రాత్రి సమయాల్లో ఆనాపానసతి ధ్యాన సాధన ..
పగటి సమయాల్లో అహింసాధర్మాచరణ
” ప్రాపంచిక మాయలో పడిపోయి మనం ఆత్మ సత్యాన్ని మరిచిపోతే .. ‘ నేను కేవలం శరీరధారుడినే ‘ అన్న అజ్ఞానంతో కూడిన దుఃఖంలో కూరుకుపోతాం. మన స్వీయ ఆత్మతత్వాన్ని మరచిపోయినప్పుడే మనం ఇతరుల పట్ల హింసాత్మక కార్యక్రమాలను చేస్తూవుంటాం. కర్మసిద్ధాంతం ప్రకారం అనేకానేక కర్మలను కూడగట్టుకుంటూ .. రోగాలూ, బాధలూ, కష్టాలూ కన్నీళ్ళూ .. ఇంకా ఇంకా అనేకానేకమైన పాపాల్లో ఇరుక్కుంటూ మనకు మనమే నరకాన్ని సృష్టించుకుని మనకు మనమే శతృవుల్లా మారిపోతాం.
” వీటన్నింటికీ కారణం మన అజ్ఞానమే. ఈ సృష్టిలో మనతోపాటే పుట్టి మనతోపాటే మనుగడసాగిస్తోన్న మన సహోదరులైన ఇతరజీవులను చంపితింటూ .. దానిని నాగరికత అని గొప్పగా చెప్పుకుంటున్నాం. పూజలూ, బలులూ అంటూ ‘ దేవుడి ‘ పేరుతో అనేకరకాలైన అపచారాలను చేస్తున్నాం.
” సృష్టిపరిణామక్రమంలో ముందుకు దూసుకుపోవాల్సిన ఈ తరుణంలో .. ఇక ఇన్నాళ్ళుగా మనం తెలిసీ తెలియక చేసిన ఈ అపచారాలన్నీ ఆపేద్దాం. ‘ పెద్దలు నియమాలను ఏర్పరచారు ‘ అన్న మూఢనమ్మకాల్లోంచి బయటికి వద్దాం. ఏ దేవుడు కూడా హాయిగా బ్రతుకుతోన్న ఇంకొకజీవిని బలవంతంగా పట్టితెచ్చి చంపి తనకు నైవేద్యం పెట్టమని మనల్ని అడుగడు. మనమే .. మనలో ఉన్న రాక్షసత్వపు కోరికలకు ‘ దేవుడి ‘ పేరు పెట్టి ఇలా హింసాత్మకమైన పనులను చేస్తూంటాం.
” అధర్మయుతం అయిన ఈ హింసాత్మక చర్యలన్నింటినీ తక్షణం ఆపేద్దాం. మన స్వీయ ఆత్మసత్యాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకోవడానికి నిరంతరం ధ్యానసాధన చేద్దాం .. మరి ఇతర జీవులలోని ఆత్మతత్వాన్ని గౌరవిస్తూ ధర్మాచరణలో జీవిద్దాం.
” చంద్రుడు రాజ్యంఏలే రాత్రిసమయాన్ని ధ్యానసాధనలో సద్వినియోగపరచుకుంటూ .. స్వీయ ఆత్మసత్యంలో జీవిద్దాం. సూర్యుడు రాజ్యంఏలే పగటిసమయం అంతా అహింసా ధర్మాచరణలో పునీతులం అవుతూ .. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ధ్యానం మరి అహింస ఈ రెండు శక్తివంతమైన అస్త్రాలు మత్రమే ప్రస్తుతం మానవాళిని రక్షించే తిరుగులేని రామబాణాలు.”