‘పాదం’ కాదు .. ‘పదం’ పట్టుకోవాలి

మనమందరం దిగివచ్చిన దేవుళ్ళం

ఎక్కడెక్కడి లోకాల నుంచో ఇక్కడికి అంటే భూలోకానికి దిగివచ్చిన దేవుళ్ళం. ఎలాగంటే మనం అందరం ఈ హాలులోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఈ హాలుకూ మనకూ ఎలాంటి బంధం లేదు. ఇక్కడ రెండు గంటలు వుంటాం, మళ్ళీ తిరిగి మన స్వస్థానాలకు .. మన ఇళ్ళకు వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చాం? తిరిగి ఎందుకు వెళ్తాం? ఎందుకు వచ్చాం అంటే “ఎవరో ఓ స్వామీజీ వస్తారట, ఏదో చెబుతారట. ఏ పుట్టలో ఏం వుందో? విందాం తెలుసుకుందాం. పనికి వచ్చేదయితే ఆచరిద్దాం.. లేదంటే ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడదాం”.

తెలియంది మనం తెలుసుకుంటాం ; ఏది అంతవరకు తెలియదో అది తెలుసుకుంటాం; తెలుసుకుని తిరిగి మన ఇంటికి మనం వెళ్తాం. అలాగే ఎన్నెన్నో లొకాల నుంచి మనం ఇక్కడికి వచ్చాం; దిగి వచ్చాం; ఇక్కడ అన్నీ తెలుసుకుంటాం. తిరిగి మన లోకాలకు మనం వెళ్తాం. ‘దిగి’ వచ్చిన మనం కొంచెం ‘ఎదిగి’ వెళ్ళాలి. ఎలా వచ్చామో అలా వెళ్ళకూడదు.. ఎదిగి వెళ్ళాలి. ఒకే జన్మలో అన్నీ తెలుసుకోలేం. ఒకొక్క జన్మలో కొంత కొంత తెలుసుకుంటాం. తెలుసుకుని తీరాలి.. “మనకు ఎన్ని జన్మలు వుంటాయి?” అంటే సగటున 400 జన్మలు. మూర్ఖుడైతే వాడు చేసిన పాపపు, చెడు కర్మల వల్ల ఈ నాలుగు వందలు, అయిదు వందల దాకా వుండవచ్చు. వారి మూర్ఖత్వం, అలసత్వం వలన, హింస వలన, ఎన్నో పాపపు కర్మలు ప్రోగు చేసుకుంటారు.

ఒక చిన్న చేప సముద్రంలో చక్కగా ఆడుకుంటోంది. వీడొక వేటగాడిలా వలవేసి పట్టుకుని, చంపి తింటున్నాడు ..ఎంత దారుణం. ఒక మేకపిల్ల చెంగు .. చెంగున .. ఎగురుతూ ఆడుకుంటోంది. అ ఆడుకునే మేకపిల్లని చంపి ఆ కుళ్ళిన శవాన్ని .. ఆ కంపు కొడుతూన్న శవాన్ని తింటున్నారు. ఎంత దరిద్రం.. రామచంద్రా; చేసిన చెడు కర్మలు అన్నీ అనుభవించాలి.

వర్తమానంలో హింసతో వుంటే భవిష్యత్ అంతా అంధకారం. అయోమయం .. అస్తవ్యస్తం .. వర్తమానంలో మనం ఎంత అద్భుతంగా వుంటే మన భవిష్యత్ అంత మహాదానందంగా వుంటుంది. వర్తమానంలో వున్న ఒకానొక ఆత్మ .. మూర్ఖాత్మస్థాయి నుంచి .. దుష్టాత్మస్ఠాయి నుంచి .. శుభాత్మస్థాయి నుంచి .. మహాత్మస్థాయి నుంచి .. “పరమ ఆత్మ” స్థాయికి ఎదగాలి.. ఈ జన్మలోనే

ఈ జన్మలో నేర్చుకోవాల్సింది ఈ జన్మలోనే నేర్చుకోవాలి. లేకపోతే ఇప్పుడు నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే ఆ నేర్చుకోవడం కోసం అంటే అదే పని కోసం, లేదా అదే తరగతి కోసం,మళ్ళీ మళ్ళీ పుట్టాలి.

గుడికి వెళ్ళి గుడి చుట్టూ తిరుగుతూ “అదే ఆధ్యాత్మికత” అనుకుంటూ వున్నారు? భ్రమలో వున్నారు? అది భౌతికపరమైన శ్రమ మాత్రమే. “దేవుడు ఎక్కడ? దేవుడు ఎక్కడ?” అని దేవులాడే వాడు దేవుడు; మనమే దేవుళ్ళం.

మన జీవితం అజ్ఞానం ద్వారా చేసిన చేష్టల ద్వారా ముడి మీద ముడిలా వుంటుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వుండాలి. చివరగా అన్ని ముడులు విప్పి “పరమ ఆత్మ” గా ఎదిగి ఇక్కడ నుంచి నిష్క్రమించాలి. మనం ఎన్ని పాపాలు చేసామో మనకే తెలుసు .. మనం ఎన్ని పుణ్యాలు చేసామో మనకే తెలుసు .. వేరే ఎవరో వచ్చి చెప్పక్కరలేదు. మన ఆకలి మనకు మాత్రమే ఎలా తెలుసో .. అలా అన్నమాట. ఈ ఆత్మ మరి “పరమ ఆత్మ” గా నిష్క్రమించడమే మన లక్ష్యం కావాలి. ఇది ధ్యానం ద్వారానే సాధ్యం ధ్యానం మనకు అన్నీ ఇస్తుంది; ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో సంపద.

