టావక్రుడు

అంటే

“మన మతి ఎలా ఉంటుందో మన గతి ఖచ్చితంగా అలానే ఉంటుంది “

మతిని బట్టే గతి

ధర్మాన్ని శరణు కోరితే .. “సుమతి “

ధర్మాన్ని కాలదన్ని .. అధర్మాన్ని చేపడ్తే ..  “కుమతి “

“ధర్మోరక్షతి రక్షితః “

” ఎవరి ద్వారా అయితే ధర్మం రక్షించబడుతుందో .. వారి చేత రక్షించబడిన ధర్మం తిరిగి వారినే రక్షిస్తుంది “

ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ ధర్మరక్షణలోనే తన జీవితాన్ని గడుపుతాడు

ఈ సత్యాన్ని తెలియనివాడు .. తెలిసీ విస్మరించినవాడు .. అధోగతి పాలవుతుంటాడు.

“అధర్మః భక్షతి రక్షితః “

“ఎవరయితే అధర్మాన్ని రక్షిస్తారో .. ఎవరయితే అధర్మాన్ని పోషిస్తారో .. అధర్మానికి

కారణభూతులవుతుంటారో వారిచేత సృష్టించబడిన అధర్మం .. తిరిగి వారినే భక్షిస్తుంది”

ఎవరికి వారే, కర్మల తీరే

మన వాస్తవాలకు .. సదా .. మనమే సృష్టికర్తలం

“నవ విధ ధర్మాలు”

 “ధర్మం ” అన్నది నవ విధాలుగా మానవ జీవితంలో విరాజిల్లి వుంది

 “ధ్యానధర్మం ” .. ప్రతిరోజూ విధిగా ధ్యాన అభ్యాసంలో వుండడం

ప్రతిరోజూ కొంత సమయాన్ని ఎవరితో వారు గడపడం

ఆత్మ ఆత్మలో ఆత్మగా అణిగిమణిగి వుండడం

అహింసాధర్మం ” .. శాకాహారంతోనే మానవ మనుగడను సాగించడం

భౌతికంగా ఏ ప్రాణి పట్ల కూడా అత్యాచారం, హత్యాచారం చేయకపోవడం

మిత్రధర్మం ” .. సకలప్రాణికోటి పట్ల స్నేహశీలత

కరుణాధర్మం ” .. దయనీయస్థితిలో ఉన్న తోటి ప్రాణులకు సాధ్యమైనంత చేయూతనివ్వడం

శాంతిధర్మం ” .. షిరిడీసాయి ప్రవచించిన ” సబూరీ ” పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లోని ” సహనం “

 “ఆరోగ్యధర్మం ” .. పాంచభౌతిక శరీరం పట్ల మన జాగ్రత్త, మన కర్తవ్యం, మన శ్రద్ధ

మితాహారం మరి నిరాహారం .. వీటికి తగిన స్థానం కల్పించడం

స్వాధ్యాయధర్మం ” .. బుద్ధిని ఎప్పటికప్పుడు మరింత వికసింపచేసుకుంటూ, మరింత విస్తారం చేసుకునే ప్రక్రియ

వినయధర్మం ” .. మనకన్నా ఆయుష్షు, బుద్ధి ఎక్కువ ఉన్నవారి పట్ల ఒదిగి ఉండడం

 “దానధర్మం ” .. మనకు అవసరం ఉన్నంత మన దగ్గర తప్పకుండా ఉంచుకుని మన స్వంత అవసరానికి మించి ఉన్న సంపదను లోకకల్యాణనిమిత్తం వినియోగించడం

అయితే .. తనకు మాలిన ధర్మం ససేమిరా పనికిరాదు .. పాత్రనెరిగి దానం చేయాలి

అపాత్ర దానం ససేమిరా కూడదు .. అపాత్ర దానం అంటే అది బూడిదలో పోసిన పన్నీరు.