పిరమిడ్ భగవద్గీత
అనేకానేక లోకాలనుంచి ఈ భూమ్మీదికి మనం అంతా దిగివచ్చిన పని 2012 కల్లా పూర్తయిపోయింది ! కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఈ లోకానికంతటికీ ” శ్రీకృష్ణ భగవద్గీత ” అందించబడినట్లు .. 2012 కాస్మిక్ పార్టీ తరువాత ” పిరమిడ్ భగవద్గీత ” అయిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయబడ్డాయి.
1. సరియైన ధ్యానం చేయటం: అందరిచేతా సరియైన ధ్యానాన్నే చేయించడం
2. సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం: అందరిచేతా సరియైన పుస్తకాలనే చదివించడం
3. ధ్యానానుభవాలను పరస్పరం పంచుకోవడం: సజ్జనసాంగత్యం విధిగా చేయడం
4.వీలయినంత వరకూ మౌనాన్ని అలవరచుకోవడం: ప్రజల్పరాహిత్యం అన్న దానిని అభ్యసించడం
5.పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయడం
6.వీలయినప్పుడల్లా ‘ పిరమిడ్ శక్తి ’ని ధ్యానంకోసం వినియోగించుకోవడం.
7.అల్లోపతి మందులు ఏమాత్రం వాడకపోవడం: వాటిని పూర్తిగా వ్యతిరేకించడం
8.ఏమాత్రం మాంసం తినకపోవడం: దానిని పూర్తిగా వ్యతిరేకించడం
9.ప్రకృతితో సహజీవనం గడుపుతూ వుండడం: అడువుల్లో ట్రెక్కింగ్‌లు చేస్తూ వుండడం
10.ప్రత్యేక వేషధారణ అన్నది లేకపోవడం: కర్మకాండలు చేయకపోవడం
11.చిన్న వయస్సు నుండే ప్రతి ఒక్కరికీ ధ్యానశిక్షణ ఇవ్వడం.
12.‘ శిష్యరికం ’ అన్నది లేకుండా అందరూ ‘ మాస్టర్లు ’గా విలసిల్లడం
13.ధ్యాన శిక్షణా కార్యక్రమాలు ఎప్పుడూ నిశ్శుల్కమే, ఉచితమే
14.విగ్రహారాధన తగదు: దేవాలయాలను ధ్యానాలయాలుగా మార్చడం
15. ధ్యానశక్తితో ఎవరి జీవన సమస్యలను వారే పరిష్కరించుకోవడం
16.సాధారణ వృత్తులలో వుంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని గడపడం.
17. ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ ధ్యానకేంద్రాలను నెలకొల్పడం
18.స్వీయ ధ్యానానుభవాలనూ, ఇతర ఆధ్యాత్మిక విశేషాలనూ పుస్తకాల రూపంలో ప్రచురించడం.
ఈ పద్దెనిమిది సూత్రాలు మనకు భగవద్గీతలా ఆచరణయుక్తమైన నిత్యజీవన సూత్రాలు ! వాటిని అంకితభావంతో పాటిస్తూ అనుక్షణం బ్రహ్మతత్త్వంలో గడిపేవారి జీవితాలు వైభోగంతో నిండి వుంటాయి.
యోగం మరి భోగం కలగలిసిన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని అవతారం మనకు వైభోగం యొక్క విశ్వరూపాన్ని తెలియజేస్తుంది. ” వైభోగం ” అన్నది మనం చూసే చూపునుబట్టే వుంటుంది. పరిమిత జ్ఞానంతో అవగాహన చేసుకునే వారికి ఈ లోకంలో ” వైభోగం ” అన్నది పరిమితంగానే కనబడితే .. అపరిమితమైన బ్రహ్మతత్త్వంతో కూడి వున్న వారికి ఈ విశాల విశ్వం అంతా కూడా వైభోగంతో విశేషంగా నిండిన స్వంత వసుధైకకుటుంబంలా కనిపిస్తుంది. ఇలా .. ” అంతా నేనే ” .. ” సర్వస్వం అంతా నా కుటుంబమే ” .. మరి ” అందరూ నా వాళ్ళే ” అయినప్పుడు ఉన్నదంతా వైభోగమే .. బ్రహ్మనందమే !
ఇవన్నీ ఆధ్యాత్మిక జీవిత సత్యాలు ! వీటికి మనకు ఏ గురువులూ నేర్పించరు ! సత్కర్మల ద్వారా అత్యంత ఎరుకతో మనకు మనమే స్వయంగా నేర్చుకుంటూ .. మన స్వంత అనుభవజ్ఞానంతో మన బ్రతుకులను పండించుకోవాలి. ఇదే పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శసూత్రాలతో కూడిన పిరమిడ్ భగవద్గీతా సారం ” !