ధ్యానాన్ని అందరికీ అందించడమే “పరమ ఆత్మ”ల కార్యం. ఏది నేర్చుకుంటే ఇక ఏమి నేర్చుకోవలసిన అవసరం లేదో .. ఏది ఇస్తే ఇంక ఏమి ఇవ్వవలసిన అవసరం లేదో .. ఏది చేస్తే ఇంక ఏమి చేయవలసిన అవసరం లెదో .. ఏది తీసుకుంటే ఇంక ఏమి తీసుకోవలసిన అవసరం లేదో .. అది నేర్చుకోవాలి .. అది ఇవ్వాలి .. అది చేయాలి.. అది తీసుకోవాలి. అదే ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఈ సత్యం నేను 30 సం||ల క్రితం తెలుసుకున్నాను. అప్పటి నుంచి ధ్యానం అందరికీ ఇస్తూనే వున్నాను. మనం అందరం అందరికీ ఇవ్వవలసింది ధ్యానం ఒక్కటే.

రమణ మహర్షి మౌనం అందించారు; గౌతమ బుద్ధుడు ధ్యానం అందించాడు. అయితే మన పాత్ర శుభ్రంగా లేదు, మన మనస్సు, మన బుర్ర చెత్తతో నిండిపోయింది. ఈ చెత్తని శుభ్రం చేసుకోవాలి .. అది శుభ్రం చేసుకోకుండా అందులో పాయసం పోసినా విషంగానే వుంటుంది. ముందు మన పాత్ర శుభ్రంగా వుండాలి. మన మనస్సు శుభ్రంగా వుంటే అందరూ చెప్పేది మనకు అర్థమై, వంటబడుతుంది.

ఎవరి మనస్సులోని చెత్తను వారే శుభ్రం చేసుకోవాలి. నేను శుభ్రం చేయను ; చేయలేను . మీ తల మీద నా చేయి పెడితే ఏమిరాదు .. నా చెయ్యి మీ తల మీద పెడితే తలనొప్పి పోదు.. మీ తలలోని చెత్తపోదు. అలాగే నా పాదాలు తాకితే ఏమిరాదు అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు; నా పాదాలకు వున్న దుమ్ము మీ చేతి అంటుతుందే తప్ప ఇంక ఎలాంటి ప్రయోజనమూ చేకూరదు.

సచిన్ టెండుల్కర్” పాదాలు తాకితే క్రికిట్ ఎలా రాదో “త్యాగరాజ స్వామి” పాదాలు తాకితే సంగీతం ఎలా రాదో.. నా పాదాలు తాకితే మీకు ధ్యానం, జ్ఞానం రావు. నా పాదాలు కాదు నా “పదాలు” పట్టుకోవాలి. పాదాలకు నమస్కారం కాదు .. నా పదాలకు .. నమస్కారం చేయాలి.

నా పదం నా నోట్లోంచి రాలేదు .. నాలోంచి వచ్చింది. దీన్నీ పట్టుకోవాలి. మీరు వింటున్నారు అంటే మీ చెవులు వినడం లేదు .. మీరు వింటున్నారు. నేను ఈ వస్త్రం ఎలా కాదో నేను ఈ చెయ్యి, కాలు, చెవి కాదు. నేను ఈ వస్త్రం తీసేస్తే మారిపోతానా? రేపు ఇంకొక కొత్త వస్త్రం వేసుకుంటాను. అంతేకానీ నేను మారను.. నేను నేనే

“(బ్యాగులోంచి ఫ్లూట్ తీస్తూ) .. ఈ వేణువులో సంగీతం వుంది. నేను 40 సం|| సాధన చేసాను కనుక నేను వాయించగలను. ఈ వేణువు యొక్క సృష్టి మానవుడు చేసింది. ఈ దేహం సృష్టికర్త సృష్టి. మానవుని సృష్టి అయిన ఈ వెదురులోనే ఇంత సంగీతం వుంటే ఆసృష్టి కర్త సృష్టించిన ఈ ఆత్మలో ఎంత సంగీతం వుంటుందో. మన జీవితానికి మనం సృష్టికర్త. ఈ శరీరాన్ని సృష్టికర్త సృష్టించాడు .. ప్రధమ సృష్టికర్త నా జీవితం నా సృష్టి: నా శరీరం సృష్టికర్త సృష్టించాడు. నా చేతలు నా సృష్టి; నా చూపులు నా సృష్టి; నా మాటలు నా సృష్టి; నా కోరిక నా సృష్టి; 30 సంవత్స్రాల క్రితం ధ్యానం నేర్చుకోవడం నా స్రుష్టి; 40 సం|| సంగీతం నేర్చుకోవడం నా సృష్టి.

“మన జీవితాలకు మనమే సృష్టికర్తలం. మన పాపాలకూ, మన పుణ్యాలకూ, మన రోగాలకూ, మన దుఃఖాలకూ మనమే సృష్టికర్తలం. పాపానికి పాప ఫలితం, పుణ్యానికి పుణ్యఫలం దక్కుతుంది. మూడు రకాల కర్మలు వున్నాయి. పాప కర్మలు ,పుణ్య కర్మలు, ధ్యాన కర్మలు.

ఏ ప్రాణినైనా హింసిస్తే – పాప కర్మ

ఏ ప్రాణికైనా సహాయం చేస్తే – పుణ్య కర్మ

ధ్యానంచేస్తే – ధ్యాన కర్మ