ఆదిశంకరులు
ఆదిశంకరులు, ఆ పేరు ఉచ్ఛరిస్తేనే తనువు, మనస్సు, బుద్ధి, అత్మ అన్నీ పులకరిస్తాయి.
ఆదిశంకరుల తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనోచక్షువుతో ఊహించగలగటంతోనె మన భౌతికకాయం పులకిస్తుంది.
ఆ నిర్మలాతి నిర్మలమైన మనస్సును తలచుకుంటేనే మన మనస్సు ఉర్రూతలూగుతుంది.
ఆయన బుద్ధి తీవ్రతను ఒకింత గమనిస్తే చాలు, మన బుద్ధి తీవ్రతరం అవుతుంది. ఆ మహోన్నతమైన ఆత్మబోధనలను దర్శించగలిగినవాళ్ళ ఆత్మ గగుర్పాటు చెందకుండా ఉండటం అసంభవం.
శ్రీ శంకరులవారు మేటి అయిన జ్ఞాని, సాటిలేని యోగి. ఆయన బ్రహ్మజ్ఞానికి నిదర్శనం ఆయన మ్రోగించిన అద్వైత భేరే.
ఆయన మహత్యాలు మచ్చుకు:
-
భౌతికకాయాన్ని అంటే మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసి ఇష్టం వచ్చిన ప్రదేశాలకు క్షణకాలంలో వెళ్ళగలడం.
-
పరకాయ ప్రవేశ విద్యను కేళీవిలాస ప్రాయంగా చేయగలగడం.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటి ధ్యానులందరికీ శ్రీ శంకరుల వారు ధృవతార. ప్రతి ఒక్కరూ శంకరులుగా కావాలి. అదే ఆదిశంకరులు కోరుకునేది.
అందుకు అణుమాత్రమైనా తక్కువ ధ్యేయం పెట్టుకుంటే ఆయన పకపక నవ్వుతాడు. అవహేళన చేస్తాడు.
శంకరుల ఆధ్యాత్మిక బోధనలలో కోహినూర్ వజ్రంలాంటిదైన భజగోవిందం ముఖ్యంగా పిరమిడ్ ధ్యానులందరి జీవితాలలో విడదీయలేని అంతర్భాగం అయ్యింది.
ప్రతి ధ్యానం క్లాసులోనూ, శిక్షణా శిబిరంలోనూ భజగోవింద శ్లోకాలు గానం చేయబడకపోతే ఆ ధ్యానం క్లాసు సార విహీనంగా, కళారహితంగా ఉండటం మనందరికీ ప్రత్యక్ష అనుభవం.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఫిలాసఫీ అన్నది బుద్ధుడి యొక్క, శంకరుడి యొక్క, జీసస్ క్రైస్ట్ యొక్క, మహమ్మద్ యొక్క, మహావీరుడి యొక్క అద్భుతమైన ధ్యాన ప్రకాశాలతో ఆవిర్భవించినదే, పిరమిడ్ ఫిలాసఫీ అన్నది వారందరి బోధనలతో సంపూర్ణంగా నిండి వుండి న భూతో న భవిష్యతి అన్న విధంగా పరిపుష్టమైనదే.
శ్రీ శంకరులవారి పాదపద్మాలకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానులందరి వినమ్ర వందనాలు; వినయపూర్వక కైమోడ్పులు.
ఓ మహాస్వామి, మీరు మాలో వున్నారు, మీరు మా వెంట వున్నారు, మాతో కలిసి అద్వైతంగా వున్నారు.